- Home
- Feature
- Expensive weddings: భారతదేశంలోనే అతి ఖరీదైన వివాహాలు వీళ్లవే... ఒక్క పెళ్లికి వందల కోట్ల ఖర్చు
Expensive weddings: భారతదేశంలోనే అతి ఖరీదైన వివాహాలు వీళ్లవే... ఒక్క పెళ్లికి వందల కోట్ల ఖర్చు
Expensive weddings: మనదేశంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. వారందరిలో ఖరీదైన వివాహం ఎవరిదో తెలుసా? అనంత్ అంబానీదే. కేవలం వీరిదే కాదు ఎంతో మంది వివాహాలకు వందల కోట్లు ఖర్చయ్యాయి. ఆ పెళ్లిళ్ల గురించి తెలుసుకోండి.

భారత్ లోనే ఖరీదైన వివాహం
భారతదేశంలో అత్యంత ఖరీదైన వివాహాల గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబంలో 2024లో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు సుమారు రూ. 5,000 కోట్లు ఖర్చు అయింది. 2018లో జరిగిన ఇషా అంబానీ, ఆనంద్ పిరమాల్ వివాహ బడ్జెట్ సుమారు రూ. 700 కోట్లు. అయితే అంబానీ కుటుంబం తర్వాత భారతదేశంలో అత్యంత ఖరీదైన వివాహాలు ఎవరివో తెలుసా? ఆ జాబితా ఇక్కడ ఇచ్చాము.
ఇరవైఏళ్ల క్రితమే భారీ ఖర్చుతో పెళ్లి
అంబానీ కుటుంబం తర్వాత సహారా గ్రూప్ అధినేత దివంగత సుబ్రతా రాయ్ కుమారుల వివాహం మొదటి స్థానంలో నిలుస్తుంది. 2004వ సంవత్సరంలో లక్నోలోని సహారా షహర్ వేదికగా సుబ్రతా రాయ్ తన ఇద్దరు కుమారులు సుశాంతో రాయ్, సీమాంతో రాయ్‌ల పెళ్లిళ్లను ఒకేసారి అంగరంగ వైభవంగా జరిపించారు. వారం రోజుల పాటు సాగిన ఈ వేడుకకు సుమారు 552 నుంచి 554 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్లు అంచనా. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన దాదాపు 11 వేల మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. వీరి కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడంతో పాటు భారతీయ, ఇటాలియన్, మెక్సికన్, లెబనీస్ వంటకాలతో కలిపి వందకు పైగా ప్రత్యేక రుచులను వడ్డించారు. ఈ వేడుకలో భాగంగా 101 మంది పేద యువతులకు సామూహిక వివాహాలు జరిపించడంతో పాటు దాదాపు లక్షన్నర మందికి అన్నదానం చేశారు.
గాలి జనార్ధన రెడ్డి కూతురి పెళ్లి
దేశంలోనే అత్యంత ఖరీదైన మరో భారీ వివాహంగా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మణి పెళ్లి గురించి చెప్పుకోవాలి. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు జరిగిన కొద్ది రోజులకే బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ వేదికగా రాజీవ్ రెడ్డితో బ్రహ్మణి వివాహం జరిగింది. ఐదు రోజుల పాటు కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ వేడుకకు దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ పెళ్లికి హాజరైన సుమారు 50 వేల మంది అతిథుల కోసం బంగారు పూత పూసిన, ఎల్సీడీ స్క్రీన్ అమర్చిన ప్రత్యేక ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు. వేడుక జరిగే ప్రాంగణంలో హంపి దేవాలయాలు, రాజభవనాలను తలపించే భారీ సెట్టింగులను నిర్మించారు. పెళ్లికూతురు ధరించిన పట్టుచీర ఖరీదు సుమారు 17 కోట్లు కాగా, ఒంటిపై ధరించిన వజ్రాభరణాల విలువ దాదాపు 90 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.













