ఒక ఏటిఎం మెషిన్ లో ఎంత డబ్బు ఉంటుంది..?
కార్డు పెట్టి సీక్రెట్ పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఏటిఎంలోంచి డబ్బులు వచ్చేస్తాయి. ఈ సమయంలో ఈ మెషిన్ లో ఎంత డబ్బు ఉంటుందనే ప్రశ్న చాలా మందికి వచ్చివుంటుంది. మరి దీన్ని పూర్తిగా నింపాలంటే ఎంత డబ్బు అవసరమో తెలుసా?

బ్యాంకింగ్ రంగంలో ఏటిఎం ఓ విప్లవం...
ATM (Automated Teller Machine)... ఇది బ్యాకింగ్ రంగంలో ఓ విప్లవమనే చెప్పాలి. అప్పటివరకు పాస్ బుక్ పట్టుకుని బ్యాంకులో గంటలతరబడి నిలబడితేగానీ డబ్బులు అందేవి… అదీ క్యాషియర్ కరుణిస్తేనే… అతడు క్యాష్ లేవని చెబితే చేసేదేమీ ఉండేదికాదు. కానీ ఏటిఎం రాకతో బ్యాంకుకు వెళ్లే అవసరం లేకుండాపోయింది.. కార్డు పట్టుకుని ఇలా ఏటిఎం సెంటర్ కు వెళ్లి అలా డబ్బులు తీసుకువచ్చే వెసులుబాటు కలిగింది. ఒ ఏటిఎంలో లేకుంటే మరో ఏటిఎంలో తీసుకోవచ్చు. యూపిఐ, ఆన్ లైన్ పేమెంట్స్ పెరిగాక ఏటిఎం వాడకం తగ్గిందిగానీ గతంలో డబ్బులు కావాలంటే ఇదే దిక్కు.
ఏటిఎం మెషిన్ వెనక క్లిష్టమైన టెక్నాలజీ
అయితే మనం రోజూ వాడే ఏటిఎం మెషిన్ చాలా సాధారణంగా కనిపిస్తుంది. కార్డు పెట్టి, రహస్య పిన్ నంబర్ ఎంటర్ చేయగానే కొన్ని సెకన్లలో డబ్బు చేతికి వస్తుంది. కానీ ఈ సులభమైన పని వెనుక చాలా క్లిష్టమైన టెక్నాలజీ పనిచేస్తుంది.
ఏటిఎం లో ఎంత డబ్బు ఉంటుంది..?
చాలాసార్లు “ఏటిఎంలో డబ్బు లేదు” అనే బోర్డు చూసి నిరాశపడి ఉంటాం. అప్పుడు “ఒక ఏటీఎంలో గరిష్ఠంగా ఎంత డబ్బు ఉంటుంది?” అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. నిజానికి, ఏటిఎం మెషిన్ లోపల ఒక ప్రత్యేకమైన క్యాష్ క్యాసెట్ ఉంటుంది.
ఏటిఎంలో ఏఏ కరెన్సీ నోట్లు ఉంటాయి..?
కరెన్సీ నోట్లన్నీ రూ.500 విలువైనవి అయితే ఒక ఏటీఎంలో ఒకేసారి రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డబ్బు పెట్టొచ్చు. కానీ ఆచరణలో ఇలా జరగడం చాలా అరుదు. ఎందుకంటే ఏటిఎంలలో రూ.500 నోట్లతో పాటు రూ.100, రూ.200 లాంటి తక్కువ విలువ నోట్లను కూడా పెడతారు.
ఏటిఎంలో ఎంత డబ్బు పెట్టాలనేది ఎవరు నిర్ణయిస్తారు?
అంతేకాదు ఒక ఏటీఎంలో ఎంత డబ్బు నింపాలనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఆ ఏటిఎం ఉన్న ప్రదేశం, ప్రజల వినియోగం, అది నగరం లేదా గ్రామం అనే అంశాలు ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తాయి. సగటున ఒక ఏటిఎంలో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుంది.

