ఆ గ్రామంలో వందల పక్షులు హఠాత్తుగా కింద పడి మరణిస్తుంటాయి.. కారణం ఏంటో తెలుసా?
ప్రకృతి వింతల్లో ఇది ఒకటి. పక్షులు మరణించేందుకు ఒక గ్రామానికి వస్తాయి. ఆ గ్రామానికి వచ్చాక హఠాత్తుగా ఆకాశం నుంచి నేలపై దబ్బున పడి మరణిస్తాయి. ఈ వింతను చూసేందుకు ఎంతో మంది పర్యాటకులు కూడా వస్తుంటారు.

అంతుచిక్కని పక్షి మరణాలు
ప్రకృతిలో ఎన్నో వింతలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్ని శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. అలాంటి వింత సంఘటన జరిగే గ్రామం మన భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉంది. అదే అసోంలోని జటింగా గ్రామం. ఇక్కడ ఏటా వర్షాకాలం ముగిసే సమయంలో ఆకాశం నుంచి పక్షులు కింద పడుతుంటాయి. ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెల మధ్య ఈ వింత ఘటన కనిపిస్తుంది. రాత్రి 6 గంటల నుంచి 9.30 గంటల మధ్య పక్షులు వేగంగా ఎగురుతూ చెట్లు, వెదురు పొదలు, ఇళ్ల పైకప్పులను ఢీకొంటాయి. కొన్ని పక్షులు చనిపోగా, మరికొన్ని దారి తప్పినట్లుగా కనిపిస్తాయి. ఈ వింత దృశ్యం చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు.
40 రకాల పక్షులు..
జటింగా గ్రామంలో ఈ వింత ఘటనకు గురవుతున్న పక్షుల్లో కింగ్ఫిషర్లు, కొంగలు, డ్రోంగోలు, బీ ఈటర్లు సహా 40కి పైగా రకాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటిలో ఎక్కువగా పగటిపూట తిరిగే పక్షులే ఉంటాయి. చిన్న వయసు పక్షులు ఎక్కువగా ప్రభావితమవుతున్నట్లు గుర్తించారు. గతంలో స్థానిక గిరిజనులు ఆకాశం నుంచి దుష్టశక్తులు వచ్చి పక్షుల రూపంలో గ్రామంపై దాడి చేస్తున్నాయని నమ్మేవారు. అయితే శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు. దట్టమైన పొగమంచు, తక్కువ ఎత్తులో ఉండే మేఘాలు, బలమైన గాలుల వల్ల పక్షులు దారి తప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇళ్లలో వెలిగించే ప్రకాశవంతమైన దీపాలు కూడా వాటిని గందరగోళానికి గురిచేస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు అసలు కారణం ఏమిటనేది ఇప్పటికీ పూర్తిగా తేలలేదు. పక్షులు కావాలని చనిపోవడానికి వస్తున్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
జటింగా గ్రామానికి ఎలా వెళ్లాలి?
అసోంలోని దిమా హసావో జిల్లాలో ఈ గ్రామం ఉంది. హాఫ్లాంగ్ అనే అందమైన కొండ ప్రాంతానికి ఇది సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్లాలనుకునే పర్యాటకులు గువాహటి విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి జటింగా సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్లో వెళ్లాలనుకునేవారు హాఫ్లాంగ్ హిల్ రైల్వే స్టేషన్కు చేరుకోవచ్చు. గువాహటి, సిల్చార్, లుమ్డింగ్ నుంచి రైలు సౌకర్యాలు ఉన్నాయి. హాఫ్లాంగ్ నుంచి ట్యాక్సీలు, ఇతర వాహనాల్లో జటింగా చేరుకోవచ్చు. అయితే పక్షులకు ఇబ్బంది కలగకుండా స్థానికులు, అటవీశాఖ సూచనలు పాటించాలి. ప్రకృతి అందాలతో పాటు అంతుచిక్కని రహస్యాన్ని కలిగిన ఈ చిన్న గ్రామం పర్యాటకులను ఆకర్షిస్తోంది.













