- Home
- Entertainment
- `కన్నప్ప` సినిమాలో చిన్న పాత్ర చేసి ఏకంగా హీరోగా ఛాన్స్ కొట్టిన నటుడు.. ప్రభాస్, మంచు విష్ణు కలిస్తే అంతే
`కన్నప్ప` సినిమాలో చిన్న పాత్ర చేసి ఏకంగా హీరోగా ఛాన్స్ కొట్టిన నటుడు.. ప్రభాస్, మంచు విష్ణు కలిస్తే అంతే
`కన్నప్ప` సినిమా మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమాపై హైప్ పెంచుతుంది టీమ్. తాజాగా శివబాలాజీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మరో రెండు రోజుల్లో `కన్నప్ప`
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప`. మోహన్ బాబు నటిస్తూ నిర్మించిన చిత్రమిది. మైథలాజికల్ కథాంశంతో కన్నప్ప చరిత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్, శరత్ కుమార్, బ్రహ్మానందంతోపాటు శివబాలాజీ ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. మరో రెండు రోజుల్లోనే ఇది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
`కన్నప్ప`లో నా ఎంట్రీ ఇలా జరిగిందిః శివ బాలాజీ
`కన్నప్ప` చిత్రంలో మహాదేవ శాస్త్రి కొడుకు పాత్రలో నటించారు నటుడు శివబాలాజీ. నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్ర, అయినా తన పాత్ర ఇంపాక్ట్ చాలా ఉంటుందట. తాజాగా బుధవారం శివాబాలాజీ మీడియతో ముచ్చటించారు.
`కన్నప్ప` మూవీ గురించి, అలాగే ఈ చిత్రంలో నటించడం వల్ల తనకు హీరోగా వచ్చిన ఛాన్స్ గురించి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ``కన్నప్ప` కోసం చర్చలు జరుగుతున్న సమయంలో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదని విష్ణుని మోహన్ బాబు అడిగారు. శి
వ బాలాజీ చేసే పాత్ర ఇందులో కనిపించలేదని విష్ణు అన్నారు. లేదు లేదు శివ బాలాజీ కచ్చితంగా ఉండాలని మోహన్ బాబు అన్నారు. దీంతో ఆ తరువాత కొన్ని రోజులకు మహదేవశాస్త్రి కొడుకు పాత్రకు నేను అయితే బాగుంటుందని అనుకున్నారు. అలా `కన్నప్ప` చిత్రంలోకి వచ్చేశాను` అని తెలిపారు శివబాలాజీ.
ప్రభాస్, మంచు విష్ణు మధ్య సీన్లు `కన్నప్ప`లో హైలైట్
`కన్నప్ప` చిత్రంలో తన పాత్ర గురించి శివ బాలాజీ చెబుతూ, `ఇందులో నా పాత్ర నిడివి, ప్రాముఖ్యత కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ ఓ గొప్ప చిత్రంలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇంకేమీ ఆలోచించలేదు.
న్యూజిలాండ్‌లో మొత్తం రెండు నెలలు ఉన్నాను. మోహన్ బాబు షూటింగ్ చేసినన్ని రోజులు నేను కూడా ఉన్నాను. `కన్నప్ప` సినిమాను చూశాను. అద్భుతంగా వచ్చింది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రభాస్ ఎంట్రీ తరువాత సినిమా రేంజ్ మారుతుంది.
ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా అనిపిస్తాయి. మోహన్‌లాల్ ఎంట్రీ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అక్షయ్ కుమార్ క్యారెక్టర్ సర్ ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. శివుడిగా అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించారు.
ఫస్ట్ డే ఆయన్ను షూట్‌లో చూసినప్పుడు షాక్ అనిపించింది. తెరపై ఆయన కనిపించే ఫస్ట్ సీన్‌కు మనం శివుడు అని ఫిక్స్ అయిపోతాం. అంతలా ఆ పాత్రలో ఆయన ప్రేక్షకుల్ని మెప్పిస్తారు.
`కన్నప్ప` చేయకపోతే చాలా మిస్ అయ్యేవాడిని
మోహన్ బాబు ఆన్ స్క్రీన్ వేరుగా ఉంటారు. ఆఫ్ స్క్రీన్ వేరుగా ఉంటారు. విష్ణుతో ‘మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) నుంచి పరిచయం. ‘మా’కు పని చేస్తున్నప్పుడే మా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది.
అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం. మోహన్ బాబుకి దగ్గరవ్వడం కష్టం. దగ్గరైతే అలా ప్రేమతో కట్టి పడేస్తారు. మోహన్ బాబు ఇందులో నా పాత్రని చేయమని అన్నప్పుడు చాలా ఆలోచించాను.
మరీ సైడ్‌కి అలా నిలబడే పాత్రను ఎలా చేయాలి? అని విష్ణుని అడిగాను. అది నీ ఇష్టం అని విష్ణు అన్నారు. మా ఆవిడ మధు కూడా అలానే అన్నారు. సరే అని ఒప్పేసుకున్నాను.
కానీ ఈ చిత్రంలో, ఆ పాత్రను పోషించకపోతే చాలా మిస్ అయ్యేవాడ్ని. ఇప్పుడు నాకు ఆ పాత్ర గొప్పదనం అర్థమైంది` అని చెప్పారు శివబాలాజీ.
మోహన్ బాబు బ్యానర్‌లో హీరోగా సినిమా
తాను చేస్తున్న సినిమాల గురించి చెబుతూ, కెరీర్ ప్రారంభంలో వరుసగా మూడు ఫ్లాపులు వచ్చాయి. నా మొదటి హిట్ `ఆర్య`. నేను ప్రారంభంలోనే ఎత్తుపల్లాలు చూశాను. ఇప్పుడు ఏ విషయాన్ని కూడా అంతగా పట్టించుకోను.
నేను ఎవ్వరి నుంచి ఏమీ ఆశించను. ప్రస్తుతం మంచి కథలు వస్తేనే చేస్తున్నాను. నచ్చకపోతే దర్శక, నిర్మాతల మొహం మీదే చేబుతున్నాను. డబ్బుల కోసం సినిమాలు చేయాలని అనుకోవడం లేదు.
నేను చేసిన ‘రెక్కీ’ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘రెక్కీ 2’ చేస్తున్నా. ఇది త్వరలో రాబోతుంది. అలాగే ‘సింధూరం’ అనే మరో మూవీ చేశాను. ప్రస్తుతం మోహన్ బాబు ప్రొడక్షన్‌లో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను` అని తెలిపారు శివబాలాజీ.
మొత్తంగా `కన్నప్ప`లో నటించి అదే బ్యానర్‌లో హీరోగా ఛాన్స్ అందుకున్నాడు శివబాలాజీ.