- Home
- Feature
- Temple Village: ఒకటి కాదు, రెండు కాదు...ఏకంగా 108 పురాతన ఆలయాలు..ఈ గ్రామం ఎక్కడుందో తెలుసా?
Temple Village: ఒకటి కాదు, రెండు కాదు...ఏకంగా 108 పురాతన ఆలయాలు..ఈ గ్రామం ఎక్కడుందో తెలుసా?
Temple Village: భారత్‌లో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉంటే.. మరికొన్ని అద్భుతమైన శిల్పకళకు నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. అయితే ఒక చిన్న గ్రామంలోనే ఏకంగా 72 పురాతన ఆలయాలు ఉంటే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం

ఎక్కడ ఉంది ఈ ఆలయాల గ్రామం?
జార్ఖండ్‌లోని ఓ గ్రామం ఇలాంటి అరుదైన చారిత్రక వారసత్వానికి చిరునామాగా నిలుస్తోంది. ఒకప్పుడు ఈ గ్రామంలో 108 ఆలయాలు ఉండేవి. కాలక్రమంలో కొన్ని కనుమరుగైనా.. మిగిలిన ఆలయాలు ఇప్పటికీ నాటి నిర్మాణ వైభవాన్ని గుర్తుచేస్తున్నాయి. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది? ఒకే ప్రాంతంలో ఇన్ని ఆలయాలు నిర్మించడానికి కారణమేంటి? వాటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.
జార్ఖండ్‌లోని దుమ్కా (Dumka) జిల్లాలో మలూటి (Maluti) అనే చిన్న గ్రామం ఉంది. పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు సమీపంలో, ప్రకృతి అందాల మధ్య ఉండే ఈ గ్రామాన్ని 'టెంపుల్ విలేజ్'గా పిలుస్తారు. ఒకప్పుడు ఇక్కడ 108 ఆలయాలు ఉండటంతో 'గుప్త కాశీ' అనే పేరుతోనూ గుర్తింపు పొందింది. ప్రస్తుతం గ్రామంలో 72 టెర్రకోటా ఆలయాలు మిగిలి ఉన్నాయి. ఇవి 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించినవిగా గుర్తించారు.
ఒక గ్రామంలో ఇన్ని ఆలయాలు ఎలా వచ్చాయి?
మలూటి గ్రామ చరిత్ర వెనుక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. 15వ శతాబ్దంలో గౌర్ ప్రాంతాన్ని పాలించిన సుల్తాన్ అల్లావుద్దీన్ హుస్సేన్ షా వద్ద ఒక పెంపుడు గద్ద ఉండేదట. అది తప్పిపోయిన సమయంలో బసంతా రాయ్ అనే వ్యక్తి ఆ గద్దను పట్టుకుని తిరిగి సుల్తాన్‌కు అప్పగించాడని చెబుతారు. అతడి నిజాయతీకి మెచ్చిన సుల్తాన్.. అతడికి ఒక ప్రాంతాన్ని బహుమతిగా ఇచ్చాడట. అలా బసంతా రాయ్ ఈ ప్రాంతానికి పాలకుడిగా మారినట్లు స్థానిక చరిత్ర చెబుతోంది.
ఆయన వారసులు బాజ్ బసంతా రాజవంశంగా గుర్తింపు పొందారు. ఈ కుటుంబానికి చెందిన పాలకులు ఎంతో భక్తి శ్రద్ధలు కలిగినవారని చెబుతారు. రాజభవనాలు నిర్మించుకోవడం కంటే ఆలయాల నిర్మాణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారట. ఆ తర్వాత రాజకుటుంబం నాలుగు వేర్వేరు శాఖలుగా విడిపోయింది. ప్రతి శాఖ తమ భక్తిని, ప్రతిష్ఠను చాటుకునేందుకు ఆలయాలు నిర్మించడం ప్రారంభించింది. ఒకరి కంటే మరొకరు ఎక్కువ ఆలయాలు కట్టించాలనే పోటీ కూడా ఇందుకు కారణమైందని జార్ఖండ్ పర్యాటక శాఖ వివరించింది. ఇలా కొన్నేళ్లలోనే మలూటి గ్రామం ఆలయాల సముదాయంగా మారిపోయింది.
టెర్రకోటా శిల్పాలే ఈ ఆలయాల ప్రత్యేకత
మలూటి ఆలయాలను మిగతా ఆలయాల నుంచి ప్రత్యేకంగా నిలిపేది వాటి నిర్మాణ శైలి. ఇటుకలు, మట్టితో తయారు చేసిన టెర్రకోటా పలకలపై అద్భుతమైన శిల్పాలను చెక్కారు. రామాయణం, కృష్ణుడి జీవిత ఘట్టాలతో పాటు అప్పటి ప్రజల జీవనశైలి, వేట, యుద్ధాలకు సంబంధించిన దృశ్యాలు కూడా ఈ శిల్పాల్లో కనిపిస్తాయి. ఈ ఆలయాల నిర్మాణంలో బెంగాల్ సంప్రదాయ శిల్పకళ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నాలుగు వైపులా వాలుగా ఉండే పైకప్పుతో నిర్మించే 'చార్ చాల' (Char-chala) శైలి ఇక్కడి ఆలయాల్లో ప్రత్యేక ఆకర్షణ. కొన్ని ఆలయాల్లో వేర్వేరు నిర్మాణ రూపాలు కూడా కనిపిస్తాయి. బెంగాల్‌లోని బిష్ణుపూర్‌కు చెందిన నిపుణులైన శిల్పకారులు ఈ ఆలయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించినట్లు జార్ఖండ్ పర్యాటక శాఖ పేర్కొంది.
శివాలయాలే ఎక్కువ.. అమ్మవారి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు
మలూటిలోని ఆలయాల్లో ఎక్కువ భాగం శివుడికి అంకితం చేశారు. 2025లో ప్రచురితమైన ఒక పరిశోధనా అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం మిగిలి ఉన్న 72 ఆలయాల్లో 57 శివాలయాలే ఉన్నాయి. వీటితో పాటు కాళీమాత, దుర్గాదేవి, విష్ణుమూర్తి వంటి దేవతలకు సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ గ్రామంలో అత్యంత ప్రత్యేకమైన ఆలయం మౌలిక్ష్య దేవి ఆలయం. బాజ్ బసంతా రాజవంశానికి ఈమె కులదైవంగా ఉండేవారని చెబుతారు. ఈ ఆలయంలో దేవత పూర్తి విగ్రహం కాకుండా ఎరుపు రంగులో ఉండే రాతి తల రూపంలో దర్శనమిస్తారు. ఈ దేవతను సింహవాహిని దుర్గాదేవిగా కొలుస్తారు. పశ్చిమ బెంగాల్‌లోని తారాపీఠం దేవత తారకు మౌలిక్ష్య అక్క అని మరో స్థానిక విశ్వాసం కూడా ఉంది.
కాలగర్భంలో కనుమరుగవుతున్న చారిత్రక సంపద
ఒకప్పుడు 108 ఆలయాలతో కళకళలాడిన మలూటిలో ప్రస్తుతం 72 మాత్రమే మిగిలాయి. మిగిలిన 36 ఆలయాలు కాలక్రమంలో శిథిలమయ్యాయి. వర్షాలు, వాతావరణ మార్పులు, చెట్ల వేళ్లు, నిర్వహణ లోపం కారణంగా కొన్ని ఆలయాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ చారిత్రక సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఆలయాల పరిరక్షణ కోసం పలు సంస్థలు, వారసత్వ పరిరక్షణ బృందాలు ముందుకొచ్చాయి. 2022 డిసెంబర్‌లో రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. మలూటిలోని 108 ఆలయాలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పరిధిలో లేవు. అయితే జార్ఖండ్ ప్రభుత్వం 62 ఆలయాల పరిరక్షణ పనులు ప్రారంభించగా, అప్పటికి 20 ఆలయాల పునరుద్ధరణ పూర్తయింది.
పర్యాటకులను ఆకర్షిస్తున్న ఆలయ గ్రామం
చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మికత కలగలిసిన మలూటి గ్రామం వారసత్వ పర్యాటకానికి మంచి ఉదాహరణ. దుమ్కా పట్టణం నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ప్రకృతి అందాల మధ్య ఒకేచోట వరుసగా కనిపించే పురాతన ఆలయాలు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. సాధారణ గ్రామంలా కనిపించే ఈ ప్రాంతంలో అడుగుపెడితే ప్రతి ఆలయం ఒక చరిత్రను చెబుతున్నట్లు అనిపిస్తుంది. రాజుల భక్తి, కుటుంబాల మధ్య నిర్మాణ పోటీ, అప్పటి శిల్పకారుల ప్రతిభ.. ఇలా ఎన్నో అంశాలకు ఈ ఆలయాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అందుకే మలూటి కేవలం ఒక ఆలయాల గ్రామం మాత్రమే కాదు.. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న అరుదైన వారసత్వ సంపద కూడా.















