- Home
- Entertainment
- హీరో గోపీచంద్ తండ్రి అంటే విజయశాంతికి ఎందుకు అంత అభిమానం.. ఆయన మరణించినప్పుడు షూటింగ్ ఆపేసి ఏం చేశారంటే
హీరో గోపీచంద్ తండ్రి అంటే విజయశాంతికి ఎందుకు అంత అభిమానం.. ఆయన మరణించినప్పుడు షూటింగ్ ఆపేసి ఏం చేశారంటే
విజయశాంతి తన కెరీర్ లో చాలామంది దర్శకులతో పనిచేశారు. కానీ ఆమెకి సూపర్ స్టార్ ఇమేజ్ రావడానికి కారణమైన దర్శకుడు ఒకరున్నారు. ఆయన గురించి విజయశాంతి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి
తెలుగు చిత్ర పరిశ్రమలో విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఒక దశలో ఆమె నటించిన చిత్రాలు స్టార్ హీరోలకు పోటీగా ఆడేవి. ఆమె రెమ్యూనరేషన్ కూడా స్టార్ హీరోల స్థాయిలో ఉండేది. కర్తవ్యం, ప్రతిఘటన, నేటి భారతం, ఒసేయ్ రాములమ్మ లాంటి చిత్రాలు విజయశాంతికి సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టాయి. విప్లవాత్మక చిత్రాలు, పోలీస్ పాత్రలతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయాలి అంటే దర్శకులకు విజయశాంతి ఫస్ట్ ఛాయిస్ గా ఉండేవారు.
విజయశాంతిని సూపర్ స్టార్ ని చేసింది ఆయనే
విజయశాంతి తన కెరీర్ లో చాలామంది దర్శకులతో పనిచేశారు. కానీ ఆమెకి సూపర్ స్టార్ ఇమేజ్ రావడానికి కారణమైన దర్శకుడు ఒకరున్నారు. ఆయన ఎవరో కాదు హీరో గోపీచంద్ తండ్రి టి కృష్ణ. ఆయన దర్శకుడిగా, నిర్మాతగా టాలీవుడ్ లో రాణించారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలలో ఎక్కువ భాగం విజయశాంతి నటించిన చిత్రాలే ఉంటాయి.
నా జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకుడు
వీరిద్దరి కాంబినేషన్ లో నేటి భారతం, వందేమాతరం, ప్రతిఘటన, రేపటి పౌరులు లాంటి చిత్రాలు రూపొందాయి. ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి టి కృష్ణ గురించి చెబుతూ.. టి కృష్ణ గారు నన్ను ఆప్యాయంగా శాంతమ్మ అని పిలుస్తారు. ప్రతిఘటన చిత్రం నా జీవితాన్ని మలుపు తిప్పింది. టి కృష్ణ గారు ఈ చిత్రం కోసం నన్ను అడిగినప్పుడు ఇతర చిత్రాలతో చాలా బిజీగా ఉన్నాను. డేట్లు కుదరడం లేదని చెప్పాను. ఆయన నువ్వు చేయకపోతే నేను ఈ చిత్రం చేయను అని భీష్మించుకుని కూర్చున్నారు.
దీంతో ఇతర నిర్మాతలను రిక్వెస్ట్ చేసి ప్రతిఘటన చిత్రానికి నెల రోజులు కాల్ షీట్లు ఇవ్వగలిగాను. ఆ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ మూవీ తోనే నాకు సూపర్ స్టార్ అనే బిరుదు మొదలైంది అని విజయశాంతి తెలిపారు. టి కృష్ణ గారు ఆరోజు పట్టు పట్టి ఉండకపోతే ప్రతిఘటన చిత్రాన్ని కోల్పోయేదాన్ని అని విజయశాంతి తెలిపారు.
విమర్శలకు సమాధానం ఇచ్చారు
ప్రతిఘటన సినిమా సమయంలో నేను చాలా చిన్నదాన్ని. టి కృష్ణ గారిని చాలామంది విమర్శించారు.. లేడీ ఓరియంటెడ్ చిత్రానికి అంత చిన్న అమ్మాయిని తీసుకున్నాడు ఏంటి.. ఈ కథకి ఆమె న్యాయం చేయలేదు అని చాలామంది కామెంట్స్ చేశారు. కానీ టి కృష్ణ గారు.. విజయశాంతి పై నాకు నమ్మకం ఉంది, ఈ చిత్రాన్ని ఎలా తీయాలో నాకు తెలుసు అని వాళ్లకు సమాధానం ఇచ్చారు. టి కృష్ణ గారు నా సినిమాలు విషయంలో చాలా కేర్ తీసుకునేవారు.
షూటింగ్ ఆపేసి రెండు ట్రైన్లు మారి వెళ్ళా..
రేపటి పౌరులు చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆ చిత్రం పూర్తయ్యాక కొంతకాలానికి ఆయన మరణించారు. ఆ టైంలో నేను ఊటీలో షూటింగ్ లో ఉన్నాను. టి కృష్ణ గారు మరణించారని తెలుసుకున్న వెంటనే మూవీ షూటింగ్ ఆపేసి ఆగమేఘాల మీద ట్రైన్ లో బయలుదేరాను. రెండు ట్రైన్లు మారి ఆయన అంత్యక్రియలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నాను. కానీ అప్పటికే అంత్యక్రియలు పూర్తయ్యాయి. మా తండ్రి మరణం తర్వాత అంతటి బాధ టి కృష్ణ గారు మరణించినప్పుడు తనకి కలిగిందని విజయశాంతి పేర్కొంది. ఆయన మరణించే సమయానికి గోపీచంద్ చిన్నపిల్లాడు అని విజయశాంతి తెలిపారు.
ఆయన నాకు ఒక అన్న, గురువు అని విజయశాంతి పేర్కొన్నారు. నాకు ఇంతటి పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణం ఆయనే. అలాంటి వ్యక్తి మరణిస్తే బాధ లేకుండా ఎలా ఉంటుంది అని విజయశాంతి తెలిపారు.