- Home
- Feature
- ఫాలోవర్స్ దెబ్బ.. ఇన్ఫ్లూయెన్సర్ అబ్బా..! సోషల్ మీడియాలో ఎక్స్ట్రాలు చేశారో ఇదే గతి.. బీ కేర్ ఫుల్
ఫాలోవర్స్ దెబ్బ.. ఇన్ఫ్లూయెన్సర్ అబ్బా..! సోషల్ మీడియాలో ఎక్స్ట్రాలు చేశారో ఇదే గతి.. బీ కేర్ ఫుల్
సామాన్యులకు సైతం సెలబ్రిటీ స్టేటస్ తెచ్చిపెట్టే సోషల్ మీడియానే అతిచేస్తే అధ:పాతాళానికి తొక్కేస్తుంది. ఇందుకు ఉదాహరణ నిలిచే సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఓ ఇన్ఫ్లూయెన్సర్ కు దిమ్మతిరిగేలా చేశారు ఫాలోవర్స్. అసలేం జరిగిందంటే..

ఫాలోవర్స్ తో పెట్టుకోవద్దు..
సోషల్ మీడియా పుణ్యమా అని కొందరు సామాన్యులు సైతం సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. సామాన్యులు సైతం తమ వీడియోలు, వినూత్నమైన కంటెంట్తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఈ పాపులారిటీని కొందరు మంచి అవకాశంగా మార్చుకుని ఎదుగుతుంటే.. మరికొందరు మాత్రం దానిని అడ్డం పెట్టుకుని సులభంగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి అత్యాశే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ను చిక్కుల్లో పడేసింది. ఫాలోవర్లను పదేపదే డబ్బులు, బహుమతులు అడగడంతో చివరకు అతడికి ఊహించని పరిస్థితి ఎదురైంది… ఇళ్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే...
ఏమయ్యా వీరమణి... సోషల్ మీడియాలో ఇదేంపని
తమిళనాడులోని మధురై ప్రాంతానికి చెందిన వీరమణికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. విభిన్నమైన కంటెంట్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇతడికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు. సాధారణంగా ఇలాంటి గుర్తింపును ఉపయోగించుకుని బ్రాండ్ ప్రమోషన్లు, మంచి కంటెంట్, ఇతర చట్టబద్ధమైన మార్గాల ద్వారా ఆదాయం సంపాదించవచ్చు. కానీ ఫాలోవర్స్ పెరగడంతో వీరమణిలో దురాశ కూడా పెరిగింది... సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించాడు.
తనను సోషల్ మీడియాలో అనుసరిస్తున్న ఫాలోవర్స్ ను డబ్బులు పంపాలని కోరుతూ వీరమణి వీడియోలు చేయడం ప్రారంభించాడు. అతడి విజ్ఞప్తికి స్పందించిన కొందరు ఫాలోవర్లు పలుమార్లు ఆన్లైన్లో డబ్బులు కూడా పంపించారు. ఇలా డబ్బులు అందడంతో అతడికి మరింత ఆశ కలిగింది. కంటెంట్ ద్వారా ఆదాయం సంపాదించడానికి బదులుగా, ఫాలోవర్లను నేరుగా డబ్బులు అడగడంపైనే దృష్టి పెట్టాడు.
ఈ క్రమంలో పదేపదే డబ్బులు కోరడంతో అతడి తీరుపై కొందరు ఫాలోవర్లు అసహనానికి గురయ్యారు. సోషల్ మీడియాలో అభిమానులుగా ఉన్నవారు కూడా ప్రతిసారీ డబ్బులు ఇవ్వాలనే ఒత్తిడిని ఇష్టపడలేదు... అందుకే ఈసారి అతడికి బుద్దివచ్చేలా గట్టిగా జవాభిచ్చారు.
