తీవ్ర వాయుగుండంగా దిత్వా.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్
IMD Rain Alert: భారీ విద్వంసాన్ని సృష్టిస్తుంది అని అనుకున్న దిత్వా తుపాను స్థాయి కోల్పోయి తీవ్ర వాయుగుండంగా మారింది. తుపాను అవకాశం తగ్గినా వాయుగుండం కారణంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో దిత్వా బలహీనత
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా తీరాలకు సమీపంగా కొనసాగిన ‘దిత్వా’ తుపాను ఆదివారం సాయంత్రం బల హీనపడింది. ఇది తుపాను స్థాయి కోల్పోయి తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటించింది.
చెన్నై, నెల్లూరు దిశలో కదలిక
ఆదివారం రాత్రి నుంచి ఉత్తరదిశలో కదిలిన ఈ తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయం పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో మరింతగా కేంద్రీకృతమైంది. చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు దక్షిణ-ఆగ్నేయంగా సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది.
మరింత బలహీనపడే అవకాశం
వచ్చే 12 గంటల్లో ఈ వాయుగుండం తీరం వెంట ప్రయాణిస్తూ మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా తీరాల సమీపంలో ఇది సాధారణ వాయుగుండ స్థాయికి చేరుతుందని తెలిపింది. తదుపరి దశలో చెన్నై తీరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో చేరుకునే అవకాశముందని పేర్కొంది.
ఈరోజు వర్షాలు
దిత్వా ప్రభావంతో మంగళవారం (ఈరోజు) తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే బుధవారం నుంచి పరిస్థితులు పూర్తిగా పొడిగా మారుతాయని అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేశారు.
ఇక గడిచిన 24 గంటల్లో హనుమకొండ, నిర్మల్, ఖమ్మం, కామారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. హనుమకొండలోని కొండపర్తిలో 5.8 మి.మీ, ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో 3.3 మి.మీ, చర్లలో 3.0 మి.మీ, నిర్మల్ వాడ్యాల్‌లో 2.8 మి.మీ, బూర్గంపాడులో 2.3 మి.మీ, కామారెడ్డి మహ్మద్‌నగర్‌లో 2.1 మి.మీ వర్షం కురిసింది.
ఏపీలోనూ వర్షాలు
దిత్వా తుపాను బలహీనపడినా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అన్నారు. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పెరిగిన చలి తీవ్రత
దిత్వా ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తర దిశ గాలులు బలంగా వీచుతున్నాయి. ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, కుమ్రంభీం జిల్లాల్లో రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల వరకు పడిపోయాయి. మిగతా జిల్లాల్లో కూడా రాత్రి చలి స్వల్పంగా పెరిగింది. చలిగాలులు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

