ఆకలి తీర్చుకోవడానికి మట్టి రొట్టెలు తింటున్న ప్రజలు.. ఆ దేశంలో ఎందుకింత పేదరికం?
ప్రపంచంలో అత్యంత పేద దేశం అది. తినడానికి తిండి కూడా లేక మట్టితోనే రొట్టెలు చేసుకుని తింటున్నారు. తీవ్రమైన ఆహారకొరతతో స్థానికంగా దొరికే మట్టినే ఆహారంగా మార్చుకున్నారు. గోధుమపిండి కొనలేక ఇలా మట్టిని ఎంపిక చేసుకున్నారు. ఆ దేశం ఏదో తెలుసా?

అత్యంత పేద దేశం
ప్రపంచంలో ఎన్నో సంపన్న దేశాలు ఉన్నాయి. అక్కడ ప్రజలు ఖరీదైన ఆహార పదార్థాలు తింటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం కనీసం రెండు పూటలా తిండి కూడా దొరకని పరిస్థితి ఉంది. అలాంటి దేశాల్లో ఒకటి హైతీ. కరేబియన్ సముద్ర ప్రాంతంలో ఉన్న ఈ చిన్న దేశం తీవ్ర పేదరికం, ఆహార కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక్కడి పేద ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఆకలి తీర్చుకోవడానికి మట్టితో చేసిన రొట్టెలు తినాల్సి వస్తోంది. తినడానికి అన్నం, గోధుమ పిండి కూడా కొనలేని పరిస్థితుల్లో కొందరు ప్రజలు మట్టితో చేసిన రొట్టెలనే ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ దుస్థితి కనిపిస్తుంది.
ధరలు పెరగడంతో
హైతీలోని సిటీ సోలైల్ ప్రాంతంలో పేదరికం తీవ్రంగా ఉంది. ఇక్కడ కొందరు ప్రజలు మధ్యాహ్నం భోజనానికి కూడా సరైన ఆహారం కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. గోధుమలు, బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద కుటుంబాలకు ఆహారం అందని పరిస్థితి నెలకొంది. దీంతో ఆకలి బాధ తట్టుకోలేక మట్టితో చేసిన రొట్టెలు తింటున్నారు. దీనికోసం కొండప్రాంతాల్లోని మెత్తని మట్టిన తెస్తారు. ఈ మట్టి రొట్టెను అక్కడ ‘బాన్ బాన్ టె’ అని పిలుస్తారు. సరైన పోషకాహారం అందక అక్కడి ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పేదరికం కారణంగా వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తే అక్కడి ప్రజల జీవనం ఎంత కష్టంగా ఉందో అర్థమవుతుంది.
మట్టి రొట్టెల తయారీ ఇలా
ఇంతకీ ఈ మట్టి రొట్టెలను ఎలా తయారు చేస్తారో తెలుసా? కొండ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిలో నీరు, ఉప్పు కలిపి ముందుగా ముద్దలా తయారు చేస్తారు. ఆ తర్వాత దాన్ని రొట్టె ఆకారంలో చేసి కొన్ని గంటల పాటు ఎండలో ఆరబెడతారు. పూర్తిగా ఆరిన తర్వాత వాటిపై కొద్దిగా నూనె లేదా వెన్న రాసుకుని తింటారు. వీటిని మట్టి కుకీలుగా కూడా పిలుస్తారు. అయితే ఇవి పోషకాహారానికి ప్రత్యామ్నాయం కావు. మట్టిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఆహార కొరత, పేదరికం మనుషులను ఎంతటి దయనీయ స్థితికి నెడతాయో హైతీ పరిస్థితులు చెబుతున్నాయి.