ఇన్ఫ్లూయెన్సర్ కు ఫాలోవర్స్ దెబ్బ
ప్రస్తుతం పండగల సీజన్ కొనసాగుతోంది... దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని వీరమణి ప్రయత్నించాడు. దసరా, దీపావళి సందర్భంగా తనకు స్వీట్లు పంపాలని ఫాలోవర్లను సోషల్ మీడియా ద్వారా కోరాడు. అయితే ఈసారి ఫాలోవర్స్ నుండి అతడికి ఊహించని రియాక్షన్ ఎదురైంది.
అతడు అడిగిన స్వీట్లతో సరిపెట్టకుండా కొందరు ఫాలోవర్లు వివిధ వస్తువులను పంపించడం ప్రారంభించారు. వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్లు, టీవీలు, ఫర్నిచర్తో పాటు ఇతర వస్తువులను అతడు ఇచ్చిన చిరునామాకు ఆర్డర్ చేస్తున్నారు. అయితే ఈ ఆర్డర్లలో అసలు ట్విస్ట్ ఉంది... అవన్నీ క్యాష్ ఆన్ డెలివరీ (Cash on Delivery) పద్ధతిలో బుక్ చేసినవే.
క్యాష్ ఆన్ డెలివరీ అంటే వస్తువులు ఇంటికి వచ్చినప్పుడు వాటి ధర చెల్లించి తీసుకోవాలి. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులను స్వీకరించే సమయంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో వరుసగా ఖరీదైన వస్తువులు రావడంతో వీరమణికి ఇబ్బందులు తప్పడంలేదు.
వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, టీవీ వంటి వస్తువులకు డబ్బులు చెల్లించి తీసుకోవడం అతడికి సాధ్యం కాకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఫాలోవర్ల నుంచి డబ్బులు అడగడం మొదలుపెట్టిన అతడికి, ఇప్పుడు వారి పేరుతో వస్తున్న ఆర్డర్లను ఎలా ఎదుర్కోవాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. చివరకు ఇంటిని విడిచి వెళ్లాల్సి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
''నేను ఇంట్లో లేను.. శ్మశానంలో ఉన్నాను''
వరుసగా వస్తున్న ఆర్డర్లతో ఇబ్బందులు ఎదుర్కొన్న వీరమణి మరో వీడియో ద్వారా ''ఇక చాలు... నాకు బహుమతులు వద్దు'' అంటూ ఫాలోవర్లను వేడుకున్నారు. తాను ఇంట్లో లేనని, శ్మశానంలో ఉన్నానని చెబుతూ ఇకనైనా ఆర్డర్లు పంపడం ఆపాలని కోరాడు. డబ్బులు, బహుమతులు అడిగినప్పుడు స్పందించిన ఫాలోవర్లే ఇలా ఆర్డర్లు పంపడంతో అతడు ఇబ్బందుల్లో పడ్డాడనే చర్చ జరుగుతోంది.
ఇన్ఫ్లూయెన్సర్లకు ఇదో గుణపాఠం
సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెరగడం అనేది ఒక అవకాశం మాత్రమే. ఆ గుర్తింపును నిలబెట్టుకోవాలంటే నాణ్యమైన కంటెంట్ అందించడం, ప్రేక్షకులతో గౌరవంగా వ్యవహరించడం ముఖ్యం. అభిమానుల ఆదరణను వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదేపదే ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తే, అదే ఆదరణ అసంతృప్తిగా మారే ప్రమాదం ఉంది. ఇదే వీరమణి విషయంలో జరిగింది.
వీరమణికి సంబంధించిన ఈ ఘటన సోషల్ మీడియా ద్వారా సులభంగా డబ్బులు సంపాదించాలనుకునేవారికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. ఆన్లైన్లో పాపులారిటీ వచ్చినంత మాత్రాన ఏది చేసినా ప్రేక్షకులు అంగీకరిస్తారని భావించకూడదు. విశ్వసనీయత, బాధ్యతాయుతమైన ప్రవర్తనే సోషల్ మీడియాలో దీర్ఘకాలిక గుర్తింపునకు పునాది.

