Slowest Vande Bharat : అత్యంత నెమ్మదిగా నడిచే వందేభారత్ రైలు ఏది? స్పీడ్ ఎంతో తెలుసా?
Slowest Vande Bharat Express : సాధారణంగా వందే భారత్ రైలు అంటేనే వేగంగా ప్రయాణించేదని అర్థం. కానీ ఓ స్పెషల్ వందేభారత్ ట్రైన్ చాలా తక్కువ వేగంతో పరుగుతీయబోతోంది. ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది, టైమింగ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.

అతి నెమ్మదిగా నడిచే వందే భారత్ రైలు ఇదే..
భారతదేశంలో హైస్పీడ్ రైలు సేవలకు పేరుగాంచిన వందే భారత్ సిరీస్లో ఓ కొత్త రైలు చేరింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే వందేభారత్ ట్రైన్. కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి మంగళూరు మీదుగా గోవాలోని మడ్గావ్ వరకు ఈ రైలు నడుస్తుంది.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 13న అంటే నిన్న(శుక్రవారం) ఈ వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభించారు. 16 కోచ్లు ఉండే ఈ రైలు, బెంగళూరు, కోస్టల్ కర్ణాటక, గోవా మధ్య కనెక్టివిటీని పెంచుతుంది. సాధారణ ప్రయాణికుల నవంబర్ 15 నుంచి ఈ ట్రైన్ సర్వీస్ అందుబాటులోకి రానుంది.
గంటకు 54 కి.మీ. వేగమే..!
వందే భారత్ రైళ్ల గురిష్ఠ వేేగం గంటకు 180 కిలోమీటర్లు… అయితే చాలా రైళ్లు 80 నుండి 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంటాయి. కానీ బెంగళూరు-గోవా మధ్య ప్రయాణించే ఈ కొత్త వందేభారత్ సగటున గంటకు 54 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళుతుంది. బెంగళూరు నుంచి మడ్గావ్ వరకు సుమారు 670 కి.మీ. ప్రయాణాన్ని పూర్తి చేయడానికి 13 గంటలకు పైగా సమయం పడుతుంది.
ఈ వందేభారత్ ట్రైన్ ప్రధానంగా పశ్చిమ కనుమల్లోని కష్టమైన కొండ మార్గాలు, ఇరుకైన మలుపులు, ఏటవాలు ప్రాంతాల మీదుగా ప్రయాణం సాగిస్తుంది. అంతేేకాదు ఈ కొన్నిచోట్ల ట్రాక్ల స్పీడ్ లిమిట్ కూడా ఈ రైలు వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో భారతదేశంలోనే అతి నెమ్మదిగా నడిచే వందే భారత్ రైళ్లలో ఒకటిగా ఇది నిలవనుంది.
ఏయే స్టేషన్లలో ఆగుతుంది?
ఈ రైలు యశ్వంత్పూర్ స్టేషన్ నుండి బయలుదేరుతుంది. శ్రావణబెళగొళ, హాసన్, సకలేశ్పూర్, సుబ్రహ్మణ్య రోడ్, కబక పుత్తూరు, మంగళూరు జంక్షన్, ఉడిపి, కుందాపుర, మూకాంబికా రోడ్ బైందూర్, మురుడేశ్వర్, గోకర్ణ రోడ్, కార్వార్ స్టేషన్ల మీదుగా మడ్గావ్ చేరుకుంటుంది. ఈ మార్గంలో ప్రయాణించే వారు తీరప్రాంతాలతో పాటు పశ్చిమ కనుమల ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా సకలేశ్పూర్ నుంచి సుబ్రహ్మణ్య రోడ్ వరకు ఉన్న కొండ మార్గంలో సొరంగాలు, వంతెనలు, అడవులు భలే అందంగా కనిపిస్తాయి.
రెగ్యులర్ రైలు టైమింగ్స్ ఏంటి?
నవంబర్ 15 నుంచి రైలు నంబర్ 26655 యశ్వంత్పూర్ నుంచి ఉదయం 7.35 గంటలకు బయలుదేరి రాత్రి 8.55 గంటలకు మడ్గావ్ చేరుకుంటుంది. ఈ రైలు బుధవారాల్లో నడవదు. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 26656 మడ్గావ్ నుంచి ఉదయం 8.20 గంటలకు బయలుదేరి రాత్రి 9.15 గంటలకు యశ్వంత్పూర్ చేరుకుంటుంది. ఇది గురువారాల్లో నడవదు. రెండు మార్గాల్లోనూ వారానికి ఆరు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రారంభోత్సవం రోజున నడిచిన స్పెషల్ రైలు టైమింగ్స్, ఈ రెగ్యులర్ ప్యాసింజర్ సేవల టైమింగ్స్ కంటే భిన్నంగా ఉంటాయి.
కొండ మార్గంలో సరికొత్త అనుభూతి
కర్ణాటకలోని లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాలు, గోవా మధ్య ప్రయాణాన్ని ఈ రైలు సులభతరం చేస్తుంది. మంగళూరు, ఉడిపి, మురుడేశ్వర్, గోకర్ణ, కార్వార్ లాంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. 16 కోచ్లు ఉండే ఈ రైలులో చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ సీటింగ్ వసతులు ఉన్నాయి. రివాల్వింగ్ సీట్లు, ఆటోమెటిక్ డోర్లు, వైఫైతో కూడిన ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్, బయో టాయిలెట్స్ లాంటి లేటెస్ట్ ఫెసిలిటీస్ ఇందులో ఏర్పాటు చేశారు.













