ATM: కార్డు లేకుండానే డబ్బులు తీసుకోవచ్చు.. దేశంలో కొత్త ఏటీఎమ్‌లు వచ్చేశాయ్
ఏటీఎమ్ నుంచి డబ్బులు తీసుకోవాలంటే ఏటీఎమ్ కార్డు ఉండాలని తెలిసిందే. అయితే దేశంలో కొత్త ఏటీఎమ్ సెంటర్లు వస్తున్నాయి. ఏటీఎమ్ కార్డుల అవసరం లేకుండానే డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉన్న ఈ సేవల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తొలి యూపీఐ ఆధారిత ఏటీఎమ్
భారత బ్యాంకింగ్ రంగంలో కొత్త అధ్యయానికి తెర తీసింది స్లైస్ అనే బ్యాంక్. బెంగళూరులోని కోరమంగళలో దేశంలో మొట్టమొదటి UPI ఆధారిత ATM బ్రాంచ్‌ను ప్రారంభించింది. డిజిటల్ లావాదేవీల్లో ఇదొక కొత్త ఒరవడి అని చెప్పాలి. సాంప్రదాయ బ్యాంకింగ్ సేవలకు యూపీఐని కలిపి మరింత సులభతర, సురక్షిత సేవలను అందిస్తున్నారు. దీంతో ఇకపై కార్డు అవసరం లేకుండా ATM నుంచి డబ్బులు తీసుకోవచ్చన్నమాట.
క్యూఆర్ కోడ్‌తో డబ్బులు విత్‌డ్రా, డిపాజిట్
ఈ ఏటీఎం ద్వారా నగదు తీసుకోవడం చాలా సులభం. ATM స్క్రీన్‌పై "UPI QR Cash" అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అవసరమైన మొత్తాన్ని ఎంటర్ చేసిన తర్వాత, యూపీఐ యాప్ (Google Pay, PhonePe, BHIM వంటి యాప్‌లు) ద్వారా స్క్రీన్‌పై కనిపించే QR కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత UPI పిన్ ఎంటర్ చేయగానే నగదు విత్‌డ్రా లేదా డిపాజిట్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఇతర బ్యాంకింగ్ సేవలు కూడా
స్లైస్ బ్యాంక్ ప్రారంభించిన ఈ కొత్త బ్రాంచ్‌లో ఇన్‌స్టాంట్ అకౌంట్ ఓపెనింగ్, నగదు డిపాజిట్, విత్‌డ్రా, బ్యాలెన్స్ చెక్ వంటి సేవలన్నీ యూపీఐ ఆధారంగా లభిస్తాయి. కస్టమర్ ఇంటరాక్షన్లన్నీ కియోస్క్ మోడల్ ద్వారా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇది పూర్తిగా డిజిటల్ మాదిరిగా పనిచేస్తూ సమయం, శ్రమను ఆదా చేస్తుంది.
యూపీఐ ఆధారిత క్రెడిట్ కార్డు
స్లైస్ బ్యాంక్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా UPI ఆధారిత క్రెడిట్ కార్డును కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘స్లైస్ సూపర్ కార్డ్’ పేరిట తీసుకొచ్చిన ఈ క్రెడిట్ కార్డుకు జాయినింగ్ ఫీజు లేదా వార్షిక రుసుము అవసరం లేదు. దీనితో QR స్కాన్ లేదా యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఈ కార్డుతో కొనుగోళ్లపై 3% వరకు క్యాష్‌బ్యాక్, అలాగే "Slice in 3" ఫీచర్ ద్వారా చెల్లింపులను ఎలాంటి వడ్డీ లేకుండా మూడుసార్లు చెల్లించే అవకాశం లభిస్తుంది.
600 జిల్లాల్లో సేవలను విస్తరించనున్న స్లైస్ బ్యాంక్
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, దేశవ్యాప్తంగా దానిని విస్తరించాలన్న యోచనలో ఉంది స్లైస్ బ్యాంక్. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని, మొత్తం 600 జిల్లాల్లో ఈ యూపీఐ ATM సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న దిశగా సంస్థ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.