- Home
- Feature
- Uma Telugu Traveller: ఇంట్లోనే శవాలు, వాటితోనే కలిసి జీవనం, ఉమ తెలుగు ట్రావెలర్ చూపించిన వింత ఆచారం ఎక్కడో తెలుసా?
Uma Telugu Traveller: ఇంట్లోనే శవాలు, వాటితోనే కలిసి జీవనం, ఉమ తెలుగు ట్రావెలర్ చూపించిన వింత ఆచారం ఎక్కడో తెలుసా?
Uma Telugu Traveller: మరణించినా మనతోనే ఉన్నారు అనుకుని శవాలతో కలిసి జీవనం సాగిస్తున్న వింత తెగ గురించి మీకు తెలుసా? మలేషియాలో ఉన్న ఓ జాతిలో ఒళ్లు గగుర్పొడిచే వింత ఆచారాన్ని తెలుగు ట్రావెలర్ ఉమ బయటకు తీసుకువచ్చాడు.

100 దేశాలకు పైగా తిరిగిన తెలుగు ట్రావెల్ వ్లాగర్
తెలుగు ట్రావెలర్ ఉమ గురించి అందరికి తెలిసిందే.. ఇప్పటికే వంద దేశలకు పైగా తిరిగిన ఈ తెలుగు ట్రావెల్ వ్లాగర్.. ఎన్నో వింతలు విశేషాలు, విదేశాల్లో ఉన్న వింత వింత ఆచారాలు, వ్యవహారాలను చూపిస్తూ ఉంటాడు. ఉమకు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈక్రమంలో ఆయన గతంలో చూపించిన ఓ ట్రైబ్ వింత ఆచారం గురించి తెలిస్తే షాక్ అవుతారు. మలేషియా పర్యటనకు వెళ్ళిన తెలుగు యూట్యూబర్ ఉమా (Uma Telugu Traveller) తన ట్రావెల్ వ్లాగ్స్‌లో చూపించిన ఒక విచిత్రమైన, గుండె జల్లరిపించే సాంప్రదాయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అది మలేషియాలోని తొరాజా తెగలో కామన్ విషయం.
ఎవరీ తొరాజా ప్రజలు? ఏం చేస్తుంటారు...
సాధారణంగా ఎవరైనా మరణిస్తే కొన్ని గంటల్లోనే అంత్యక్రియలు ముగించడం మనకు తెలుసు. కానీ, మలేషియాలోని ‘తొరాజా’ (Toraja) అనే తెగకు చెందిన ప్రజలు మరణించిన తమ వారి శవాలను పూడ్చిపెట్టకుండా, నెలలు లేదా సంవత్సరాల తరబడి ఇంట్లోనే ఉంచుకుని వారితో కలిసి జీవిస్తారు. ఈ వింత ఆచారానికి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు చూస్తే...
తొరాజా అనేది నిజానికి ఇండోనేషియాలోని సులవేసి ద్వీ పానికి చెందిన ఒక ప్రత్యేకమైన తెగ. అయితే, మలేషియాలోని బోర్నియో ప్రాంతంలోనూ, వలస వచ్చిన ఈ తెగ ప్రజలు కొందరు నివసిస్తున్నారు. వీరి సంప్రదాయాలు ప్రపంచంలోని మిగతా సంస్కృతులకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా మరణం పట్ల వీరికున్న దృక్పథం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
శవాన్ని ఇంట్లోనే ఎందుకు ఉంచుకుంటారు?
ఈ తెగ ప్రజల నమ్మకం ప్రకారం, ఒక వ్యక్తి శ్వాస వదిలేసిన వెంటనే చనిపోడు. కేవలం అనారోగ్యానికి గురయ్యాడని మాత్రమే భావిస్తారు. అతనిని ‘మకౌలా’ (రోగి) అని పిలుస్తారు. అంత్యక్రియలు ఘనంగా నిర్వహించేంత వరకు ఆ వ్యక్తి ఆత్మ ఇల్లు వదిలి వెళ్లదని వారు నమ్ముతారు. అంత్యక్రియల ప్రక్రియ (సెరిమనీ) చాలా ఖరీదైనది. దీనికోసం రూ. 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఖర్చవుతుంది.
ముఖ్యంగా ఇక్కడ ఒక్కో దున్నపోతు (Buffalo) ధర 10 లక్షల రూపాయల పైనే ఉంటుంది. అంత్యక్రియల రోజున ఈ దున్నపోతులను బలి ఇస్తారు. అంత డబ్బు సమకూరే వరకు, కొన్ని నెలలు లేదా సంవత్సరాల తరబడి మృతదేహాన్ని ఇంట్లోనే భద్రపరుస్తారు.ఉమా స్వయంగా ఒక తొరాజా ఇంటికి వెళ్లి, ఒక సంవత్సరం క్రితం మరణించిన 103 సంవత్సరాల వృద్ధురాలి మృతదేహాన్ని సందర్శించారు.
ఇంట్లో శవంతో ఎలా జీవిస్తారు?
యూట్యూబర్ ఉమా తన వీడియోలో చూపించినట్లుగా... శవం కుళ్ళిపోకుండా, వాసన రాకుండా ఉండేందుకు గతంలో టీ పొడి రాసేవారు, ఆతరువాత కొన్ని ప్రత్యేక మూలికలు, రసాయనాలు (ఫార్మాలిన్ వంటివి) ఉపయోగిస్తారు. శవాన్ని ఒక ప్రత్యేక గదిలో మంచంపై పడుకోబెడతారు. రోజూ ఉదయం, రాత్రి ఆ శవానికి ఇష్టమైన ఆహారాన్ని, కాఫీ లేదా టీని అందిస్తారు. బంధువులు వస్తే ఆ శవం వద్దకు తీసుకెళ్లి పలకరింపజేస్తారు. "అయ్యా, మీ చుట్టాలు వచ్చారు" అని శవంతో మాట్లాడుతుంటారు. వారికి బట్టలు మార్చడం, సిగరెట్లు అలవాటు ఉంటే నోట్లో సిగరెట్ పెట్టడం వంటివి చేస్తుంటారు.
తొరాజా ప్రజల ఇళ్ల నిర్మాణం – సంస్కృతి
తొరాజా ప్రజల ఇళ్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దాదాపు 4000 సంవత్సరాల క్రితం వీరు సౌత్ చైనా నుండి పడవల ద్వారా వలస వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. అందుకే వీరి ఇళ్ల పైకప్పులు 'యు' (U) ఆకారంలో, పడవ ఆకృతిని పోలి ఉంటాయి. వీటిని పైన్ లేదా వెదురు చెట్లతో నిర్మిస్తారు. ఇంటి ముందు వరుసగా అమర్చిన దున్నపోతు కొమ్ములు (Buffalo Horns) ఆ కుటుంబం హోదాను, వారు ఇప్పటివరకు ఇచ్చిన జంతు బలుల సంఖ్యను సూచిస్తాయి.
'మానెనే' (Ma'nene) పండుగ అంటే ఏంటి?
అంత్యక్రియలు ముగిసిన తర్వాత మృతదేహాలను భూమిలో పూడ్చకుండా, కొండలను తొలిచి చేసిన గుహలలో (Caves) లేదా కాఫిన్ బాక్సులలో భద్రపరుస్తారు. ఉమా 'లోండా' (Londa) అనే 1100 సంవత్సరాల పురాతనమైన కేవ్‌ను సందర్శించారు. అక్కడ వందలాది ఏళ్ల నాటి శవపేటికలు, పుర్రెలు, అస్థిపంజరాలు కొండ అంచులలో వేలాడుతూ కనిపించాయి. అంత్యక్రియలు ముగిసి, శవాన్ని కొండ గుహల్లో భద్రపరిచిన తర్వాత కూడా వీరి ఆచారం ముగిసిపోదు. ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి ‘మానెనే’ అనే పండుగ జరుపుకుంటారు.
పండుగ రోజు ఏం చేస్తుంటారంటే?
మానెనే పండుగ రోజు ఏంచేస్తారంటే.. సమాధుల నుంచి శవాలను బయటకు తీసి, వాటికి స్నానం చేయించి, కొత్త బట్టలు తొడుగుతారు. ఆ శవాలతో కలిసి ఊరంతా ఊరేగింపుగా తిరుగుతూ ఫొటోలు దిగుతారు.మరణాన్ని ఒక విషాదంగా కాకుండా, జీవితంలో ఒక భాగమని, చనిపోయినవారు ఎప్పటికీ తమతోనే ఉంటారని నమ్మే ఈ తొరాజా సంప్రదాయం వినడానికి వింతగా, భయానకంగా అనిపించినా... వారి పూర్వీకుల పట్ల వారికి ఉన్న అమితమైన ప్రేమకు, గౌరవానికి ఇది నిదర్శనమని యూట్యూబర్ ఉమా తన వ్లాగ్ ద్వారా ప్రపంచానికి వివరించారు.

