- Home
- Entertainment
- ఆ మూవీలో సైడ్ క్యారెక్టర్ కోసం 16 వేల మందితో పోటీ పడ్డ హీరో..అతడు ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ స్టార్
ఆ మూవీలో సైడ్ క్యారెక్టర్ కోసం 16 వేల మందితో పోటీ పడ్డ హీరో..అతడు ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ స్టార్
అంతగా ప్రాధాన్యత లేని పాత్ర కోసం ఓ హీరో 16 వేలమందితో పోటీ పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ హీరో టాలీవుడ్ లో యువతలో క్రేజీ స్టార్ గా గుర్తింపు పొందాడు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల నిర్మాత దిల్ రాజు ప్రాజెక్ట్ ‘డ్రీమ్స్ ఇన్ హైదరాబాద్’ ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ తన కెరీర్ బిగినింగ్ లో కొన్ని చిత్రాల్లో అంతగా ప్రాధాన్యత లేని చిత్రాల్లో నటించారు. ఈ సందర్భంగా ఆయన 2012లో విడుదలైన శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో అవకాశం ఎలా దక్కిందో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
విజయ్ దేవరకొండ 2011లో ‘నువ్విలా’ చిత్రంతో తెరంగేట్రం చేసినప్పటికీ, ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే యూత్ అండ్ ఫ్యామిలీ డ్రామా. ఆ సమయానికి సోషల్ మీడియాలో అవకాశాల గురించి తెలుసుకునే పరిస్థితి లేదు. అందుకే అప్పట్లో ఓ వెబ్‌సైట్‌ని నిత్యం చూస్తూ ఉండేవాడిని అంటూ విజయ్ తన ఆడిషన్ అనుభవాన్ని వివరిస్తూ భావోద్వేగంతో మాట్లాడారు.
శేఖర్ కమ్ముల ఆడిషన్ కాల్ చూసిన వెంటనే దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. “ ‘హ్యాపీ డేస్’ సినిమా రీలీజ్ అయినప్పుడు నేనింకా కాలేజీలో ఉన్నా. అప్పటివరకు నటనలోకి రావాలని అసలు అనుకోలేదు కూడా,” అని అన్నారు విజయ్.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రానికి ఎంపిక కావడం అంత సులభంగా జరగలేదని, దరఖాస్తు చేసిన దగ్గర నుంచి ఎంపిక అయ్యే వరకూ ఆరు నెలలు పట్టిందని చెప్పారు. “అందరూ కలిపి 16,000 మంది దరఖాస్తు చేశారు. అందులో నన్ను, నవీన్ పొలిశెట్టి లాంటి 12 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఆ చిన్న సినిమా మా జీవితాల్లో పెద్ద మార్పు తీసుకువచ్చింది,” అని తెలిపారు.
ఈ సందర్భంలో విజయ్ మాట్లాడుతూ, “ఆ సమయంలో నా జీవితానికి దిక్కు లేకపోయినా, ఆ ఆడిషన్ వల్ల నాకో దిశ ఏర్పడింది. అలా ప్రతి ఉదయం లేవడానికి ఓ కారణం ఉండేది. ఆ గడ్డు రోజులే నాకు ప్రేరణ ఇచ్చాయి,” అన్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో విజయ్ దేవరకొండ అంతగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించారు. కానీ ఆ తర్వాత అతడికి పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా ఛాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ ఫస్ట్ హిట్ అదే.
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో స్టార్‌డమ్‌కి ఎదిగారు. చివరగా ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘కాల్కి 2898 AD’ సినిమాల్లో నటించిన ఆయన, ఇప్పుడు ‘కింగ్‌డమ్’ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా దర్శకుడు రాహుల్ సంకృత్యాయన్ తో కొత్త ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నారు.