100 కిలోల వడ్ల నుండి ఎన్ని కిలోల బియ్యం వస్తాయో తెలుసా?
వడ్ల నుండి మనం తినే బియ్యంను ఎలా వేరుచేస్తారు… రైస్ మిల్లుల్లో జరిగే ప్రాసెస్ ఏంటి? 100 కిలోల వడ్ల నుండి ఎన్నికిలోల బియ్యం వస్తాయి? మిగతా వేస్ట్ అంతా ఏం చేస్తారు?

వడ్ల నుండి బియ్యం తీసే ప్రాసెస్ ఇదే..
ప్రస్తుతం మనం తినే అన్నం బియ్యంతో చేస్తారు... ఈ బియ్యం వడ్లనుండి వస్తాయి. రైతులు పండించే వరి నుండి ఈ వడ్లు వస్తాయి. అయితే చాలామందికి ఓ డౌట్ ఉంటుంది... రైతుల నుండి సేకరించే వడ్లను బియ్యంగా మార్చే ప్రక్రియ ఎలా ఉంటుంది? ఈ ప్రాసెస్ లో ధాన్యం బరువు ఎంత తగ్గుతుంది? అని. కాబట్టి రైతుల దగ్గర వడ్లను సేకరించే దగ్గరినుండి మిల్లులోంచి బియ్యం బస్తాలు బయటకు వచ్చేవరకు జరిగే ప్రాసెస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
వడ్ల నుండి బియ్యం ఎలా వేరుచేస్తారు?
రైతులు పండించే వడ్లను ప్రభుత్వం లేదా ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ఈ వడ్లను మిల్లులకు తరలించి బియ్యంగా మారుస్తారు. మిల్లులో వివిధ దశల్లో వడ్లను ప్రాసెస్ చేసి తినడానికి వీలుగా బియ్యంగా మారుస్తాయి.
మొదట రైతుల నుండి సేకరించిన ధాన్యం (వడ్ల) రైస్ మిల్లుల్లోకి చేరగానే జల్లెడ పడతారు. ఇందుకోసం ప్రత్యేకంగా మిషన్లు ఉపయోగిస్తారు... ఈ ప్రక్రియ ద్వారా గడ్డి, దుమ్ము, తాలు గింజలు వంటివి వేరు అవుతాయి. ఆ తర్వాత వడ్ల సైజులోనే ఉండే చిన్నచిన్న రాళ్లను మరో ప్రత్యేక యంత్రం ద్వారా వేరుచేస్తారు. ఇలా కేవలం వడ్లను మాత్రమే సేకరిస్తారు.
ఇప్పుడు అసలు ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. వడ్లపై ఉండే పొట్టును ప్రత్యేక మిషన్ల ద్వారా వేరుచేస్తారు. దీంతో బ్రౌన్ కలర్ లో బియ్యం గింజలు వస్తాయి... వీటినే బ్రౌన్ రైస్ అంటారు. ఈ బ్రౌన్ పొరను కూడా తొలగించేందుకు బాగా పాలిష్ చేస్తారు... దీంతో మనం తినే తెల్లని బియ్యం రెడీ అవుతాయి.
అయితే ఈ బియ్యంలోనూ నల్లగా పాడయిపోయినవి, రెండు ముక్కలుగా మారిన గింజలు, నూకలు ఉంటాయి.. వీటిని కూడా ప్రత్యేక మిషన్ల ద్వారా వేరుచేస్తారు. ఇలా కేవలం నాణ్యమైన బియ్యం గింజలనే సేకరించి బస్తాల్లోకి చేరుస్తారు... ఇవే ప్రజలు తినేందుకు బయటకు వచ్చే బియ్యం.
ఎన్ని వడ్ల నుండి ఎంత బియ్యం వస్తుంది?
వడ్లు బియ్యంగా మారేలోపు ధాన్యం బరువు చాలా తగ్గుతుంది. ఉదాహరణకు 100 కిలోల వడ్లను రైస్ మిల్లులో ప్రాసెస్ చేస్తున్నారని అనుకుందాం. వడ్లలోని గడ్డి, దుమ్ము, రాళ్లను వేరు చేయడంతో కొంత బరువు తగ్గుతుంది. ఇక వడ్లపై ఉండే పొట్టును తొలగించే సమయంలో దాదాపు ఇరవై కిలోలు తగ్గుతాయి.
తవుడు (బియ్యంపై ఉండే బ్రౌన్ పొర) తొలగింపుతో మరో 8 నుండి 10 కిలోలు తగ్గుతాయి. పాడయిపోయినవి, నూకలు వేరుచేశాక మరికొంత బరువు తగ్గుతుంది. ఇలా 100 కిలోల వడ్ల నుండి 65 నుండి 70 కిలోల బియ్యం మాత్రమే వస్తాయి. ప్రభుత్వం కూడా మిల్లుల దగ్గర ఇదే లెక్కలు అనుసరిస్తుంది... క్వింటాల్ వడ్లకి 67 కిలోల బియ్యంను అంచనా వేస్తుంది... మిగతా 33 కిలోలను వేస్ట్ గా పరిగణిస్తారు.
వడ్ల నుండి వేరయ్యే పదార్థాలను ఏం చేస్తారు?
వడ్ల నుండి వేరుచేసిన వరిపొట్టు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. కంపెనీల్లోని బాయిలర్లతో పాటు ఇటుక బట్టీల్లో దీన్ని ఇంధనంగా ఉపయోగిస్తారు. ఈ పొట్టుతో పాటు నూకలను కోళ్ల ఫారంలలో ఉపయోగిస్తారు. పొట్టును ఫారంలో పరిచి కోళ్ల కింద నేల మెత్తగా ఉండేలా చూస్తారు, నూకలను వాటి అహారంగా ఉపయోగిస్తారు. ఇక బియ్యం పైపొర (తవుడు) నుండి నూనె తీస్తారు.. ఇదే రైస్ బ్రౌన్ ఆయిల్. ఇలా వడ్ల నుండి బియ్యం తీసే క్రమంలో వచ్చే పదార్థాలేవి వేస్ట్ కావు... ఏదో రకంగా ఉపయోగపడతాయి.









