- Home
- Feature
- Cyclone Arnab : గంటకు 140 కి.మీ వేగంతో గాలులు వీస్తే ఏం జరుగుతుంది? మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు?
Cyclone Arnab : గంటకు 140 కి.మీ వేగంతో గాలులు వీస్తే ఏం జరుగుతుంది? మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు?
గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే ఎలాంటి నష్టం జరుగుతుంది? అర్నబ్ తుపాను సమయంలో మీరు అస్సలు చేయకూడని 7 తప్పులు, ప్రాణాలు కాపాడే ముందస్తు జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకోండి.

సైక్లోన్ సమయంలో ఈ జాగ్రత్తలు పాటించండి
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను తీవ్రరూపం దాల్చి ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపు దూసుకువస్తోంది. ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అతితీవ్ర తుపానుగా బలపడి గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నంకకు 260 కి.మీ, కాకినాడకు 300 కి.మీ, మచిలీపట్నంకు 390 కి.మీ, బాపట్లకు 460 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు మొదలయ్యాయి.
అయితే అర్నబ్ తుపాను సముద్రంలో ఉండగానే పరిస్థితి ఇలా ఉంటే తీరందాటితే ఇంకెలా ఉంటుందో... ఇదే ఆందోళన ప్రజల్లో ఉంది. అక్టోబర్ 28 (బుధవారం) అంటే రేపు ఉదయానికి ఈ తుపాను విశాఖపట్నం-బాపట్ల మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని... ఈ సమయంలో గంటకు 125-140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఇలా ప్రచండవేగంతో గాలులు వీస్తే చెట్లు, హోర్డింగ్స్, ప్లెక్సీలు నేలకూలడం నుంచి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం వరకు చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఈ సమయంలో ప్రజలు ఎలా సురక్షితంగా ఉండాలి, వేటికి దూరంగా ఉండాలి అనేది కచ్చితంగా తెలుసుకోవాలి.
ఈదురుగాలులు వీస్తే ఏం జరుగుతుంది?
అర్నబ్ తుపాను సమయంలో గాలుల వేగం పెరిగేకొద్దీ ప్రమాద తీవ్రత పెరుగుతుంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు అంటే మామూలు విషయం కాదు... బలహీనమైన చెట్లను కాదు పెద్దపెద్ద వృక్షాలను సైతం నేలకూల్చగల శక్తి ఈ గాలులకు ఉంటుంది. గాలులు వేగానికి చెట్ల కొమ్మలు సైతం విరిగిపడతాయి. ఇక కరెంటు స్తంభాలు, హోర్డింగ్‌లు, ప్లెక్సీలు తాత్కాలిక నిర్మాణాలు దెబ్బతింటాయి... దీంతో ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉంటాయి.
బలమైన ఈదురుగాలులకు రేకులు, పెంకుల ఇళ్లు దెబ్బతినే అవకాశాలుంటాయి... ఇక పూరిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయే ప్రమాదం ఉంది. ఇలా గాలిలో ఎగిరొచ్చే వస్తువుల వల్ల మనుషులకు గాయాలు కావచ్చు... రేకుల వల్ల ఎక్కువగా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
విశాఖపట్నంతో పాటు ఇతర ఉత్తరాంధ్ర పట్టణాలపై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని APSDMA హెచ్చరిస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షాల వల్ల రోడ్లపై చెట్లు కూలడం, కొమ్మలు విరిగిపడటంతో వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తవచ్చు. కాలువల్లో చెత్త చేరడంతో వరదనీరు ఇళ్లలోకి చేరవచ్చు.
కరెంటు తీగలు తెగిపడటం వల్ల విద్యుత్ సరఫరా ఆగిపోవడమే కాకుండా, షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి విద్యుత్ తో జాగ్రత్తగా ఉండాలి.
తీర ప్రాంతాల్లో తుపానుతో పాటు భారీ వర్షం, సముద్రం అల్లకల్లోలంగా మారితే లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చే ముప్పు పెరుగుతుంది. ఇళ్లలోకి కూడా నీరు చేరే అవకాశం ఉంటుంది.
అయితే అసలు నష్టం కేవలం గాలి వేగం మీదే కాకుండా అది ఎంతసేపు వీస్తుంది, వర్షం తీవ్రత, భవనాల దృఢత్వం, చుట్టుపక్కల వాతావరణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి గాలుల వేగం ఎక్కువగా ఉంటే దృఢంగా ఉండే నివాసాల్లో తలదాచుకోవాలి... అత్యవసరం అయితే అందులోంచి బయటకు రావాలి.
ఈదురుగాలుల వేళ సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి?
1. అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లకండి : అర్నబ్ తుపాను హెచ్చరికలు నేపథ్యంలో రెండుమూడు రోజులు ప్రయాణాలు మానుకోండి. ముఖ్యంగా గాలుల వేగం ఎక్కువగా ఉన్నప్పుడు టూవీలర్ల మీద వెళ్లడం, నడవడం చాలా ప్రమాదకరం. అత్యవసరం అయితే ఫోర్ వీలర్ లో ప్రయాణించండి... అందుబాటులో ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం ఉత్తమం.
