Motivational Story: ప్రతిసారీ ఓడిపోతున్నామని ఫీలౌతున్నారా..? ఈ కథ చదవాల్సిందే...
Motivational Story: మనలో చాలా మంది చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు.. అక్కడితో జీవితం ఆగిపోయినట్లు ఫీలౌతారు. కానీ, తిరిగి ప్రయత్నిస్తే… లైఫ్ లో కచ్చితంగా విజయం సాధించగలరు.

Motivational Story
ఎవరి జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయి. ఒక్కోసారి ప్రయత్నించిన ప్రతిసారీ ఓటమి ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. చాలా మంది తాము అనుకున్నది జరగకపోయినా, ఓటమి ఎదురైనా తట్టుకోలేరు. ఇక.. తాము లైఫ్ లో సక్సెస్ అవ్వలేము అనే బాధ పడుతూ ఉంటారు. ఎలాగూ ఓడిపోతాం కదా అని.. ప్రయత్నించడమే మానేస్తారు. మీరు కూడా ఇదే స్టేజ్ లో ఉంటే... కచ్చితంగా ఈ కథ చదవాల్సిందే.
కథ..
ఒకసారి అడవిలోని అన్ని జంతువులు కలిసి మాట్లాడుకుంటున్నాయి. అడవికి రాజు సింహం మాట్లాడుతూ ‘‘ నేను ముసలిదాన్ని అయిపోయాన్నేమో.. సరిగా వేటాడలేకపోతున్నాను’’ అని నిరాశగా చెప్పింది. ఆ మాటకు పక్కనే ఉన్న ఏనుగు వెంటనే నవ్వేసింది. వెంటనే మాట్లాడుతూ.. ‘ నువ్వు ఒక్కసారి ఓడిపోయావని నీ శక్తి తక్కువైందని కాదు, నిన్ను చూసి మేము ఇంకా గర్వపడుతున్నాం’ అని ధైర్యం నింపింది.
పక్కనే ఉన్న ఓ చిన్న పక్షి వెంటనే ‘‘ నేను మొదట ఎగరడం నేర్చుకున్నప్పుడు ఎన్నిసార్లు పడిపోయానో లెక్కే లేదు. కానీ, ప్రతిసారీ లేచి మళ్లీ ప్రయత్నించాను. ఇప్పుడు నేనే ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తున్నాను’ అని తన అనుభవాన్ని చెప్పింది.
ఈ మాటలు విన్న సింహానికి ఉత్సాహం వచ్చింది. ‘ నిజమే, నేను నిన్న వేటలో ఓడిపోయాను. కానీ ఈ రోజు వేటాడో శక్తి కోల్పోలేదు. ఓటమి అంటే అంతం కాదు, ఆరంభం’ అని అంది. ఆ మాటలకు అడవిలోని మిగిలిన జంతువులన్నీ సంతోషించి, చప్పట్లు కొట్టాయి. ఆ రోజు నుంచి సింహం మరింత ఎక్కువ శ్రమించింది... తిరిగి తన నైపుణ్యాన్ని సాధించింది.
మనం తెలుసుకోవాల్సిన విషయం...
మనలో చాలా మంది చిన్న అడ్డంకినే జీవితాంతం నష్టంగా భావిస్తారు. ఒకసారి తక్కువ మార్కులు వచ్చాయంటే అంతే, “నా జీవితం అయిపోయింది” అని నిర్ణయించుకుంటారు. కానీ అదే సమయంలో ఇంకొందరు “ఈసారి ఇంకాస్త ఎక్కువ కష్టపడితే సాధించి తీరుతాను” అని ఆలోచిస్తారు. వారు జీవితంలో ముందుకు సాగుతారు. సమస్య ఎప్పుడూ మన దారిని ఆపదు; మన ఆలోచననే ఆపుతుంది.
మెదడుకు సమయం ఇవ్వండి...
ఓటమి ఎదురైన వెంటనే కోపం, నిరాశ, ఆవేశం కలగడం సహజం. కానీ అదే సమయంలో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు తప్పు దారిలో నడిపిస్తాయి. అప్పుడు ఒక చిన్న విరామం తీసుకోండి. లోతుగా శ్వాస తీసుకోండి. కొంత సేపు నిశ్శబ్దంగా ఉండండి. ఆవేశం తగ్గిన తర్వాతే ఆలోచించండి. అప్పుడు ఆలోచిస్తే... మంచి ఆలోచనలు కచ్చితంగా వస్తాయి. అవి మనకు మంచి పరిష్కారం చూపిస్తాయి.
ఒక సమస్య ఎదురైనప్పుడు ఒంటరిగా ఉండొద్దు. మీ బాధను మీ కుటుంబం లేదా స్నేహితులతో పంచుకోండి. ఆ మాటలు మీ మనసులోని భారాన్ని తగ్గిస్తాయి. ఏడవడం బలహీనత కాదు. అది మనసులోని ఒత్తిడిని విడుదల చేసే మార్గం
ఓటమి కాదు, పాఠం
ప్రతీ ఓటమి వెనుక ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠాన్ని గుర్తించగలిగితే అదే మీ విజయానికి దారి చూపుతుంది. ఓటమిని “బ్రేక్”గా తీసుకుని, ఆ విరామంలో నేర్చుకున్న పాఠంతో మళ్లీ ముందుకు అడుగు వేయండి. అప్పుడు విజయం మీకు అందుతుంది.