మరణం తర్వాత మనిషి శరీరంలో ఏం జరుగుతుంది? మొదట మారేది ఇదే..
Death: మనిషి చనిపోయిన వెంటనే శరీరంలోని అన్ని ప్రక్రియలు ఒక్కసారిగా ఆగిపోవు. గుండె కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడం ఆగిన తర్వాత కూడా శరీరంలో కొన్ని జీవ, రసాయన మార్పులు కొంతకాలం కొనసాగుతాయి. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

మొదట కండరాలు వదులుగా మారతాయి
మరణం జరిగిన వెంటనే శరీరంలోని కండరాలు తమ బిగుతును కోల్పోతాయి. దీంతో దవడ కొద్దిగా తెరుచుకోవచ్చు. కనురెప్పలు వదులుగా మారవచ్చు. చేతులు, కాళ్లలోని కీళ్లు కూడా కొంత సులభంగా కదిలే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మరణం తర్వాత కనిపించే తొలి మార్పుల్లో కండరాలు సడలిపోవడం ఒకటి.
చర్మం రంగు మారి.. శరీరం చల్లబడుతుంది
మరణం జరిగిన సుమారు 15 నుంచి 20 నిమిషాల తర్వాత చర్మం రంగు క్రమంగా వెలిసినట్లు కనిపించవచ్చు. గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో రక్త ప్రసరణ కూడా ఆగిపోతుంది. దీంతో చర్మంలోని చిన్న రక్తనాళాల్లో రక్త ప్రవాహం నిలిచిపోతుంది. ఆ తర్వాత శరీర ఉష్ణోగ్రత కూడా క్రమంగా తగ్గుతుంది. దీనినే ‘అల్గోర్ మార్టిస్’ అంటారు. సాధారణ పరిస్థితుల్లో శరీర ఉష్ణోగ్రత గంటకు సుమారు 0.84 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గవచ్చు. అయితే బయట ఉష్ణోగ్రత, దుస్తులు, శరీర పరిస్థితి వంటి అంశాలపై ఈ వేగం మారుతుంది.
కొన్ని గంటల తర్వాత రక్తం కిందికి చేరుతుంది
మరణం తర్వాత గుండె రక్తాన్ని శరీరమంతా పంపించదు. దీంతో గురుత్వాకర్షణ కారణంగా రక్తం శరీరంలోని దిగువ భాగాల్లో క్రమంగా చేరుతుంది. సాధారణంగా మరణం జరిగిన 3 నుంచి 4 గంటల తర్వాత ఈ మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. దీనిని ‘లివర్ మార్టిస్’ అంటారు. దీంతో శరీరంలోని కింది భాగాల్లో చర్మం నీలం లేదా ఊదా రంగులో కనిపించవచ్చు.
కండరాలు బిగుసుకుని శరీరం గట్టిపడుతుంది
మరణం తర్వాత కొన్ని గంటలకు మరో ముఖ్యమైన మార్పు మొదలవుతుంది. శరీర కణాల్లో ఉండే శక్తి పదార్థం (ATP) తగ్గిపోవడం, రసాయన మార్పులు జరగడం వల్ల కండరాలు క్రమంగా గట్టిపడతాయి. దీనిని ‘రిగర్ మార్టిస్’ అంటారు. సాధారణంగా ఇది మరణం జరిగిన 3 నుంచి 4 గంటల తర్వాత ప్రారంభమై, సుమారు 12 నుంచి 24 గంటల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆ తర్వాత క్రమంగా కండరాలు మళ్లీ వదులుగా మారడం ప్రారంభిస్తాయి.
రోజులు గడిచే కొద్దీ శరీరంలో కుళ్లిపోయే ప్రక్రియ
మరణం తర్వాత చర్మం క్రమంగా తేమను కోల్పోయి ముడుచుకుంటుంది. ఈ కారణంగా జుట్టు, గోళ్లు కొంచెం పొడవుగా పెరిగినట్లు కనిపించవచ్చు. కానీ అవి నిజంగా పెరగడం కాదు.. చర్మం వెనక్కి లాగుకోవడం వల్ల అలా కనిపిస్తుంది. సాధారణంగా 24 నుంచి 72 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం గడిచిన తర్వాత శరీరంలో సహజంగా ఉండే బ్యాక్టీరియా కణజాలాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తాయి. ఈ ప్రక్రియలో వాయువులు ఏర్పడి శరీరంలో వాపు రావచ్చు. ఆ తర్వాత క్రమంగా శరీరం కుళ్లిపోయే సహజ ప్రక్రియ కొనసాగుతుంది.

