- Home
- Feature
- Motivational Story: ప్రతి చిన్న విషయానికి భయపడితే ఏమౌతుంది..? ఈ కథ చదివితే మీ భయం పోతుంది
Motivational Story: ప్రతి చిన్న విషయానికి భయపడితే ఏమౌతుంది..? ఈ కథ చదివితే మీ భయం పోతుంది
Motivational Story: భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ ఆ భయాన్ని దాటి ముందుకు కదిలినప్పుడే... ఎలాంటి సమస్యను అయినా జయించవచ్చు. అలా కాకుండా, భయపడుతూ కూర్చొంటే జీవితంలో ఏదీ సాధించలేం. సమస్యలు ఇంకాస్త పెరుగుతాయి ఇది తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే

Motivational Story
ఒక రోజు శ్రీకృష్ణుడు తన సోదరుడు బరాముడు అడవిలో నడుస్తూ వెళ్తున్నారు. చాలా దూరం నడిచిన తర్వాత ఇద్దరూ అలసిసోయి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కృష్ణుడు ముందుగా ఒక చెట్టు కింద పడుకొని కళ్లు మూసుకొని, నిద్రపోయాడు. బలరాముడు మాత్రం... ‘ తమ్ముడు నిద్రపోతున్నాడు, నేను కాపలా కాస్తాను’ అని చెట్టు పక్కన కూర్చొన్నాడు.
రాత్రిపూట కావడం, అందులోనూ అడవి కావడంతో చీకటి మరింత పెరిగింది. అక్కడి వాతావరణం మొత్తం చాలా భయానకంగా మారింది. ఆ సమయంలో ఒక రాక్షసుడు అక్కడికి వచ్చాడు. అతని శరీరం చాలా భారీగా ఉంది. కళ్లల్లో అగ్ని జ్వాలల మాదిరి కాంతి మెరిచింది. తన సోదరుడు కృష్ణుడు నిద్రపోతున్నాడు కాబట్టి.. ఆ రాక్షసుడిని తానే ఎదురించాలని బలరాముడు అనుకుంటాడు.
భారీగా మారిన రాక్షసుడు
వెంటనే ఆ రాక్షసుడి ముందుకు వెళ్లి ఎదురు నిలపడతాడు. ఆ రాక్షసుడు ఏ మాత్రం భయపడకుండా... బలరాముడిని చంపి తినడానికి ముందుకు వస్తాడు. బలరాముడు ఒక్క అడుగు వేస్తే... రాక్షసుడు రెండింతలు తన ఆకారాన్ని పెంచుకుంటున్నాడు. రాక్షసుడు క్షణ క్షణం మరింత బరువు పెరిగిపోతున్నాడు. అతని శరీరం చెట్ల కంటే ఎత్తుగా మారింది. బలరాముడికి భయం పట్టుకుంది. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. రాక్షసుడు మరింత భయంకరంగా మారిపోయాడు.
ఇంతలో కృష్ణుడికి మెలకువలోకి వచ్చాడు. తన సోదరుడి పరిస్థితి అర్థం చేసుకొని... దగ్గరకు వెళ్లాడు. అన్నయ్య ఎందుకు భయపడుతున్నావ్ అని ప్రశ్నించాడు. బలరాముడు భయంతో..... ‘ఈ రాక్షసుడిని చూశావా తమ్ముడు.. ప్రతి క్షణం పెరుగుతున్నాడు’ అని చెబుతాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ... రాక్షసుడి వైపు అడుగు వేశాడు. కొంచెం కూడా భయపడకుండా... అతనికి ఎదురుగా కృష్ణుడు నిలపడతాడు. ఆయన అడుగు ముందుకు వేస్తుంటే.... రాక్షసుడి ఆకారం తగ్గిపోతూ వస్తుంది. చివరకు బియ్యం గింజ అంత పరిమాణంలోకి మారి... చివరకు గాలిలో కలిసిపోతాడు. అది చూసి బలరాముడు షాకౌతాడు.
కథలోని అర్థం...
ఇది ఎలా జరిగింది అని తన సోదరుడిని అడుగుతాడు. అప్పుడు కూడా కృష్ణుడు నవ్వుతూ.. ‘ అన్నయ్యా.. నిజంగా రాక్షసుడు లేడు. అతను నీ భయానికి ప్రతి రూపం. మనం భయపడితే, మన శత్రువు, మన సమస్య, మన ముందున్న అవరోధం పెద్దదిగా కనిపిస్తుంది. కానీ మనం ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కుంటే అది చిన్నదై మన ముందే సమస్య మాయం అవుతుంది.’ అని చెబుతాడు.
భయం అనేది మన మనసులోని బలహీనత మాత్రమే. మనం ఏ సమస్యనైనా ధైర్యంతో, విశ్వాసంతో ఎదుర్కొంటే, అది ఎంత పెద్దదైనా చిన్నదైపోతుంది. జీవితంలో భయాలు, అనుమానాలు, ఆందోళనలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిని ధైర్యం, జ్ఞానం, ఆత్మవిశ్వాసం అనే ఆయుధాలతో ఎదుర్కొంటే, విజయం మనదే అవుతుంది. భయం పెరిగితే సమస్య పెద్దవుతుంది. ధైర్యం పెరిగితే సమస్య తగ్గుతుంది.
ఇదే శ్రీకృష్ణుడి జీవన పాఠం “భయాన్ని జయించు, నీ జీవితాన్ని విజయం వైపు నడిపించు!