- Home
- Feature
- Motivational Story: ఎంత కష్టపడినా ప్రతిఫలం రావడం లేదని ఫీలౌతున్నారా? ఈ తేనెటీగ కథ చదవాల్సిందే
Motivational Story: ఎంత కష్టపడినా ప్రతిఫలం రావడం లేదని ఫీలౌతున్నారా? ఈ తేనెటీగ కథ చదవాల్సిందే
Motivational Story: జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించిన దానిని ఎవరైనా లాగేసుకుంటే చాలా బాధగా ఉంటుంది.ఇక జీవితంలో ఎంత కష్టపడినా లాభం లేదు అని అనుకుంటారు. కానీ, ఈ తేనెటీగ కథ చదివితే మీకు ఈ బాధ తీరిపోతుంది…

Moral Story
జీవితంలో చాలా కష్టపడుతున్నామని అయినా కూడా కోరుకున్న స్థాయికి వెళ్లలేకపోతున్నాం అని చాలా మంది ఫీలౌతూ ఉంటారు. అంతేకాదు... తమ కష్టాన్ని మరొకరు లాభంగా మార్చుకుంటున్నారని బాధపడేవారు కూడా ఉంటారు. అలాంటివారు ఈ తేనెటీగ కథ చదవాల్సిందే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. మనల్ని మనం నమ్ముకోవాలని, మన ప్రయత్నాన్ని ఆపకూడదని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు.
తేనెటీగ కష్టం...
ఒక తేనెటీగ రోజు మొత్తం కష్టపడి పూల నుంచి మకరందాన్ని సేకరించి.. తన తేనెగూడు వద్ద తేనెగా నిల్వ చేస్తుంది. ఎండ, వాన, గాలి లెక్క చేయకుండా.. పనిలో ఏ మాత్రం తగ్గకుండా నిస్వార్థంగా పని చేస్తూ ఉంటుంది. రోజూ తేనెటీగ పడే కష్టాన్ని పక్షి రోజూ గమనిస్తూ ఉండేది. అయితే... అది అంత కష్టపడి తయారు చేస్తున్న తేనెను మనుషులు తీసుకెళ్లడం కూడా పక్షి గమనించింది. అందుకే, ఆ విషయాన్ని డైరెక్ట్ గా వెళ్లి తేనెటీగను అడిగింది.
‘ నువ్వు ఇంత కష్టపడి పనిచేసి సేకరించిన తేనెను చివరికి మనుషులు తీసుకెళ్తారు. వాళ్లు నీ కష్టం మొత్తం లాక్కుంటే నీకు బాధ అనిపించదా?’ అని అడిగింది.
ఆ ప్రశ్నకు వెంటనే తేనెటీగ చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చింది.. ‘ వాళ్లు నేను తయారు చేసిన తేనెను లాక్కెళ్లవచ్చు.. కానీ నాలో ఉన్న తేనె తయారు చేసే ప్రతిభను,కష్టపడి పనిచేసే శక్తిని, నేర్పును ఎవరూ తీసుకెళ్లలేరు. నేను శూన్యం నుంచి మళ్లీ సంపాదించుకోగలను’ అని చెప్పింది.
కథలో దాగిఉన్న జీవిత పాఠం...
మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు చాలా వస్తూ ఉంటాయి. మన కష్టం, డబ్బు, సంబంధాలు, పదవి, ఆస్తి.. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో తీసుకోవచ్చు, మన చేతుల నుంచి జారిపోవచ్చు. అదంతా కోల్పోయినప్పుడు చాలా మంది కుంగిపోతారు. ‘ అంత కష్టపడి సంపాదించాను.. అంతా వృథా అయిపోయింది..’ అని బాధపడతారు. కానీ అసలు బలం మన దగ్గర ఉన్నది కాదు.. మనలో ఉన్నదే..
మన ప్రతిభ, మన మహాశక్తి, మహా పనితీరు, మన నైపుణ్యం, మన ఆత్మవిశ్వాసం. పదవి పోవచ్చు.. డబ్బు పోవచ్చు.. వ్యాపారం నష్టపోవచ్చు.. కానీ, మనలో శక్తి, ప్రయత్నం, నేర్పు, ధైర్యం, ఏదైనా కోల్పోతే తిరిగి సంపాదించగలం బలం అని గుర్తించాలి. ఎదుటివారు మనం సాధించిన ఫలితాలను తీసుకోవచ్చు. కానీ, సాధించగలిగే సామర్థ్యాన్ని తీసుకోలేరు అని తెలుసుకోవాలి. కాబట్టి... కోల్పోయిన దాని గురించి ఏడవకుండా తిరిగి సృష్టించగల శక్తి గురించి నమ్మకం కలిగి ఉండాలి.

