సిరివెన్నెలకు అవార్డులు తెచ్చిపెట్టిన పాటలివే.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్.. వింటే మైమరచిపోవాల్సిందే
తన పాటతో సమాజంలోని అన్యాయాలను ప్రశ్నించాలని భావించే రైటర్ సిరివెన్నెల. అలాంటి అనేక అద్భుతమైన, వినసొంపైనా పాటలను సిరివెన్నెల రాశారు. వాటిలో నంది అవార్డులను అందుకున్న పాటలేంటో చూస్తే..
sirivennela seetharama sastry
sirivennela seetharama sastry
పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.. వేటూరి తర్వాత ఆ స్థాయి గుర్తింపుని, ఖ్యాతిని గడించిన పాటల రచయిత. పాటకి సమాజ శ్రేయస్సు ఉందని నమ్మిన వ్యక్తి. పాట నిద్ర పోతున్న సమాజాన్ని మేల్కొలిపేలా ఉండాలని భావించిన గొప్ప రైటర్ సిరివెన్నెల. తన పాటతో సమాజంలోని అన్యాయాలను ప్రశ్నించాలని భావించే రైటర్ సిరివెన్నెల. అలాంటి అనేక అద్భుతమైన, వినసొంపైనా పాటలను సిరివెన్నెల రాశారు. వాటిలో నంది అవార్డులను అందుకున్న పాటలేంటో చూస్తే..
తెలుగు సినీ గేయ కవుల్లో పదకొండు నంది అవార్డులను అందుకున్న రైటర్‌గా సిరివెన్నెల రికార్డ్ సృష్టించారు. ఆయన రాసి తొలి పాట `విధాత తలపున ప్రభవించినది.. `అనే పాటకి నంది అవార్డు వచ్చింది. సిల్వర్ స్క్రీన్‌పై సిరివెన్నెల రాసిన తొలి సాంగ్. ఇది `సిరివెన్నెల`(1986) చిత్రంలోనిది కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. కె మహదేవన్ సంగీతం అందించారు. ఎస్పీబాలు, సుశీల ఆలపించారు.
మరో ఏడాదిలోనే `శృతిలయలు` చిత్రంలోని `తెలవారదేమో స్వామీ` అనే పాటకి మరో నంది అవార్డు దక్కింది. దీనికి కూడా కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించగా కె మహదేవన్ సంగీతం అందించారు. ఏసుదాసు,సుశీల ఆలపించారు.
మూడో నంది అవార్డు తెచ్చిన సినిమా `స్వర్ణకమలం`. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1988లో విడుదలైంది. ఇందులో `అందెల రవమిది పదములదా` అనే పాట ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు. ఎస్పీ బాలు, వాణి జైరామ్ పాడారు.
`గాయం`(1993) చిత్రంలోని `సురాజ్య మవలేని స్వరాజ్యమెందుకని` పాటకి నాలుగో నంది అవార్డు వచ్చింది. శ్రీ దీనికి సంగీతం అందించారు. బాలసుబ్రమణ్యం పాడారు.
`శుభలగ్నం`(1994) చిత్రంలోని `చిలకా ఏ తోడు లేక` అనే పాటకి ఐదో నందిని పొందారు. ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వం వహించడంతోపాటు సంగీతం అందించారు. ఈ పాటని ఎస్పీబాలు ఆలపించారు.
జగపతిబాబు నటించిన `శ్రీకారం`(1996) చిత్రంలోని మనసు కాస్త కలత పడితే.. `అనే పాటకి ఆరో నందిని పొందారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.
`సిందూరం`(1997) చిత్రంలోని `అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని` అనేపాటకి ఏడో నంది అవార్డుని సొంతం చేసుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీనివాస్ చక్రవర్తి సంగీతం అందించారు.
ఎస్పీబాలు పాటని ఆలపించారు.
`ప్రేమ కథ`(1999) చిత్రంలోని `దేవుడు కరుణిస్తాడని` పాటకి మరో నంది సొంతం చేసుకున్నారు సిరివెన్నెల. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటని రాజేష్ క్రిష్ణన్, అనురాధ శ్రీరామ్ ఆలపించారు. సందీప్ చౌతా సంగీతం అందించారు.
`జగమంత కుటుంబం నాది` అనే పాటకి `చక్రం`(2005) చిత్రం నుంచి తొమ్మిదో నంది అవార్డుని సొంతం చేసుకున్నారు సిరివెన్నెల. చక్రి సంగీతం అందించగా, శ్రీ ఆలపించారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు.
`గమ్యం` చిత్రంలోని `ఎంత వరకు ఎందుకొరకు` పాటకి పదో అవార్డుని సొంతం చేసుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఈ ఎస్ మూర్తి, ఆర్ అనిల్ సంగీతం అందించగా, రంజిత్ పాడారు.
`సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంలోని `మరి అంతగా` అనే పాటని శ్రీరామ చంద్ర ఆలపించారు. ఈ పాటకి సిరివెన్నెల 11వ నంది అవార్డుని అందుకున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఇలా పదకొండు పాటలకు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు సిరివెన్నెల.
also read: Sirivennela: నిగ్గదీసి ప్రశ్నించిన ఆ పాట మూగవోయింది..! సమాజం పోకడపై సిరివెన్నెల ఆలోచింపజేసే గీతాలు
also read: Sirivennela Seetharama Sastry Death: పాటల శిఖరం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు..