Interesting Facts: బీర్ బాటిల్స్ ఆ రంగులోనే ఎందుకు ఉంటాయి.? అసలు కారణం ఏంటంటే
Interesting Facts: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బీర్‌ను ఇష్టపడుతుంటారు. తయారీ నుంచి ప్యాకింగ్ వరకు బీర్‌కి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బీర్ బాటిల్ రంగు
బీర్లు ఎక్కువగా బాటిల్స్, క్యాన్స్ రూపంలో లభిస్తాయని తెలిసిందే. అయితే ఎక్కువగా శాతం బీర్ బాటిల్స్ గాజు బాటిల్స్ ఉంటాయి. అందులోనూ బీర్ బాటిల్స్ క్రీమ్ లేదా గ్రీన్ కలర్‌లో ఉండడం గమనించే ఉంటాం. అయితే ఈ రంగు వెనకాల ఒక శాస్త్రీయ కారణం ఉందని మీకు తెలుసా.?
సమస్యకు పరిష్కారంగా
బీర్ తయారీకి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మొదట మట్టితో చేసిన పాత్రల్లో నిల్వ చేసేవారు. తర్వాత గాజు బాటిళ్లు వాడకం వచ్చింది. బీర్ వ్యాపారం పెరిగి దూర ప్రాంతాలకు తరలింపు మొదలైనప్పుడు ఒక సమస్య బయటపడింది. బీర్ రుచి త్వరగా మారిపోవడం. ఎండలో ఉంచిన బీర్ చేదు వాసన రావడం మొదలయ్యేది.
సూర్య కాంతి వల్లే..
బీర్ల తయారీలో హాప్స్ అనే ముఖ్యమైన పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఇది బీర్‌కు ప్రత్యేక రుచి, వాసన ఇస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే UV కిరణాలు బీర్‌పై పడితే హాప్స్‌తో రసాయన చర్య జరుగుతుంది. దీని ఫలితంగా అసహ్యమైన వాసన వస్తుంది. దీనిని సాధారణంగా స్కంకీ స్మెల్ అంటారు అందుకే ఎండలో పెట్టిన బీర్ రుచి పూర్తిగా మారుతుంది.
క్రీమ్ బాటిల్స్ ఎందుకు ఉపయోగిస్తారు.?
పరిశీలనల్లో ఒక విషయం స్పష్టమైంది. గోధుమ రంగు గాజు UV కిరణాలను ఎక్కువగా అడ్డుకుంటుంది. ఈ బాటిల్ బీర్ రుచిని కాపాడుతుంది. వాసన చెడిపోకుండా చూస్తుంది. ఎక్కువ కాలం నాణ్యత నిలుపుతుంది. అందుకే గోధుమ రంగు బాటిల్ చాలా కాలం పాటు బీర్ ఇండస్ట్రీలో స్టాండర్డ్‌గా నిలిచింది.
గ్రీన్ కలర్ బాటిల్ ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది?
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గాజు కొరత వచ్చింది. ప్రత్యేకంగా గోధుమ రంగు గాజు దొరకడం కష్టమైంది. దీంతో అప్పట్లో కంపెనీలు గ్రీన్ కలర్ బాటిళ్లను ఉపయోగించడం మొదలు పెట్టాయి. అయితే గ్రీన్ బాటిల్స్ UV కిరణాలను కొంతవరకు మాత్రమే అడ్డుకుంటుంది. గోధుమ బాటిల్ కంటే రక్షణ తక్కువగా ఉంటుంది. కానీ ప్రజలకు ఆ రూపం నచ్చింది. కొన్ని బ్రాండ్లు దీనినే తమ గుర్తింపుగా మార్చుకున్నాయి.
పారదర్శక బాటిళ్లు ఎందుకు అరుదుగా కనిపిస్తాయి?
తెల్ల గాజు బాటిల్ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ వీటిలో ఒక పెద్ద లోపం ఉంది. ఇవి యూవీ కిరణాలను అస్సలు అడ్డుకోవు. అలాంటి బాటిల్‌లో ఉన్న బీర్ త్వరగా చెడిపోతుంది. వాసన త్వరగా మారిపోతుంది. అందుకే పారదర్శక బాటిల్ వాడాలంటే ప్రత్యేక ప్యాకింగ్ లేదా రసాయన చికిత్స తప్పనిసరి.

