Motivational Story: నిజమైన సంపద అంటే ఏంటి.? జీవితాన్ని మార్చే కథ
Motivational Story: జీవితంలో విజయం అంటే డబ్బు సంపాదించడమే అనే అనుకుంటాం. అయితే నిజమైన సంపదకు అర్థం వేరే ఉందనే గొప్ప సందేశాన్ని చాటి చెప్పే ఒక కథ గురించి ఈరోజు తెలుసుకుందాం.

ధనిక తండ్రి వింత ఆలోచన
అనగనగా ఓ ఊరిలో ఓ బాలుడు చాలా ధనిక కుటుంబంలో జన్మించాడు. తండ్రి అతన్ని చిన్ననాటి నుంచి కష్టమనేది తెలియకుండా పెంచాడు. అయితే ఇదే సమయంలో తన కుమారుడు జీవితంలో ఉన్న సౌకర్యాల విలువను అర్థం చేసుకోవాలని అనుకున్నాడు. అందుకే ఒక రోజు అతడిని గ్రామంలోని పేద కుటుంబం వద్దకు తీసుకెళ్లి కొన్ని రోజులు గడపమని తెలిపాడు. అక్కడ ఆ కుటుంబం వ్యవసాయం చేస్తూ, స్వంతంగా ఆహారం తయారు చేసుకుంటూ జీవిస్తున్న తీరును చూపించాడు.
పేద కుటుంబం వద్ద గడిపిన రోజులు
ఆ బాలుడు అక్కడున్న పేద కుటుంబంతో కలిసి పంటలు కోస్తూ, జంతువులను పెంచుతూ గడిపాడు. అయితే ఆ ఇంట్లో అతనికి కావాల్సిన సదుపాయాలు లేవు, చాలా సాధారణ జీవితం గడిపాడు. కష్టపడి పనిచేశాడు. తన దుస్తులను తానే ఉతుక్కున్నాడు, తన పనులు తానే చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బాలుడు తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు తండ్రి తన కుమారుడిని.. ఈ ప్రయాణం ఎలా అనిపించింది? నీవు ఏదైనా నేర్చుకున్నావా? అని అడిగాడు.
బాలుడి సమాధానంతో ఆశ్చర్యం
ఆ బాలుడు వెంటనే స్పందిస్తూ.. “అద్భుతంగా ఉంది, ఆ కుటుంబ సభ్యులు చాలా అదృష్టవంతులు” అని చెబుతాడు. దీంతో తండ్రి ఆశ్చర్యపోతాడు. అదేంటి.. ‘వాళ్ల ఇళ్లు చాలా చిన్నగా ఉంది, సరైన సదుపాయాలు లేవని అంటావు అనుంకుటే బాగుందని బదులిచ్చావు ఏంటి’ అని ప్రశ్నిస్తాడు. దీనికి ఆ బాలుడు నవ్వుతూ.. ‘మన ఇంట్లో కేవలం ఒక్క కుక్క మాత్రమే ఉంది. వారి ఇంట్లో కుక్కలతో పాటు ఆవులు, మేకలు ఉన్నాయి. మన ఇంట్లో నలుగురు మాత్రమే ఉన్నాం, అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. మన ఇంట్లో ఒక్కొక్కరం ఒక్కో సమయంలో భోజనం చేస్తాం, వాళ్లింట్లో మాత్రం అంతా కలిసి సరదాగా భోజనం చేస్తారు. మన ఇంట్లో చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది.. కానీ వాళ్ల దగ్గ ఎప్పటికీ ఎండిపోని నది ఉంది’ అని చెప్పుకొచ్చాడు.
అసలు ధనవంతులు వాళ్లే
ఆ బాలుడు ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి ధనవంతులం మనం కాదు నాన్న, వాళ్లే నిజమైన ధనవంతులు. నన్ను తీసుకెళ్లి అసలు ధనవంతులు ఎలా జీవిస్తారో చూపించినందుకు ధన్యవాదాలు నాన్న!” అని చెప్తాడు. తండ్రి తన కుమారుడికి.. పేదరికాన్ని చూపించాలనుకున్నాడు, కానీ ఆ బాబు నిజమైన సంపద అంటే ప్రేమ, సహజసిద్ధమైన జీవనం, స్వేచ్ఛ అని గ్రహించాడు.
ఈ కథ చెబుతున్న సందేశం ఏంటంటే.?
నిజమైన సంపద అంటే.. డబ్బు, ఆస్తులు, విలాసవంతమైన వస్తువులు కాదు. మన చుట్టూ ఉన్న ప్రేమించే మనుషులు, సహజమైన ప్రకృతి, మనసుకు శాంతి, స్వేచ్ఛ ఇవే అసలు ధనాలు. ధనిక జీవితం అంటే లగ్జరీ వస్తువులను ఉపయోగించడం కాదు మనకు నచ్చిన పని చేసుకుంటూ, నచ్చిన వ్యక్తులతో సరదాగా జీవించడమే అనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తోంది.