- Home
- Feature
- Crochet Lace: అమెరికా, లండన్ షాపుల్లో విపరీతంగా అమ్ముడుపోతున్న నర్సాపురం లేసులు.. కోట్లలో వ్యాపారం
Crochet Lace: అమెరికా, లండన్ షాపుల్లో విపరీతంగా అమ్ముడుపోతున్న నర్సాపురం లేసులు.. కోట్లలో వ్యాపారం
Crochet Lace: మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సొంతమైన ఒక కళకు విదేశాల్లో విపరీతమైన క్రేజ్ ఉందని మీకు తెలుసా? ఇక్కడ తయారయ్యే క్రేషే లేస్ తో.. విదేశాల్లో కోట్ల వ్యాపారం జరుగుతోంది

విదేశీయులు మెచ్చిన మన కళ..
ఒక చిన్న హుక్ ఉన్న సూది, కొన్ని దారపు పోగులు..వాటికి మహిళల వేళ్ల నైపుణ్యం తోడైతే రూపుదిద్దుకునే దృశ్యకావ్యమే నరసాపురం ‘ క్రోషే లేస్’. ఆంధ్రా గోదావరి తీరాన పుట్టిన ఈ అద్భుతమైన చేతి కళ కేవలం ఒక కుటీర పరిశ్రమ మాత్రమే కాదు.. తరతరాల సంస్కృతికీ, వేలాది మంది మహిళలకు ఆర్థికంగా నిలపెట్టింది. అసలు.. ఈ కళ ఎలా పుట్టింది? విదేశాలకు ఎలా పాకింది? ఈ కళ ప్రత్యేకత ఏంటి?
150 ఏళ్ల చరిత్ర...
ఈ కళ వెనక 150 ఏళ్ల చరిత్ర ఉంది. 19వ శతాబ్దంలో పశ్చిమ గోదావరి ప్రాంతానికి వచ్చిన క్రైస్తవ మిషనరీలు స్థానిక మహిళలకు జోవనోపాధి కల్పించేందుకు ఈ క్రోషే లేస్ అల్లికలను నేర్పించారు. ఐరోపా పద్దతిలో మొదలైన ఈ విద్యను మన తెలుగు మహిళలు తమ సొంత క్రియేటివిటీని జోడించి ఒక అద్భుతమైన భారతీయ హస్తకళగా తీర్చిదిద్దారు. 150 ఏళ్ల క్రితం మొదలైన ఈ కళ.. తర్వాతర్వాత తమ తల్లుల నుంచి కుమార్తెలకు వారసత్వంగా మారిపోయింది.
సూదితోనే మ్యాజిక్...
ఈ క్రోషే లేస్ అల్లాలంటే..ఎంతో ఓపిక,ఏకాగ్రత చాలా అవసరం. చేతి వేళ్లతో సూదిని తిప్పుతూ వేసే ఒక్కో ముడి ఒక చక్కని డిజైనర్ గా మారుతుంది. వీటితో ఇంటి అలంకరణ వస్తువులు.. టేబుల్ క్లాత్స్, బెడ్ షీట్స్, కుషన్ కవర్లు, ఖరీదైన కర్టెన్స్, గోడలకు వేలాడే వాల్ హ్యాంగింగ్స్, ట్రెండీ హ్యాండ్ బ్యాగులు, టోపీలు, మొబైల్ కవర్లు తయారు చేస్తారు. అంతేకాదు.. చాలా రకాల చీరలు, డ్రెస్సులకు లగ్జరీ లుక్ తీసుకురావడంలో కూడా ఈ లేసు బాగా సహాయపడుతుంది. ఈ చిన్న లేస్ చీరకు డిజైనర్ లుక్ తీసుకువస్తుంది.
నరసాపురం నుంచి న్యూయార్క్ వరకు..
నరసాపురం క్రోషే లేస్ ఉత్పత్తులకు కేవలం మన దేశంలోనే కాదు సముద్రాలు దాటి విదేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఇక్కడి ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. పాశ్చాత్య దేశాల ఇళ్లలో, ఫ్యాషన్ ప్రపంచంలో నరసాపురం మహిళలు అల్లిన డోలీలు, దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.
క్రోషే లేస్ కి దక్కిన జీఐ..
ఈ క్రోషే లేస్ కి జీఐ ట్యాగ్ గుర్తింపు కూడా లభించింది. నరసాపురం లేస్ ప్రత్యేకతకు, అక్కడి చేతివృత్తిదారుల కష్టానికి గుర్తింపుగా 2024 మార్చి 1న కేంద్ర ప్రభుత్వం దీనికి 'భౌగోళిక గుర్తింపు' (GI Tag) మంజూరు చేసింది. మహిళా సహకార సంఘాల సమాఖ్య, నరసాపురం క్రోషే లేస్ ఎగుమతిదారుల సంఘం సంయుక్త కృషి వల్ల ఈ GI ట్యాగ్ సాధ్యమైంది.దీనివల్ల నరసాపురం పేరుతో నకిలీ ఉత్పత్తులు రాకుండా అడ్డుకోవడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో ఇక్కడి ఉత్పత్తులకు మరింత మంచి ధర, ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ లభిస్తాయి.
ఈ కళకు నరసాపురం లేస్ అని పేరున్నప్పటికీ, ఇది ఒక పట్టణానికే పరిమితం కాలేదు. పశ్చిమ గోదావరితో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని సుమారు 19 మండలాల పరిధిలో వందలాది గ్రామాల్లో వేలాది మంది మహిళలు తమ ఇళ్లలోనే ఉంటూ ఈ లేస్ అల్లికలు చేస్తున్నారు.













