Labubu Doll: ఈ బొమ్మ మనుషులతో మాట్లాడుతుందా.? భయపెడుతోన్న వార్తలు
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక అంశం ట్రెండ్ అవుతుంది. తాజాగా లబుబు డాల్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటీ బొమ్మ.? దీని వెనకాల ఉన్న అసలు కథ ఏంటి.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

లబుబు బొమ్మ ట్రెండ్ ఎలా మొదలైంది?
లబుబు బొమ్మ హాంకాంగ్‌కు చెందిన ప్రసిద్ధ టాయ్ ఆర్టిస్ట్ కాసింగ్ లంగ్ డిజైన్ చేశారు. దీన్ని పాప్ మార్ట్ అనే బ్రాండ్ రూపొందించింది. ఇది "The Monsters" అనే సిరీస్‌లో భాగంగా 2019లో విడుదలైంది. ఈ బొమ్మ 'గోతిక్-క్యూట్' అనే విభిన్న శైలిలో తయారు చేశారు. దీనిలో అమాయకత్వం, భయంకరత్వం రెండూ కలిసినట్లు కనిపిస్తుంది.
చిన్న చిన్న చిల్లులతో, నీలం రంగు కన్నులతో ఉండే బొమ్మ..ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో హాట్ ట్రెండింగ్‌గా మారింది. ఇక ఈ బొమ్మ ధర విషయానికొస్తే ఈ కామర్స్ సైట్స్‌లో రూ. 500 నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని వేలం పాటల్లో ఈ బొమ్మ కోట్లలో అమ్మడైన సందర్భాలు కూడా ఉన్నాయి.
సెలెబ్రిటీలు కూడా దీన్ని ఫాలో అవుతున్నారు
ఈ బొమ్మ సాధారణ ప్రజలకు మాత్రమే కాకుండా పలువురు ప్రముఖులను కూడా ఆకర్షించింది. ఇండియాకు చెందిన ప్రముఖ నటీమణులు ఉర్వశి రౌతేలా, కరీనా కపూర్, అనన్య పాండే, రిహాన్నా, శర్వరి వాఘ్ లాంటి వారు లబుబు బొమ్మలను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేశారు.
చర్చనీయాంశంగా మారిన అర్చనా గౌతమ్ పోస్ట్
బిగ్ బాస్ 16 ఫేమ్ అర్చనా గౌతమ్ తాజాగా ఓ వీడియోలో ఈ బొమ్మ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. "నా బంధువు ఈ బొమ్మ కొనగానే ఆమె జీవితంలో అనేక అనర్థాలు జరిగాయి. మొదట ఆమె నిశ్చితార్థం రద్దయింది. తర్వాత రోజు ఆమె తండ్రి మరణించారు. లబుబు ఇంటికొచ్చినప్పటినుంచి అన్నీ తలకిందులవుతున్నాయి. ఈ బొమ్మని ఇంట్లో పెట్టుకుంటే దురదృష్టం వస్తుంది. దయచేసి దీన్ని కొనవద్దు" అని చెప్పుకొచ్చారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
ఇతరుల అనుభవాలు కూడా
అర్చనాతో పాటు, అనేక నెటిజన్లు లబుబు బొమ్మకు సంబంధించి భయాందోళన కలిగించే అనుభవాలను షేర్ చేస్తున్నారు. బొమ్మను ఎవరూ తాకకపోయినా తానే షెల్ఫ్ నుంచి పడిపోయిందని కొందరు, చిన్నపిల్లలు బొమ్మతో మాట్లాడారంటూ మరికొందరు, పెంపుడు జంతువులు బొమ్మ దగ్గర అసహజంగా ప్రవర్తించారని ఇంకొందరు, బొమ్మ ముఖ భావాలు రాత్రికి రాత్రే మారిపోయినట్టు కనిపించాయని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. మరికొందరైతే ఈ బొమ్మను “పజుజు” అనే హాలీవుడ్ హారర్ డెమన్‌తో పోలుస్తున్నారు. ఇటీవల ఈ బొమ్మలను తగలబెట్టే వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
ఇందులో ఎంత నిజం ఉంది.?
అయితే ఈ బొమ్మకు సంబంధించి జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొందరు అంటున్నారు. దీనిని దుష్ట శక్తుల బొమ్మగా భావించడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. కొంతమంది అనవసరంగా భయపడుతున్నారని, దుష్ప్రచారాలను ఖండించాలని అంటున్నారు.
వివాదాలు ఎన్ని ఉన్నా.. బిలియన్ డాలర్ల విజయగాథ
వివాదం ఉన్నప్పటికీ, లబుబు ప్రజాదరణ పెరుగుతూనే ఉంది. ఈ బొమ్మ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మరీముఖ్యంగా జెన్ Z, మిలీనియల్ ఈ బొమ్మలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. 2025లో లబుబు బొమ్మలు దాదాపు $400 మిలియన్ల ఆదాయాన్ని ఆర్జించాయి. దీని కారణంగా పాప్ మార్ట్ వ్యవస్థాపకుడు వాంగ్ నింగ్ $22.7 బిలియన్ల నికర విలువతో చైనాలోని అతి పిన్న వయస్కులైన బిలియనీర్లలో ఒకరిగా మారారు.