Car Tyres: కారు ఏ రంగులో ఉన్న వాటి టైర్లు మాత్రం నల్లగానే ఎందుకుంటాయి?
Car Tyres: కారు రంగు ఏదైనా సరే టైర్లు మాత్రం ఎప్పుడూ నల్లగానే ఉంటాయి. అలా టైర్లు నల్లగా ఎందుకుంటాయో తెలుసా? ఒకప్పుడు టైర్లు తెల్లగా ఉండేవి. ఇప్పుడు నల్లగా ఎందుకు మారాయి?

కారు టైర్లు నల్లగా ఎందుకు ఉంటాయి?
కార్లను చూడండి.. అవి ఏ రంగులో ఉన్నా కూడా వాటి టైర్లు మాత్రం నల్లగానే ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? 1917కు ముందు కార్ల టైర్లు నల్లగా కాకుండా తెలుపు రంగులోనే ఉండేవి. టైర్ల తయారీకి వాడే సహజ రబ్బరు రంగు తెలుపు. అందుకే అప్పట్లో టైర్లు తెల్లగా వచ్చేవి. కానీ ఈ టైర్లు ఎక్కువ కాలం పనిచేసేవి. రబ్బరు టైర్లు బలంగా మార్చడానికి కంపెనీలు వాటిలో జింక్ ఆక్సైడ్ కలిపేవి. అయినా సరే ఆ టైర్లు త్వరగా అరిగిపోయేవి.
20వ శతాబ్దంలో కొత్త టైర్లు
టైర్లను మరింత బలంగా మార్చడానికి, ఎక్కువ కాలం మన్నేలా చేయడానికి కంపెనీలు ఒక మంచి మార్గం వెతికాయి. 20వ శతాబ్దంలో దీనికి సరైన పరిష్కారం దొరికింది. 1910లో జార్జ్ ఓయెన్స్‌లాగర్ (George Oenslager) అనే రసాయన శాస్త్రవేత్త ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నాడు. టైర్ రబ్బరుకు కార్బన్ బ్లాక్ కలిపితే దాని బలం, మన్నిక అమాంతం పెరుగుతాయని ఆయన నిరూపించాడు.
కార్బన్ బ్లాక్ ను ఇంగ్లీషులో సూట్ (Soot) అని కూడా పిలుస్తారు. ఇవి చాలా సూక్ష్మమైన నల్లటి కణాలు. ఇవి టైర్లు త్వరగా అరిగిపోకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా టైర్లను మరింత ఫ్లెక్సిబుల్‌గా, బలంగా మారుస్తాయి.
టైర్ల మన్నికను పెంచిన కార్బన్ బ్లాక్
కారు టైర్లు నల్లగా ఉండటానికి ప్రధాన కారణం ఈ కార్బన్ బ్లాక్. ఇది టైర్లకు ఒక వరం లాంటిది. ఒకప్పుడు టైర్లు కేవలం 2,000 నుంచి 5,000 కిలోమీటర్లు మాత్రమే వచ్చేవి. కానీ కార్బన్ బ్లాక్ వాడటం వల్ల టైర్ల మన్నిక 50,000 కిలోమీటర్లకు పైగా పెరిగింది. అంటే టైర్ నలుపు రంగు కేవలం లుక్ కోసం కాదు, దాని లైఫ్ పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
కార్బన్ బ్లాక్ టైర్లకు మంచి గ్రిప్ ఇస్తుంది. ఎక్కువ బరువును మోసే సామర్థ్యాన్ని, మెరుగైన పనితీరును అందిస్తుంది. అంతేకాకుండా, సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావయలెట్ (UV) కిరణాల నుంచి టైర్లను కాపాడుతుంది. దీనివల్ల టైర్లకు పగుళ్లు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

