Divorce Month: ఈ నెలలోనే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్న జంటలు
Divorce Month: జనవరిలోనే ఎక్కువ మంది భార్యభర్తలు విడిపోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే దీన్ని విడాకుల నెల లేదా డైవర్స్ మంత్ అని పిలుచుకుంటారు. అసలు జనవరిల నెలలోనే ఎక్కువ జంటలు ఎందుకు విడిపోతున్నాయి?

విడాకుల నెల జనవరి
ప్రతి ఏడాది జనవరి వచ్చిందంటే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఆనందంలో తేలిపోతారు. అందులోనూ భారతదేశంలో అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి కూడా జనవరి నెలలోనే వస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం జనవరి నెల రాగానే విడాకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. న్యాయవాదులు, కార్యాలయాలు, కౌన్సిలింగ్ సెంటర్లు, కోర్టులో విడాకుల కోసం వస్తున్న వారు అకస్మాత్తుగా పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే జనవరిని ‘డివోర్స్ మంత్’ అని పిలవడం మొదలుపెట్టారు. కొత్త సంవత్సరం మొదలైన వెంటనే వచ్చే మొదటి నెలలోనే ఇలా విడాకులు అధికంగా బయటపడుతున్నాయి. కుటుంబ సంబంధాలు బలంగా ఉండాల్సిన సమయంలో విడాకులు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి ఎన్నో సామాజిక, మానసిక, ఆర్థిక కారణాలు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.
జనవరిలోనే బయటపడతారు
డిసెంబర్ నెల చాలా ఆనందంగా గడిచే కాలం. ఎంతో మంది క్రిస్మస్, న్యూ ఇయర్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే డిసెంబర్ నెలలో సెలవులు కూడా అధికంగా వస్తాయి. పిల్లలు ఆనందంగా ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు దంపతులు ప్రేమగానే ఉంటారు. ఈ నెల గడిచాక చూద్దాం, కొత్త ఏడాదిలో చూద్దాం, పిల్లల ముందు గొడవలు వద్దు వంటి మాటలు చెప్పి ఒకరినొకరు కంట్రోల్ చేసుకుంటారు. ఇక డిసెంబర్ నెల గడిచాక అంతర్గత అసంతృప్తులు మొదలవుతాయి. కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలు, రిజల్యూషన్స్ తీసుకోవాలనే ఆచారాన్ని పాటిస్తారు. ఆ సమయంలోనే కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి జీవితంలో పెద్ద పెద్ద మార్పులు చేసుకుంటారు. అందుకే ఎక్కువమంది కొత్త ఏడాదిలో ఒంటరిగా బతికేందుకు సిద్ధమవ్వాలనే రిజల్యూషన్ తీసుకుని విడాకులు బాట పడుతూ ఉంటారు.
కొత్త ఏడాది కొత్త జీవితం
కొత్త ఏడాది అనేది చాలామందికి కొత్త జీవితం అనే సంకేతం ఇస్తుంది. ఇకపై ఇలా జీవించకూడదని అనుకోవడం, సంతోషంగా లేని బంధంలో ఉండకూడదు అని ఆలోచన చేయడం వంటివి జనవరిలో ఎక్కువగా ఉంటాయి. న్యూ ఇయర్ రిజల్యూషన్ భాగంగా కొందరు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని విడాకులు వైపు వెళుతూ ఉంటారు. కొత్త ఏడాదిలో స్వేచ్ఛగా జీవించాలనే కోరిక ఎక్కువైపోతుంది. అంతే కాదు డిసెంబర్ నెలలో కోర్టులు, న్యాయవాదులు ఎక్కువగా సెలవుల్లో ఉంటారు. జనవరిలో మళ్లీ కార్యాలయాలు తప్పకుండా తెరుచుకుంటాయి. దీంతో ఒక్కసారిగా విడాకుల పిటిషన్లు పెరిగిపోతున్నాయి.
డిసెంబర్ నెలంతా బిజీ
న్యాయ నిపుణులు చెబుతున్న ప్రకారం జనవరిలో ఒకేసారిగా విడాకుల సంఖ్య పెరగడం లేదా వివాహం విఫలం అవడం అనేది డిసెంబర్ నెల ప్రభావమేనని వివరిస్తున్నారు. చాలాసార్లు డిసెంబర్లో కేసులు తగ్గిపోతాయి. ఆ నెలంతా అందరూ బిజీగా ఉంటారు. ఆ కేసులన్నీ కూడా ఒకేసారి జనవరిలో వచ్చి పడతాయి. విడాకులు ఏ సమస్యకూ పరిష్కారం కాదు. దంపతులు పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకుని అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవాలి. అలాగే కుటుంబ సహకారం కూడా తీసుకోవాలి. కుటుంబంలో దంపతుల మధ్య గొడవలు పెట్టే వారిని దూరంగా ఉంచాలి. అలాంటప్పుడు విడాకులు అనే శాశ్వత దూరం భార్య భర్తల మధ్య రాకుండా ఉంటుంది.

