Red Okra: ఎర్ర బెండకాయలు.. 40 రోజుల్లోనే చేతికొచ్చే పంట, రైతులకు లక్షల్లో లాభాలు
Red Okra: ఎర్ర బెండకాయలు ఇప్పుడు రైతులకు బోలెడన్ని లాభాలు తెచ్చిపెడుతున్నాయి. సాధారణ బెండకాయలతో పోలిస్తే ఇవి ఎక్కువ రేటుకు అమ్ముడవుతాయి. పైగా రూచి కూడా అద్భుతంగా ఉంటుంది. తెలంగాణాలోనూ ఈ పంట పండిస్తున్నారు.

ఎర్రబెండకాయలు ఎప్పుడైనా తిన్నారా?
సాధారణ ఆకుపచ్చ బెండకాయలు అందరికీ తెలిసినవే, కానీ ఎర్ర బెండకాయలు కూడా ఉంటాయని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. సాధారణ బెండకాయలతో పోలిస్తే ఎర్ర బెండకాయల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిలో రసాయనాలు, ఎరువులు వాడకుండా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పండిస్తారు. అందుకే వీటి ధర కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇవి మార్కెట్లో చాలా అరుదుగా దొరుకుతాయి, కాబట్టి ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకుండా కచ్చితంగా కొనుక్కోవాలి. రోజూ మనం వండుకునే సాధారణ బెండకాయ కూరల్లాగే వీటిని కూడా రుచికరంగా వండుకోవచ్చు. వీటిని తినడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
వీటితో ఎంతో ఆరోగ్యమో
ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే ఎర్ర బెండకాయలు ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తాయి. మధుమేహం ఉన్నవారు వీటిని తరచూ తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల సమస్యలతో బాధపడేవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్ వంటి పొట్ట సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా వీటిలో ఉండే విటమిన్ ఏ, బి, సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం శరీరానికి బలాన్ని ఇస్తాయి. రక్తహీనత ఉన్నవారిలో ఎర్ర రక్త కణాలను పెంచడానికి ఇవి సహాయపడతాయి. గర్భిణీ స్త్రీలకు అవసరమైన ఫోలేట్ వీటిలో పుష్కలంగా లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది.
రైతులకు లాభమైన పంట
ఈ ఎర్ర బెండకాయల సాగు రైతులకు కూడా మంచి లాభాలను ఇస్తుంది. వారణాసిలోని వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఈ విత్తనాలను అభివృద్ధి చేశారు. ఈ విత్తనాలు నాటిన కేవలం నలభై రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. ఎకరాకు నలభై నుంచి ఎనభై క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఎండ తక్కువగా, వాతావరణం చల్లగా ఉండే ప్రాంతాల్లో ఇవి బాగా పండుతాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని వరంగల్ ప్రాంతాల్లో కూడా రైతులు వీటిని సాగు చేస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడితో పాటు మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో రైతులకు ఇది లాభదాయకంగా మారింది.














