Sirivennela: నిగ్గదీసి ప్రశ్నించిన ఆ పాట మూగవోయింది..! సమాజం పోకడపై సిరివెన్నెల ఆలోచింపజేసే గీతాలు
Sirivennela Seetharaama Sastry: ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పినట్టు.. ‘ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. అర్థరాత్రి ఉదయించే సూర్యుడు’ సిరివెన్నెల. జనాలకు అర్థం కాని సాహిత్యాన్ని అందిస్తున్న తెలుగు సినీ సంగీతానికి కొత్త సొబగులద్ది.. ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే పాటలు రాశారు.
జనాలలో చైతన్యాన్ని తట్టిలేపేది పాట. పాలకులను ప్రశ్నించేది పాట.. ఉద్యమాలకు ఊపిరిపోసేది పాట.. ప్రజల అజ్ఞానపు తిమిరాలను తొలగించే శక్తి ఒక్క పాటకు మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు. కానీ తెలుగు సినిమా పాటలంటే హీరో హీరోయిన్ల విరహ గీతాలు, కీర్తనలు, జనాలకు అర్థం కాని భాషలో సాహిత్యం, అతీ గతీ లేని బ్రేక్ డాన్సులకు రెండు పల్లవులు, నాలుగు చరణాల దగ్గరే ఆగిపోయాయి. చైతన్యం సంగతి అటుంచితే అసలు ఆ పాటలో సాహిత్యం వినబడితే అదే పదివేలు అనే స్థాయికి దిగజారింది పాట. ఒక మూసలో పడి కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు ఆయన పాటలు కొత్త ఊపునిచ్చాయి. సంప్రదాయ సాహిత్యంతో పాటు తనకు వీలు దొరికినప్పుడల్లా ప్రజలను ప్రశ్నించారు సిరివెన్నెల. సమసమాజ స్థాపనకు తమ వంతుగా ఏమి చేయాలో జనాలకు గుర్తు చేశారు. ప్రజలకు బాధ్యతను గుర్తు చేస్తూ.. ప్రభుత్వాల విధానాలను ఎండగడుతూ.. సంప్రదాయ సాహిత్య గీతాలే కాదు.. సామాజిక గీతాలను ఎంతో అద్భుతంగా విరచించిన పాటల పూదోట సిరివెన్నెల.
‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని.. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. దేవుడు దిగిరాని.. ఎవ్వరు ఏమై పోనీ...!’, ‘అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వరాజ్యమందామా..? స్వర్ణోత్సవాలు చేద్దామా..?, నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా..? దాన్నే స్వరాజ్యమందామా..? ’ ‘సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని.. సుఖాన మనలేని వికాసమెందుకని..’, ‘తెల్లారింది లెగండో కొక్కరొక్కో.. మంచాలింక దిగందో కొక్కరక్కో..’ ఈ పాటలు చాలు సిరివెన్నెలకు సమాజం పట్ల ఉన్న ఆయనకున్న ప్రేమ, బాధ్యత ఎంత లోతుగా ఉందో తెలపడానికి. తెలుగు సినిమాలలో చైతన్య గీతాలు చాలా అరుదుగా వచ్చాయి. అదీ శ్రీ శ్రీ,, ఆరుద్ర వంటి మహామహులు.. ఎక్కడో సందర్భం దొరికినప్పుడు రాసినవే. వారి తర్వాత తెలుగునాట ప్రజల్లో సమాజం పట్ల అవగాహన కల్పించే పాటలు వచ్చింది చాలా తక్కువ. కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆ లోటును పూడ్చారు.
