Lemon Price in USA : అమెరికాలో ఒక్క నిమ్మకాయ రేటు ఎంతుంటుందో తెలుసా?
ఇండియాలో ఒక్క నిమ్మకాయ రూ.5 లోపే లభిస్తుంది.. మహా అయితే రూ.10 ఉంటుంది. అదే అమెరికాలో నిమ్మకాయ ధర ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు నిమ్మకాయల ధర ఇండియాలోనూ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యూఎస్ లో ఎంతుందో తెలుసుకుందాం.

అమెరికాలో నిమ్మకాయ రేటు ఎంత?
అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా వస్తువు ధరను పోల్చాలంటే ముఖ్యంగా అమెరికా ధరలతో పోలుస్తాం. ఇటీవలకాలంలో ఈ పోలీక మరింత పెరిగింది. యూఎస్ లో ఉండే ఇండియన్స్ అక్కడి వస్తువులు, వాటి ధరల గురించి యూట్యూబ్ లో వీడియోలు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పోస్టులు పెడుతుంటారు… దీంతో అక్కడి ధరలు, ఇక్కడి ధరలను మనోళ్లు పోలుస్తుంటారు. మరీముఖ్యంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు అమెరికాలో ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే కుతాహలం ఎక్కువగా ఉంటుంది.
అమెరికా కేవలం టెక్నాలజీ దేశమే కాదు పెద్దఎత్తును వ్యవసాయం సాగించే దేశం. ఇక్కడి రైతులు వేల ఎకరాల భూమిని సాగుచేస్తుంటారు… భారీగా ఆహార ఉత్పత్తులను పండిస్తుంటారు. అయితే ఇతర దేశస్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆయా దేశాలకు చెందిన కూరగాయలు, ఇతర వస్తువులను అమ్ముతుంటాారు. మరి భారతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిమ్మకాయ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఒక్క నిమ్మకాయ రూ.60-70 ఉంటుందా?
ఇండియన్స్ కి నిమ్మకాయలతో విడదీయరాని బంధం ఉంటుంది… చాలా వంటల్లో వీటిని ఉపయోగిస్తుంటారు. అందుకే చాలామంది దేశాన్ని వీడినా నిమ్మకాయతో అనుబంధాన్ని వీడలేకపోతున్నారు. అమెరికాలో ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు… కాబట్టి ఇక్కడ నిమ్మకాయలకు మంచి గిరాకీ ఉంటుంది.
అయితే అమెరికాలో ఒక్క నిమ్మకాయ ధర ఎంతుంటుంది? అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. దీనికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సమాధానం ఇచ్చింది. ఆ వీడియో ప్రకారం… అమెరికాలో ఒక్క నిమ్మకాయ కొంటే మన కరెన్సీలో సుమారు రూ.60 నుంచి రూ.70 వరకు ఖర్చు అవుతుంది. ఒక్క నిమ్మకాయకే ఇంత రేటా..! అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
యూఎస్ లో కిలో నిమ్మకాయల ధర ఎంత?
రితు నరూక అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆమె అమెరికా సూపర్ మార్కెట్లో నిమ్మకాయల ధరను చూపించారు. మన దేశంలో దొరికే రేటుతో పోలిస్తే, అక్కడ ఒక్క నిమ్మకాయ కొనడానికి అయ్యే ఖర్చు చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.
కిలో నిమ్మకాయలు రూ.500 దాటుతుందా?
రితు చెప్పిన వివరాల ప్రకారం… ఒక్క నిమ్మకాయకు రూ.60 నుంచి రూ.70 వరకు ఖర్చు అవుతుంది. దీన్ని బట్టి చూస్తే అక్కడ కిలో నిమ్మకాయలు కొనాలంటే రూ.500 కంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఇది కేవలం ఆ వీడియో ఆధారంగా వేసిన అంచనా మాత్రమే. అమెరికాలోని అన్ని నగరాలు, దుకాణాల్లో ఇదే రేటు ఉంటుందని కచ్చితంగా చెప్పలేం.
యూకేలో నిమ్మకాయల ధర ఎంతంటే?
భారతీయ వంటకాల్లో నిమ్మకాయల వినియోగం ఎక్కువ. నిమ్మరసం, పచ్చళ్లు, చట్నీలు, కూరల్లో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే యూకేలో భారతీయ వంటకాలకు అవసరమైన కొన్ని కూరగాయలను కొనుగోలు చేయడం ఖరీదైన వ్యవహారం... ఇందులో నిమ్మ కూడా ఒకటి.
యూకేలో కిలో నిమ్మకాయల ధర సుమారు రూ.800... దీన్ని బట్టి ఒక్క నిమ్మకాయ దాదాపు 70-80 రూపాయలు ఉంటుందన్నమాట. అయితే ఇవి ప్రత్యేక దుకాణాల్లోని ధరల వివరాలు మాత్రమే. సాధారణ సూపర్మార్కెట్లలో లభించే నిమ్మకాయలు, మిరపకాయల రకం, ప్యాకింగ్, విక్రయించే పరిమాణం ఆధారంగా ధరలు మారవచ్చు.
విదేశాల్లో పండ్ల ధరలపై ఆసక్తి
అమెరికా, యూకేలో పండ్లు, ఆహార పదార్థాల ధరలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి భారతీయుల్లో ఎప్పుడూ ఉంటుంది. తాజాగా వైరల్ అయిన ఈ నిమ్మకాయ వీడియో ఆ ఆసక్తిని మరింత పెంచింది. అయితే ఒక వస్తువు ధరను బట్టి దేశం మొత్తంలో పండ్ల ధరలను అంచనా వేయలేం. ప్రాంతం, దుకాణాన్ని బట్టి రేట్లు మారుతుంటాయి. కాబట్టి, దీన్ని కేవలం ఒక ఇన్ఫ్లుయెన్సర్ పంచుకున్న సమాచారంగానే చూడాలి.





