- Home
- Entertainment
- Megastar: చిరంజీవిపై వశీకరణ ప్రయోగం, మెగాస్టాను సొంతం చేసుకోవాలని విషప్రయోగం చేసింది ఎవరు?
Megastar: చిరంజీవిపై వశీకరణ ప్రయోగం, మెగాస్టాను సొంతం చేసుకోవాలని విషప్రయోగం చేసింది ఎవరు?
Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై విషప్రయోగం జరిగిందని మీకు తెలుసా? ఆయన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని వశీకరణ ప్రయోగం చేశారట. ఈ విషయాలు ఎవరో కాదు స్వయంగా చిరంజీవే వెల్లడించారు. ఇంతకీ అసలు కథ ఏంటి?

మెగాస్టార్ చిరంజీవిపై విషప్రయోగం
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి, స్వయంకృషితో 'మెగాస్టార్'గా ఎదిగిన నటుడు చిరంజీవి. ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు, సవాళ్లు ఎదురయ్యాయి. కెరీర్ ను నిలబెట్టుకోవడం కోసం చిరు చాలా కష్టపడ్డారు. ఎంతో కృషి చేశారు. డ్యాన్స్, నటన, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఏదైనా సరే మెగాస్టార్ అద్భుతం చేసేవారు. అదే ఆయన్ను మెగాస్టార్ గా నిలబెట్టింది.
ఇలా మెగాస్టార్ ఎదుగుతున్న టైమ్ లోనే ఆయనపై విషప్రయోగం జరిగిందని మీకు తెలుసా? చాలా కాలం క్రితం జరిగిన ఈ ఘటన అప్పట్లో టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రకరకాల పుకార్లు, కథనాలు వైరల్ అవ్వగా, అసలు ఆ రోజు ఏం జరిగిందనే దానిపై మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
అసలు ఏం జరిగింది?
చిరంజీవి చెప్పినదాని ప్రకారం.. 1988వ సంవత్సరంలో చెన్నైలోని గిండి హార్స్ క్లబ్‌లో చిరంజీవి నటిస్తున్న 'మరణ మృదంగం' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ సమయంలో కొంత మంది అభిమానులు సెట్ లోకి దూసుకువచ్చారు.. అందులో ఒక అభిమాని తన పుట్టినరోజు సందర్భంగా చిరంజీవిని కలవడానికి షూటింగ్ స్పాట్‌కు వచ్చాడు. ఆయనతో కేక్ కట్ చేయించి, స్వయంగా కేక్ ముక్కను తినిపించేందుకు ప్రయత్నించాడు.
చిరంజీవి మొదట వద్దని నివారించేందుకు యత్నించినప్పటికీ, ఆ అభిమాని ప్రేమతో.. బలవంతంగా కేక్ ముక్కను ఆయన నోట్లో పెట్టాడు. అయితే, కేక్ నోట్లోకి వెళ్లగానే వింతైన చేదు రుచి రావడంతో చిరంజీవికి వెంటనే అనుమానం వచ్చి దానిని ఉమ్మివేశారు. కేక్‌లో ఏదో పౌడర్ కలిపినట్లు స్పష్టంగా కనిపించడంతో అక్కడే ఉన్న నిర్మాత కె.ఎస్. రామారావు, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు అప్రమత్తమయ్యారు.
పుకార్లు – ప్రచారం.. అసలు నిజం ఏంటి?
చిరంజీవి ఆ కేకు ఉమ్మడంతో.. ఏదో జరిగిందని వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేక్‌ను పరీక్షల నిమిత్తం పంపించగా, అందులో ఒక రకమైన పౌడర్ ఉన్నట్లు తేలింది. దీంతో "చిరంజీవిపై విషప్రయోగం జరిగింది" అని, ఆయన పెదవులు నీలంగా మారి ఆసుపత్రికి తరలించారంటూ అప్పట్లో వార్తాపత్రికలలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. దానికి రకరకాల కథనాలు అల్లి, ఎవరో కుట్రపన్ని చంపడానికి యత్నించారంటూ ప్రచారం చేశారు.
నిజం వెల్లడించిన చిరంజీవి
అయితే.. అసలు విషయం ఏంటీ అనేది చిరంజీవి ఓ ఇంటర్వ్యలో వెల్లడించారు. కేక్ తినిపించిన వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించారు.. ఆ విచారణలో అసలు విషయం బయటపడిందని చిరంజీవి వివరించారు. సదరు అభిమాని పోలీస్ విచారణలో స్పందిస్తూ — "చిరంజీవి గారు ఇటీవల నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. మా ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితోనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన దృష్టిని మళ్లీ నావైపు తిప్పుకోవడానికి, నన్ను ప్రేమగా చూసుకోవడానికి కేరళ నుంచి 'వశీకరణ పౌడర్' తీసుకువచ్చి కేక్‌లో కలిపాను" అని ఒప్పుకున్నాడు.
ప్రేమతో విషం పెట్టారు..
ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి గట్టిగా నవ్వారు. ఆయన స్పందిస్తూ: "అది నన్ను చంపడానికి చేసిన విషప్రయోగం కాదు. ఆ అభిమాని చేసిన పని అత్యంత మూర్ఖత్వమే తప్ప, ప్రాణాలు తీసే కుట్ర కాదు. అతనికి నాపై ఉన్న అమితమైన ఆరాధన, అవగాహన లేమి వల్లే అలా చేశాడు. కానీ సోషల్ మీడియా, ప్రచార సాధనాలు దానికి చిలవలు పలవలు జోడించి పెద్ద కుట్ర కథగా మార్చేశారు" అని తేల్చి చెప్పారు. ఈ విధంగా దశాబ్దాలుగా నలుగుతున్న 'విషప్రయోగం' మిస్టరీకి మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడంతో ఆ ప్రచారానికి తెరపడింది.

