- Home
- Entertainment
- Chirajeevi: కోకాపేటలో కోట్లు విలువ చేసే భూమి.. చిరంజీవి చెల్లెళ్లకు ఇస్తానంటే భార్య సురేఖ ఏమన్నారో తెలుసా?
Chirajeevi: కోకాపేటలో కోట్లు విలువ చేసే భూమి.. చిరంజీవి చెల్లెళ్లకు ఇస్తానంటే భార్య సురేఖ ఏమన్నారో తెలుసా?
Chirajeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆయన భార్య సురేఖ గురించి ఆశ్చర్యకరమైన విషయాలెన్నో బయటకు వస్తున్నాయి. ఆడపడుచుల గురించి, బ్రదర్స్ తో సురేఖ ఎలా ఉంటారు.. కోకాపేట భూముల విషయంలో చిరు షాకింగ్ విషయాలు వెల్లడించారు.

కోట్లమంది హృదయాలను గెలుచుకున్న మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి తన నటనతో, వ్యక్తిత్వంతో కోట్లమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. సినీ రంగంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ సంబంధాలకు ఎంతో విలువ ఇచ్చే చిరంజీవి, తన ఫ్యామిలీని కూడా ఇండస్ట్రీలో నిలబెట్టారు. ప్రస్తుతం టాలీవుడ్ పెద్దన్నగా.. ఇండస్ట్రీకి కావలసినవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏదైనా సమస్య వస్తే 'నేనున్నానంటూ' ముందు నిలబడుతున్నారు.
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మెగాస్టార్ సినిమాలు, వ్యాపారాలతో వేల కోట్ల ఆస్తులను సంపాదించారు. రీసెంట్‌గా ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ కోకాపేటలోని తన భూమి గురించి, తన కుటుంబ ఆస్తుల గురించి చేసిన కామెంట్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఆ వేదికపై తన సతిమణి సురేఖ గురించి, తన ఇద్దరు చెల్లెళ్ల గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ కోకాపేట భూముల గురించి చెప్పిన విషయాలు నెటిజన్లను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
కోకాపేటలో కోట్ల విలువైన భూములు..
చిరంజీవి చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం ఆయనకు కొన్ని ఎకరాల భూమి ఉండేది. "ఎప్పుడైనా ప్రశాంతంగా ఫామ్‌హౌస్ కట్టుకుని, వ్యవసాయం చేసుకుంటూ హ్యాపీగా లైఫ్‌ను గడుపుదాం" అనే ఆలోచనతో ఆ రోజుల్లో ఆ స్థలాన్ని కొనుగోలు చేశారట. అయితే కాలక్రమేణా ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెంది, ఒక్కో ఎకరం విలువ కొన్ని కోట్లకు పెరిగిపోయింది. ఇప్పుడు ఆ భూమి వందల కోట్ల విలువ చేస్తుంది. ఈ భూముల విషయంలో జరిగిన చర్చ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు చిరు.
చెల్లెళ్లను ఆదుకున్న చిరంజీవి..
చిరంజీవి మాట్లాడుతూ.. "నా ఇద్దరు చెల్లెళ్లకు ఇదివరకే ఇల్లు కట్టించి ఇచ్చాను. వారి పిల్లల భవిష్యత్తును కూడా దగ్గరుండి చూసుకున్నాను. ప్రస్తుతం వాళ్లందరూ కూడా సొంత కాళ్లపై నిలబడి, మంచి స్థాయిలో స్థిరపడ్డారు. ఇక వాళ్లకు నేను చేసేదేముంది అనే ఆలోచన నాలో ఉండేది. కానీ అదే టైమ్‌లో నా భార్య ఇచ్చిన సలహా ఆశ్చర్యాన్ని కలిగించింది" అని మెగాస్టార్ అన్నారు.
భార్య సురేఖ ఇచ్చిన ఊహించని సలహా
కోకాపేటలో అంతగా విలువ పెరిగిన ఆ భూమి విషయంలో చిరంజీవి భార్య సురేఖ స్పందించిన తీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. సాధారణంగా భూముల విలువ కోట్లలోకి పెరిగినప్పుడు ఎవరైనా తమ పిల్లలు, భర్త భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. కానీ సురేఖ మాత్రం చిరంజీవితో ఒక మాట అన్నారట. "ఈ భూమి విలువ బాగా పెరిగింది కదా.. మనం మీ చెల్లెళ్లకు (ఆడపడుచులకు) కూడా ఎంతోకొంత ఇస్తే బాగుంటుంది కదా" అని సలహా ఇచ్చారు. ఈ సలహా వినగానే చిరంజీవి ఎంతో సంతోషపడ్డారు. సహజంగా ఏ మహిళ అయినా తన కుటుంబం గురించే ముందు ఆలోచిస్తుందని, కానీ తన చెల్లెళ్ల పట్ల సురేఖ అంతటి ఆప్యాయత చూపించడం ఆయనను ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిరు ఎంతో ఆనందపడ్డారు.
రాఖీ పండుగ రోజు మెగా కానుక
సురేఖ ఇచ్చిన సలహాకు ఓకే చెప్పినప్పటికీ, చిరంజీవి ఆ తర్వాత తన సినిమాల పనిలో పడి ఆ విషయాన్ని మర్చిపోయారట. కానీ సురేఖ మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టలేదు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు నాడే రక్షాబంధన్ (రాఖీ) పండుగ కూడా వచ్చింది. ఆ పండుగకు కొద్ది రోజుల ముందే సురేఖ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. చిరంజీవి చెల్లెళ్లను ఇంటికి పిలిపించి, ఆ భూమికి సంబంధించిన పత్రాలను (Gifts) వారి చేతికి అందేలా చేశారు. తమ కుటుంబంలో ఆడపడుచుల పట్ల తన భార్య సురేఖ చూపించిన నిజాయితీ, చిత్తశుద్ధి, మంచితనం చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని మెగాస్టార్ చిరంజీవి ఆనందంగా వ్యక్తపరిచారు.
వదిన గురించి మెగా బ్రదర్స్ మాటల్లో..
మెగా కుటుంబంలో చిరంజీవి భార్య సురేఖకు ఎంతో గౌరవం ఉంది. అందరినీ సమానంగా చూస్తూ, ప్రేమగా చూసుకుంటారన్న పేరుంది. ఆడపడుచులను మాత్రమే కాదు, చిరంజీవి తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్‌లను కూడా సురేఖ కొడుకుల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్‌ను హీరోను చేయాలన్న ఆలోచన కూడా సురేఖే ఇచ్చారు. కన్నతల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటారో, పవన్ కళ్యాణ్ తన వదిన సురేఖను కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు. నాగబాబు కూడా చాలా ఇంటర్వ్యూలలో సురేఖ గురించి చాలా గొప్పగా మాట్లాడారు.