2. చెట్లు, కరెంటు స్తంభాలకు దూరంగా ఉండండి : ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో చెట్లు, స్తంభాలు, హోర్డింగ్‌లు, నిర్మాణ పనులు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండండి. చెట్ల కింద వాహనాలు పార్క్ చేయకండి.
3. కిటికీలు, అద్దాల తలుపుల దగ్గర ఉండకండి : బలమైన గాలులకు వస్తువులు ఎగిరి వచ్చి అద్దాలను పగలగొట్టొచ్చు. ఇంట్లో కిటికీలకు దూరంగా, బలమైన గోడలు ఉన్న సురక్షితమైన గదిలో ఉండండి. తలుపులు, కిటికీలకు అడ్డంగా ఏవైనా దృఢమైన వస్తువులు పెట్టండి.
4. తెగిపడిన కరెంటు తీగలను ముట్టుకోకండి : నేల మీద పడిన తీగల్లో కరెంటు ఉండొచ్చు. వాటిని ముట్టుకోవడం, దగ్గరికి వెళ్లడం చేయకండి. వెంటనే విద్యుత్ శాఖకు లేదా ఎమర్జెన్సీ టీమ్‌కు సమాచారం ఇవ్వండి.
5. వరద నీటిలో నడవకండి, డ్రైవింగ్ చేయకండి : వరద నీటి లోతు, లోపల ఉన్న గుంతలు, కరెంటు ప్రమాదాలను మనం అంచనా వేయలేం. నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే వాహనంతో దాటే ప్రయత్నం చేయకండి.
6. బీచ్‌లు, జలాశయాల దగ్గరికి వెళ్లకండి : తుపాను సమయంలో సముద్రపు అలలు అకస్మాత్తుగా ఎగసిపడతాయి. వరదనీటితో నదులు, జలాశయాలు, వాగులువంకలు ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి బీచ్‌లు, నదులు, సరస్సులు, డ్యామ్‌ల దగ్గరికి వెళ్లడం మానుకోండి.
7. అధికారుల సూచనలను నిర్లక్ష్యం చేయకండి : వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు చెబితే, వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లండి. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వండి.
తుపానును ఎదుర్కొనేందుకు ముందుగానే ఇలా సిద్దంకండి...
తుపాను తీరం దాటకముందే తాగునీరు, డ్రై ఫ్రూట్స్, మందులు, టార్చ్ లైట్, బ్యాటరీలు, ఫస్ట్ ఎయిడ్ కిట్, మొబైల్ పవర్ బ్యాంక్, ముఖ్యమైన డాక్యుమెంట్లను వాటర్ ప్రూఫ్ బ్యాగ్‌లో సిద్ధంగా ఉంచుకోవాలి. అవసరం వచ్చినప్పుడు వీటిని ఈజీగా తీసుకునేలా, ఇంట్లోకి వరదనీరు వస్తే వెంట తీసుకెళ్లేలా రెడీగా ఉంచుకోవాలి.
ఇంటి చుట్టూ వదులుగా ఉన్న వస్తువులు, పూల కుండీలు, బయట ఉండే సామాన్లను భద్రపరుచుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులను కాపాడుకోవాలి. అత్యవసర పరిస్థితులకు కావాల్సిన వస్తువులన్నీ ఒకే చోట పెట్టుకోవాలి.
తీర ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్లాన్ తెలుసుకోవడం ముఖ్యం. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు కావాల్సిన సహాయాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి.
ఇంట్లో సురక్షితంగా ఉన్నప్పుడు తలుపులు, కిటికీలు గట్టిగా వేసేయాలి. గాలి నేరుగా తగలని చోట ఉండాలి. కరెంటు పోతే కొవ్వొత్తులు, టార్చ్ లైట్ వాడండి.
తుపాను తీరాన్ని తాకేముందు గాలి వేగం తాత్కాలికంగా తగ్గుతుంది. అప్పుడు తుపాను పూర్తిగా వెళ్లిపోయిందని పొరబడి బయటకు వెళ్లకండి. మళ్లీ బలమైన గాలులు వీచే ప్రమాదం ఉంటుంది.
గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి తుపాను హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా, ముందుగానే సిద్ధంగా ఉండటం, ప్రమాదకరమైన పనులు చేయకపోవడం వల్ల ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చు.
అత్యవసర పరిస్థితుల్లో భారతదేశపు ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 112 కు కాల్ చేయండి. లేదంటే APSDMA టోల్ ఫ్రీ నంబర్లు 1070 లేదా 1800 425 0101 కాల్ చేసి సహాయం పొందండి, మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 కి మెసేజ్ చేసి కూడా సహాయం పొందవచ్చు.
అర్నబ్ తుపానుపై సోషల్ మీడియా, ఇతర మాద్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. అధికారిక వాతావరణ అప్‌డేట్స్, స్థానిక అధికారుల సూచనలు పాటించడమే సురక్షితమైన మార్గం.

