2025లో వీరే తోపు బ్యాటర్లు.. టీమిండియాలో తురుమ్ ఖాన్లు.. లిస్టులో ఎవరున్నారంటే.?
Indian Cricketers: 2025లో భారత క్రికెట్‌లో ఐదుగురు ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనలతో మెరిశారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నుంచి విరాట్ కోహ్లీ వరకు, శుభమాన్ గిల్, సిరాజ్, అభిషేక్ శర్మలు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి తమదైన ముద్ర వేశారు.

వీరికి ఈ ఏడాది అమోఘం..
2025వ సంవత్సరం భారత క్రికెట్ కు ఒక అద్భుతమైన సంవత్సరంగా నిలిచింది. ఈ ఏడాది కొందరు టీమిండియా క్రికెటర్లు తమ ఆటతీరుతో అభిమానులను ఎంతగానో అలరించారు. అద్భుతమైన ప్రదర్శనలతో రికార్డులు సృష్టించారు. మరి ఈ లిస్టులో ఉన్న ఆ ఐదు క్రికెటర్లు ఎవరంటే.? వైభవ్ సుర్యవంశీ, గిల్, విరాట్ కోహ్లీ, సిరాజ్, అభిషేక్ శర్మ ఉన్నారు.
వైభవ్ విధ్వంసం..
వైభవ్ సూర్యవంశీ 2025లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏడు మ్యాచుల్లో 36 సగటుతో 252 పరుగులు సాధించాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 61 బంతుల్లోనే 108 పరుగులు సాధించి, టోర్నీలో సెంచరీ కొట్టిన చిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అండర్ 19 ఆసియా కప్ లో యూఏఈ పై 95 బంతుల్లోనే 171 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ పై 84 బంతుల్లో 190 పరుగులతో సత్తా చాటాడు.
గిల్, కోహ్లీ సూపర్..
గిల్ కు 2025 టెస్టుల్లో కెప్టెన్ గా ప్రమోషన్ లభించింది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేశాడు. ఈ సిరీస్‌లో ఏకంగా 754 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. ఈ ఏడాది గిల్ 983 పరుగులు సాధించాడు. అటు విరాట్ కోహ్లీ 2025లో ఆస్ట్రేలియాతో 74 పరుగులు, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో 302 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. వన్డేల్లో ఈ ఏడాది భారత్ తరఫున అత్యధిక పరుగులు (13 మ్యాచుల్లో 651 పరుగులు) సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
సిరాజ్ పేస్ బౌలింగ్..
ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ తన పేస్ బౌలింగ్ తో హైలెట్ అయ్యాడు. ఇంగ్లాండ్ ను 2-2తో కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో సిరాజ్ 23 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ తో సిరీస్‌లో రెండుసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 2025లో మొత్తంగా సిరాజ్ 43 వికెట్లు సాధించి, భారత్ తరఫున ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు.
అభిషేక్ విశ్వరూపం..
2025లో టీ20ల్లో అభిషేక్ శర్మ తనదైన ముద్ర వేశాడు. ఎక్స్ ప్లోజివ్ బ్యాటర్ గా అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇంగ్లాండ్ తో సిరీస్‌లో 135 పరుగుల రికార్డ్ బ్రేకింగ్ స్కోర్ తో అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో సిరీస్‌ల్లోనూ రాణించాడు. అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరఫున ఈసారి ఎక్కువ పరుగులు(21 మ్యాచుల్లో 859 పరుగులు) సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

