- Home
- Feature
- ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది పాటు గుడికి వెళ్లకూడదా? శాస్త్రాలు ఏం చెపుతున్నాయి? గరికపాటి నరసింహారావు విశ్లేషణ
ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది పాటు గుడికి వెళ్లకూడదా? శాస్త్రాలు ఏం చెపుతున్నాయి? గరికపాటి నరసింహారావు విశ్లేషణ
ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాదిపాటు అంటు ఉంటుందా? గుడికి వెళ్లకూడదా.. పూజలు చేయకూడదా? ఏడాదిపాటు నియమం పాటించాల్సిందేనా? అసలు ఇందులో నిజం ఎంత? గరికపాటి నరసింహారావు చెప్పిన నిజాలేంటి?
ఆచారాలతో పాటు కొన్ని మూఢనమ్మకాలు..
మన సమాజంలో ఎన్నో రకాల ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. అయితే కాలక్రమేణా వాటికి కొన్ని మూఢనమ్మకాలు కూడా తోడవుతుంటాయి. ముఖ్యంగా హిందూ ధర్మంలో ఇంట్లో ఎవరైనా మరణిస్తే పాటించే పద్ధతుల విషయంలో చాలామందిలో కొన్ని పొరబడిన అభిప్రాయాలు ఉన్నాయి. ఇంట ఎవరైనా చనిపోతే ఏడాది పాటు గుడికి వెళ్లకూడదనే నియమం పెద్దలు చెపుతుంటారు. కానీ ఈ విషయంపై రీసెంట్ గా చాలాచోట్ల చర్చ జరుగుతోంది. దీనిపై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త శ్రీ గరికపాటి నరసింహారావు తన ప్రవచనం ద్వారా స్పష్టమైన , శాస్త్రబద్ధమైన అవగాహన కల్పించారు.
శాస్త్రాలలో ఎక్కడా లేదు
ఇంట్లో పెద్దవారొ ఎవరో మరణిస్తే కుటుంబ సభ్యులు ఏడాది పాటు గుళ్లకు వెళ్లకూడదని, ఎలాంటి పూజలు, యజ్ఞ యాగాలు చేయకూడదని చాలామంది భావిస్తుంటారు. అసలు ఈ నిబంధనలు ఏ శాస్త్రంలోనూ చెప్పలేదని గరికపాటి స్పష్టం చేశారు. ఎవరో ఒకరు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి కాలం చెల్లిన ఆచారాలను పాటించడం వల్ల అనవసరమైన మానసిక వేదన కలుగుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. హిందూ సనాతన ధర్మం ఎప్పుడూ మానసిక ప్రశాంతతను, దైవచింతనను ప్రోత్సహిస్తుంది కానీ, ఇలాంటి నిరుత్సాహకరమైన నిబంధనలను ఎక్కడా సూచించలేదు.
మరణం తర్వాత ఎంత కాలం గుడికి వెళ్లకూడదు?
సాధారణంగా మరణం సంభవించినప్పుడు ఆ ఇంటికి సంబంధించి పన్నెండు రోజుల పాటు కొన్ని కార్యక్రమాలు, నియమాలు ఉంటాయి. ఆ పన్నెండు రోజులు పూర్తి కాగానే పదమూడో రోజు నుంచి కుటుంబ సభ్యులు యథావిధిగా తమ రోజువారీ కార్యక్రమాలను, అన్ని రకాల యజ్ఞ యాగాధులను, పూజలను చేసుకోవచ్చని గరికపాటి వివరించారు. కేవలం పన్నెండు రోజులు మాత్రమే ఆ సూతకం లేదా నియమం వర్తిస్తుందే తప్ప, దాన్ని ఏడాది పాటు పొడిగించడం కేవలం ఒక అపోహ మాత్రమే అని అన్నారు.
మనోైస్థెర్యం కోసమే దైవదర్శనం
ఇంట మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబానికి తీవ్రమైన మానసిక బాధ, ఒంటరితనం కలుగుతాయి. సరిగ్గా అదే సమయంలో దైవ దర్శనం - గుడికి వెళ్లడం వల్ల మనస్సుకు ఎంతో కొంత ప్రశాంతత లభిస్తుంది. అయితే "సంవత్సరం పాటు గుడికి వెళ్లకూడదు" అనే నియమం పెట్టుకోవడం వల్ల, వారం వారం గుడికి వెళ్లే అలవాటు ఉన్నవారు తీవ్ర మనోవేదనకు గురవుతారు. ఆ తర్వాత కాలంలో వేరే మతాల వారు లేదా ఇతర వ్యక్తులు వచ్చి వారిని మతం మార్చుకోవాలని ప్రేరేపించే ప్రమాదం ఉందని, హిందువులలో వ్యాపిస్తున్న ఇటువంటి పిచ్చి నమ్మకాల వల్ల ఇతర మతాలకు మేలు జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తండ్రి పోయాడని దూరంగా ఉండాలా?
తండ్రి లేదా కుటుంబ సభ్యులు మరణిస్తే ఏడాది పాటు గుడికి వెళ్లకూడదనే నిబంధన సరికాదన్నారు. కానీ కొందరు అనారోగ్యంతోనో లేదా వయసురీత్యా గుడికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉండవచ్చు. అలాంటి వారు మానసికంగా బాధపడుతూ ఉంటారు.
ఈ దశలో ఎవరో వచ్చి తప్పుదారి పట్టించే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మన సంప్రదాయాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇతరులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మడం వల్ల మన ధర్మంపై అనవసరమైన భయాలు పెరుగుతాయి.
మతం మారడం లేదా సంప్రదాయాలను వదిలేయడం అంటే కేవలం పూజలు ఆపడం కాదు, అసలు విషయాలు తెలియకపోవడమే. మనకు తెలియని విషయాలను పెద్దలను, శాస్త్రాలను అనుసరించి తెలుసుకోవాలి. కాబట్టి ఇంట మరణం సంభవించిన వారు పన్నెండు రోజులు మాత్రమే నియమం పాటించి, పదమూడో రోజు నుండి హాయిగా గుళ్లకు వెళ్లవచ్చని గరికపాటి స్పష్టం చేశారు.
