స్కూలు బస్సులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి.? అసలు కారణం ఏంటంటే..
School bus colour: అమెరికా నుంచి అమలాపురం వరకు ఎక్కడ చూసినా స్కూలు బస్సుల రంగు ఎల్లో ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇలా స్కూలు బస్సులు పసుపు రంగులోనే ఉండడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దూరం నుంచే కనిపించే రంగు
మనకు నగరాల్లో, గ్రామాల్లో ఎక్కడ చూసినా పసుపు రంగు పాఠశాల బస్సులు కనిపిస్తాయి. ఈ రంగు అందంగా కనిపిస్తుందని కాదు, భద్రత కోసమే ప్రత్యేకంగా ఎంచుకున్నారు. 1939లో జరిగిన ఒక జాతీయ సమావేశంలో పిల్లల రవాణా భద్రతపై చర్చించి, చూడడానికి త్వరగా కనిపించే రంగులను పరీక్షించారు. అందులో “నేషనల్ స్కూల్ బస్ క్రోమ్” అనే ప్రత్యేక పసుపు రంగు అత్యంత స్పష్టంగా కనిపిస్తుందని నిర్ణయించారు.
మన కళ్లు పసుపు రంగును త్వరగా గుర్తుపడతాయి
పసుపు రంగు మన కళ్లలోని ఎరుపు, ఆకుపచ్చ కోన్లను ఒకేసారి ఉత్తేజితం చేస్తుంది. అందువల్ల అది మన మెదడుకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రంగు.. ఉదయం వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు, సాయంత్రం వెలుతురు తగ్గినప్పుడు, పొగమంచులో, వర్షంలో ఇలా ప్రతీ సందర్భంలో దూరం నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది డ్రైవర్లకు ముందుగానే బస్సు ఉందని తెలిసేలా చేసి ప్రమాదాలను తగ్గిస్తుంది. పసుపు రంగుపై నలుపు రంగు అక్షరాలు ఉండటం కూడా పేర్లు, సంఖ్యలు స్పష్టంగా కనిపిస్తాయి.
పసుపు రంగు ఎలా అధికారికంగా మారింది?
1939లో ఫ్రాంక్ W. సైర్ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అమెరికాలో ఒక సమావేశం జరిగింది. పాఠశాల బస్సులకు ఏ రంగు ఉత్తమమో తెలుసుకునేందుకు అనేక రంగుల పట్టీలు వరుసగా ఉంచి పరిశీలించారు. అందులో ప్రకాశవంతమైన పసుపు రంగు అందరికీ స్పష్టంగా కనిపించడంతో దానినే అధికారిక రంగుగా ఎంచుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రంగు పాఠశాల బస్సులకు ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా మారింది.
భద్రతను మరింత పెంచే ప్రత్యేక లక్షణాలు
పసుపు రంగు మాత్రమే కాదు, స్కూల్ బస్సుల్లో ఇతర భద్రతా వ్యవస్థలూ ఉంటాయి. ముందుగా హెచ్చరించే అంబర్, రెడ్ ఫ్లాష్ లైట్లు. బస్సు ఆగినప్పుడు బయటికి వచ్చే స్టాప్ బోర్డు. డ్రైవర్‌కి విస్తృతంగా కనిపించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక అద్దాలు. ఈ అన్ని లక్షణాల్లో పసుపు రంగు అత్యంత ముఖ్యమైంది. పరిశోధనలు కూడా పిల్లలు స్కూల్ బస్సుల్లో ప్రయాణించడం, కార్లలో ప్రయాణించడంకంటే చాలా ఎక్కువ భద్రత కల్పిస్తుందని చెబుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
మొదట అమెరికాలో ప్రారంభమైన ఈ పసుపు స్కూల్ బస్సుల పద్ధతి తరువాత అనేక దేశాలు అనుసరించాయి. భారత్, UAE, కెనడా, ఇతర దేశాల్లో కూడా పాఠశాల బస్సులు పసుపు రంగులోనే ఉంటాయి. ఈ రంగు చూస్తే వెంటనే డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని సంకేతం అందుతుంది. దశాబ్దాలు గడిచినా ఈ రంగు ఇంకా మారకపోవడానికి దీని వెనకాల ఉన్న ఈ సైంటిఫిక్ రీజన్సే కారణం.

