- Home
- Feature
- Tirumala : అలంకార ప్రియుడు శ్రీవారికి రూ.200 కోట్ల బంగారు ఆభరణాలు.. ఎవరీ వర్దమాన్ జైన్?
Tirumala : అలంకార ప్రియుడు శ్రీవారికి రూ.200 కోట్ల బంగారు ఆభరణాలు.. ఎవరీ వర్దమాన్ జైన్?
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని అలంకార ప్రియుడిగా పేర్కొంటారు. అలాంటి స్వామికి ఆపాదమస్తకం అలంకరించేలా ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలు సమర్పించాడు ఓ భక్తుడు.

తిరుమల వెంకన్నకు భూరివిరాళం
Tirumala : పూర్వం చక్రవర్తులు, రాజులు దేవాలయాలకు భూరి విరాళం ఇచ్చేవారని చరిత్ర చెబుతోంది. ఇలా తిరుమల వెంకటేశ్వర స్వామికి కూడా విజయనగర చక్రవరి శ్రీకృష్ణదేవరాయలు బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు అందించారని... శ్రీవారికి కనకాభిషేకం చేశారని కథలు కథలుగా చెబుతారు. అయితే రాజుల కాలం అంతరించినా శ్రీవారికి ఇలాంటి విరాళాలు మాత్రం ఆగడంలేదు... తాజాగా ఓ భక్తుడు ఏకంగా రూ.200 కోట్లకు పైగా విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామికి సమర్పించి చరిత్రను గుర్తుచేశాడు. అలంకార ప్రియుడైన శ్రీవారికి శిరస్సు నుండి పాదాల వరకు అలంకరించే ఆభరణాలను విరాళంగా అందజేసి భక్తిని చాటుకున్నాడు. ఇంతకీ ఆ భక్తుడు ఎవరో తెలుసా?
ఎవరీ వర్దమాన్ జైన్?
ఏడుకొండలపై వెలసిన తిరుమల వెంకటేశ్వరస్వామికి ఓ అజ్ఞాత భక్తుడు వందల కోట్ల బంగారు ఆభరణాలు విరాళంగా ఇస్తున్నాడంటూ గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. తాజాగా ఆ భక్తుడు ఎవరో తెలిసిపోయింది. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వర్ధమాన్ జైన్ శ్రీవారిపై తనకున్న అచంచల భక్తిని చాటుకున్నాడు... భారీ విరాళం అందజేశాడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఏకంగా 121 కిలోల శ్రీవారి ఆభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ట్రస్ట్ కు అందజేసింది వర్థమాన్ కుటుంబం. ఇది తిరుమల చరిత్రలోనే అతిపెద్ద విరాళాల్లో ఒకటి.
వర్ధమాన్ జైన్ తమిళనాడుకు చెందినవారు... ఈయన కుటుంబంతో కలిసి రాజధాని చెన్నైలో నివాసం ఉంటున్నాడు. అతడి విద్యాభ్యాసం చెన్నైలోనే సాగింది... లయోలా కాలేజీలో స్టాటిస్టిక్స్ లో డిగ్రీ పొందాడు. ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడు... యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుండి కంప్యూటర్ సైన్స్ పూర్తిచేశాడు.
కొంతకాలం అమెరికాలోనే ఉన్న వర్దమాన్ స్వదేశానికి తిరిగివచ్చి ఉద్యోగం చేశాడు... అనంతరం హెల్త్ కేర్ వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. యాక్సెస్ హెల్త్ కేర్ సంస్థను స్థాపించాడు... ప్రస్తుతం ఈ సంస్థ వైస్ ఛైర్మన్ గా కొనసాగుతున్నాడు. హెల్త్ కేర్ తో పాటు ఫైనాన్స్, సివిల్ ఇంజనీరింగ్ రంగాల్లోనూ అనుభవం ఉంది... ఆసియా ఇంజనీరింగ్ సంస్థకు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు వర్ధమాన్.
కేవలం వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించడమే కాదు పేదలకోసం డబ్బులు ఖర్చుచేసే మంచిమనసు కలిగిన వ్యక్తి వర్ధమాన్. ఇతడు శ్రీ సరితా జైన్ ఫౌండేషనల్ ట్రస్ట్ ను ఏర్పాటుచేసి ప్రతిభావంతులైన పేద పిల్లలను చదివించడంలో సహాయం చేస్తున్నాడు. అలాగే పేదలకు ఆకలి తీర్చడంతో పాటు ఎమర్జెన్సీ హెల్త్ కేర్ సేవలు అందిస్తున్నాడు. ఆవిష్కార్ పేరిట పేద యువతకు స్కిల్ డెవలప్మెంట్ సేవలు కూడా అందిస్తున్నాడు వర్ధమాాన్ జైన్.
తిరుమల శ్రీవారికి వర్ధమాన్ అందించిన విరాళాలివే..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి వర్ధమాన్ జైన్ పరమభక్తుడు. అందుకే తన సంపాదనలోంచి కొంత భాగాన్ని శ్రీవారికి సమర్పిస్తుంటాడు... ఇప్పుడు 121 కిలోల బంగారు ఆభరణాల మాదిరిగానే గతంలోనే విరాళాలు అందించాడు. గతేడాది (2025) టిటిడి ఆలయ విస్తరణకు కోటి రూపాయలకు పైగా విరాళం అందించాడు... కొద్దిరోజుల క్రితమే టిటిడి ట్రస్ట్ కి రూ.6 కోట్లు విరాళం, ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందించాడు వర్ధమాన్.
అయితే వర్ధమాన్ జైన్ ఇటీవల తన కంపెనీలో కొంత వాటాను విక్రయించినట్లు సమాచారం. దీని ద్వారా వేలకోట్లు వచ్చాయని.. ఇందులోంచి రూ.200 కోట్లకు పైగా వెచ్చించి శ్రీవారికి 121 కిలోల 47 రకాల ఆభరణాలు చేయించాడనే ప్రచారం జరుగుతోంది. ఇలా శ్రీవారిపై భక్తితో ఓ జ్యువెల్లరీ సంస్థలో ఆభరణాలు చేయించి ఇవాళ టిటిడి అందచేశాడు.
ప్రతిరోజు తిరుమలలో వెలిసిన శ్రీవారిని 120 కిలోల బరువుండే రకరకాల ఆభరణాలతో అలంకరిస్తారు... ఇలాంటి అన్ని ఆభరణాలను వర్థమాన్ చేయించినట్లు సమాచారం. రేపు (నవంబర్ 27, శుక్రవారం) ఈ ఆభరణాలతోనే గర్భగుడిలోకి శ్రీవారిని అలంకరించనున్నట్లు సమాచారం.