కృష్ణవంశీ సినిమా సింధూరంలో ‘అర్థ శతాబ్దపు అజ్ఞానం’ పాటలో.. ఆయన ప్రభుత్వాలు, వ్యవస్థ, ప్రజలను ఏకకాలంలో ప్రశ్నించారు. నక్సలైట్లు, పోలీసుల నేపథ్యంలో సాగిన ఆ సినిమాలో హింస కారణంగా అమాయక జనాలు ఏ విధంగా నష్టపోతున్నారో చెప్పారు. కులాల కంపును, మతాల రొచ్చును ప్రశ్నిస్తూ.. దాని వెంట పరుగెత్తుతున్న జనాలను చివరికి దేశం మొత్తం తగలడుతోందని నిజం తెలుసుకోరే..? అని ప్రశ్నించారు. ఇక అన్నలు ఎవరికోసం పోరాడాలి..? పోరి ఏమిటి సాధించాలి..? అని సూటి ప్రశ్న వేశారు.
గాయం సినిమాలో వచ్చే ‘నిగ్గదీసి అడుగు’, ‘సురాజ్యమవలేని’ పాటలైతే ఒక మాస్టర్ పీస్. నానాటికీ శిథిలమైపోతున్న ఈ సమాజ జీవచ్చవాన్ని అగ్గితోని కడగాలని ఆవేదనతో చెప్పారు. దేవుడే దిగివచ్చినా.. ఈ లోకం మారదని హెచ్చరించారు. రావణ కాష్టాన్ని రామ బాణం ఆర్పలేదని, కురుక్షేత్రాన్ని కృష్ణ గీత ఆపలేదని.. చరిత్రలో రక్తపు మారణహోమాన్ని గుర్తు చేశారు. బలవంతులే అరాచక పాలన సాగిస్తున్న ఈ సమాజంలో.. ‘బలవంతులె బతకాలని సూక్తి మరవకుండా.. శతాబ్దాలు చదవలేదా.. ఈ అరణ్య కాండా..’ అని సమాజ పోకడను వివరించారు.
ఇక ఇదే సినిమాలో ఆవేశంలో జనాలు ఏం చేస్తున్నారు..? దాని వల్ల వాళ్లు ఏం కోల్పోతున్నారు..? అనేదానిని కూలంకశంగా వివరించారు సిరివెన్నెల. ‘ఆవేశంలో ప్రతి నిమిషం.. ఉరికే నిప్పుల జలపాతం.. కత్తి కొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం.. బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు.. భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే..’ అంటూ మత కల్లోలాలు, రాజకీయ గొడవలలో అమాయకలువుతున్న యువత భవిష్యత్ గురించి ఘోషించారు. ఇదే పాటలో ‘కులమతాల దవానలానికి కరుగుతున్నది మంచు శిఖరం.. కలహముల హాలాహాలానికి మరుగుతున్నది హిందూ సంద్రం.. అమ్మభారతి బలిని కోరిన రాచకురుపీ రాజకీయం..’ అంటూదేశంలో చెలరేగుతున్న రాజకీయ నాయకుల అధికార దాహానికి బలై ప్రజలు కుల, మతాల అల్లర్లకు ఎలా ఆవిరవుతున్నారని ఆవేదన చెందారు.
జల్సా సినిమాలో ‘ఛలోరే ఛల్ ఛలోరే ఛల్..’పాటలో.. అప్పుడెప్పుడో ఆటవిక కాలం నుంచి ఇప్పటిదాకా సమాజం ఏం మారిందని ప్రశ్నించారు. యుగయుగాలలో మృగాలకన్నా ఎక్కువ ఏం ఏదిగాం..? అని గల్లపట్టి అడిగారు. రాముడిలా ఎదుగుతూనే, రాక్షసులను మించగలమని ప్రస్తుత మనుషుల రెండు ముఖాలను ఆవిష్కరించారు. మనం వెళ్లే పయనం మనకు తెలిసి ఉండాలి కదా..? అని యువతను సక్రమమార్గంలో నడిపించే ప్రయత్నం చేశారు.
ఇవే కాదు.. సమాజాన్ని మేల్కొలిపే ఎన్నో వందలాది పాటలను రాసిన సిరివెన్నెల కలం నేడు మూగవోయింది. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న సిరివెన్నెల మరణం చిత్ర పరిశ్రమకే కాదు జనులకు తీరని లోటే..