- Home
- Feature
- Paralakhemundi Railway Station: బ్రిటిషర్లు కాదు, ఇండియన్ రైల్వే కాదు...రాజు నిర్మించిన రైల్వేస్టేషన్, ఎక్కడుందో తెలుసా?
Paralakhemundi Railway Station: బ్రిటిషర్లు కాదు, ఇండియన్ రైల్వే కాదు...రాజు నిర్మించిన రైల్వేస్టేషన్, ఎక్కడుందో తెలుసా?
Paralakhemundi Railway Station: ఒకప్పుడు ఈ రైల్వే లైన్‌ను భారతీయ రైల్వే కాకుండా.. ఓ మహారాజు నిర్మించారంటే నమ్ముతారా? 125 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ రైల్వే మార్గం.. నేటి ఆధునిక సౌకర్యాలతో, హంగులతో కళకళలాడుతోంది. ఇంతకీ ఈ స్టేషన్ ఎక్కడుంది?

రాజు నిర్మించిన రైల్వేస్టేషన్
రైల్వే స్టేషన్ అనగానే రద్దీగా ఉండే ప్లాట్‌ఫామ్‌లు, దూసుకెళ్లే రైళ్లు, ప్రయాణికుల హడావుడి గుర్తుకొస్తాయి. కానీ కొన్ని స్టేషన్ల వెనుక ఏళ్ల నాటి చరిత్ర కూడా ఉంటుంది. అలాంటి వాటిలో ఒడిశాలోని పర్లాఖేముండి రైల్వే స్టేషన్ ఒకటి. ఒకప్పుడు చిన్న గేజ్ రైల్వే మార్గంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి రైల్వే చరిత్రతో విడదీయలేని అనుబంధం ఉంది.
మహారాజా ఆలోచనతో మొదలైన రైల్వే ప్రయాణం
పర్లాఖేముండి రైల్వే స్టేషన్ ప్రత్యేకత తెలుసుకోవాలంటే 19వ శతాబ్దం చివరి రోజుల్లోకి వెళ్లాలి. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన మహారాజా గౌర చంద్ర గజపతి నారాయణ దేవ్ తన రాజధానిని ప్రధాన రైల్వే మార్గంతో అనుసంధానించాలని భావించారు. సమీపంలోని నౌపడా వరకు రైల్వే లైన్ ఉండటంతో అక్కడి నుంచి పర్లాఖేముండికి రైలుమార్గం నిర్మించాలని నిర్ణయించారు.
1898లో బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పనులు ప్రారంభమయ్యాయి. సుమారు రూ.7 లక్షల రాజ కుటుంబనిధులతో దాదాపు 39 కిలోమీటర్ల పొడవైన నారో గేజ్ రైల్వే లైన్ నిర్మించారు. 1900 ఏప్రిల్ 1న పర్లాఖేముండి లైట్ రైల్వే (PLR) ప్రారంభమైంది. అప్పట్లో ఇది ప్రాంత ప్రజల రవాణా అవసరాలకు కీలకంగా మారింది.
ప్రస్తుతం మనం చూసే బ్రాడ్ గేజ్ రైళ్లకు భిన్నంగా, అప్పట్లో ఈ మార్గంలో నారో గేజ్ రైళ్లు నడిచేవి. పట్టాల మధ్య దూరం కేవలం 2 అడుగుల 6 అంగుళాలు మాత్రమే ఉండేది. చిన్న రైళ్లు, తక్కువ పరిమాణంలో ఉండే బోగీలతో ఉంటూ ఆ కాలపు రైల్వే వ్యవస్థలో ప్రత్యేకంగా ఉండేది.
స్టేషన్‌కు మరో ప్రత్యేకత
మొదట్లో ఈ రైల్వే లైన్‌కు నష్టాలు వచ్చినప్పటికీ, 1910 తర్వాత క్రమంగా ఆదాయం మెరుగుపడింది. అనంతరం మహారాజా వారసుడు కృష్ణ చంద్ర గజపతి నారాయణ దేవ్ ఈ మార్గాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారు. 1929, 1931లో దశలవారీగా గుణుపూర్ వరకు రైల్వే లైన్ పొడిగించారు. దీంతో ఒడిశాలోని ఈ ప్రాంతానికి రవాణా సదుపాయాలు మరింత విస్తరించాయి.
ఈ స్టేషన్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. కాలం మారినా, రైల్వే సాంకేతికత అభివృద్ధి చెందినా ఇక్కడి పాత రైల్వే భవనం చరిత్రను గుర్తు చేస్తూనే ఉంది. బ్రిటిష్ కాలం నాటి నిర్మాణ శైలిని ప్రతిబింబించే ఈ భవనాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించాలని గతంలోనూ డిమాండ్లు వచ్చాయి. కొత్త రైల్వే సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ పాత భవనం ప్రాధాన్యం మాత్రం కొనసాగుతోంది.
నారో గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ వరకు
రైళ్ల వేగం, సామర్థ్యం పెంచేందుకు పాత నారో గేజ్ లైన్‌ను బ్రాడ్ గేజ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా 2004 జూన్‌లో ఈ మార్గాన్ని మూసివేశారు. అనంతరం మార్పులు పూర్తయ్యాక రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. 2010లో పర్లాఖేముండి నుంచి నౌపడా మార్గంలో బ్రాడ్ గేజ్ రైలు ప్రయాణం మొదలవగా, మొత్తం నౌపడా–గుణుపూర్ మార్గం 2011లో అందుబాటులోకి వచ్చింది.
2025లో పర్లాఖేముండి లైట్ రైల్వే 125 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చారిత్రక మార్గం ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. అలాగే జులై 17, 2026లో పర్లాఖేముండి స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించేందుకు సుమారు రూ.16.40 కోట్ల ప్రణాళికను రైల్వే శాఖ చేపట్టి దేశానికి అంకితం చేశారు. అభివృద్ధి చేసినా పర్లాఖేముండి రాజవంశ నిర్మాణ శైలిని అలానే ఉంచారు.
నేటి ప్రయాణికులకు పర్లాఖేముండి స్టేషన్ సాధారణ రైల్వే నిలయంలా కనిపించవచ్చు. కానీ దాని వెనుక ఒక మహారాజా ఆలోచన, వందేళ్ల చరిత్ర కనిపిస్తుంది. చిన్న పట్టాలపై ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు ఆధునిక రైల్వే వ్యవస్థలో భాగమైంది.








