- Home
- Feature
- స్కూళ్లలో భయంకరమైన అల్లరి చేసే పిల్లల్లో ఈ దేశమే నెంబర్ వన్.. ఇక మనదేశంలో పరిస్థితి ఏంటి?
స్కూళ్లలో భయంకరమైన అల్లరి చేసే పిల్లల్లో ఈ దేశమే నెంబర్ వన్.. ఇక మనదేశంలో పరిస్థితి ఏంటి?
పిల్లలు అల్లరి చేయడం సహజం. అయితే ఏ దేశంలో మహా అల్లరి చేసే పిల్లలు ఉన్నారో తెలుసుకునేందుకు సర్వే జరిగింది. అందులో ముఖ్యంగా స్కూల్లోని తరగతి గదిలో ఎక్కువ అల్లరి చేసే పిల్లలు ఏ దేశంలో ఉన్నారో తెలుసా?

పెరుగుతున్న తరగతి గది అల్లరి
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల బడులలో పిల్లల ప్రవర్తన, తరగతి గది క్రమశిక్షణపై ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్‌మెంట్ (పీసా) తాజా నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం పాశ్చాత్య దేశాల బడులలో పిల్లల అల్లరి, శబ్దాలు తీవ్ర సమస్యగా మారాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడం పెద్ద సవాలుగా మారింది. అక్కడి 41 శాతం మంది విద్యార్థులు తరగతి గదిలో నిరంతరం విపరీతమైన గొడవగా ఉంటుందని వెల్లడించారు. ఇది ప్రపంచ సగటు 31 శాతం కంటే చాలా ఎక్కువ. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌ల వినియోగం కారణంగా 39 శాతం మంది శ్రద్ధ చదువు నుంచి తప్పుతోంది. న్యూజిలాండ్, బ్రిటన్ దేశాల బడులలో కూడా ఉపాధ్యాయుల మాట వినకపోవడం, పాఠాలు చెప్పేటప్పుడు పెద్ద ఎత్తున శబ్దాలు చేయడం విపరీతంగా పెరిగిపోయింది.
ఆసియా దేశాల్లోనే మంచి పిల్లలు
పాశ్చాత్య దేశాలకు భిన్నంగా ఆసియా దేశాల పాఠశాలలు అత్యంత క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని కొనసాగిస్తున్నాయి. జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల్లో తరగతి గదులు ప్రశాంతంగా దర్శనమిస్తాయి. ఈ దేశాల్లో 85 శాతానికి పైగా విద్యార్థులు తాము చదువుకునే సమయంలో తరగతిలో ఎలాంటి అనవసర శబ్దాలు ఉండవని స్పష్టం చేశారు. విద్యార్థులు పూర్తి నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఉపాధ్యాయులు గొడవను ఆపేందుకు సమయం వృథా చేయకుండా, పూర్తి సమయాన్ని పాఠాలు బోధించడానికే కేటాయిస్తున్నారు. చైనాలోని పాఠశాలల్లో కూడా నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. విద్యార్థులు తరగతి నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ చదువుపైనే తమ పూర్తి దృష్టిని పెడుతున్నారు. తూర్పు ఆసియా విద్యా విధానం అత్యుత్తమ క్రమశిక్షణకు అద్దం పడుతోంది.
మన దేశ పిల్లల పరిస్థితి
ఈ అంతర్జాతీయ సర్వేలో భారతదేశం తాజా వివరాలు నమోదు కాలేదు. భారత విద్యాశాఖ తాజా పీసా సర్వేలో భాగస్వామ్యం పంచుకోకపోవడంతో మన దేశ విద్యార్థుల అల్లరి స్థాయిపై అధికారిక ర్యాంకు ఖరారు కాలేదు. భారత్ చివరగా 2009లో పరీక్షలలో పాల్గొన్నప్పటికీ, అది కేవలం విద్యార్థుల ప్రతిభ ఆధారంగా మాత్రమే సాగింది. దేశీయ సంస్కృతిలో భాగమైన గురుశిష్య సంప్రదాయం ఇప్పటికీ మన విద్యాలయాలలో బలమైన ప్రభావం చూపుతోంది. ఉపాధ్యాయులను గౌరవించే అలవాటు ఉండటం వల్ల పాశ్చాత్య దేశాల బడులతో పోలిస్తే భారతదేశంలో తరగతి గదుల గందరగోళం చాలా తక్కువగా ఉంటుంది. పిల్లల్లో సాధారణ అల్లరి ఉన్నప్పటికీ, బోధనకు ఆటంకం కలిగించేంతటి క్రమశిక్షణారాహిత్యం భారతీయ తరగతుల్లో అరుదుగా కనిపిస్తుంది.

