ఆ స్టార్ హీరోనే నా గాడ్‌ఫాదర్.. టాలీవుడ్ విలన్ ఆసక్తికర కామెంట్స్..
Sayaji Shinde: టాలీవుడ్ నటుడు షయాజీ షిండే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన టాలీవుడ్ ప్రయాణం, చిరంజీవి సలహా, ప్రకృతి పట్ల తనకున్న ప్రేమ గురించి పంచుకున్నాడు. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి మరి.

షిండే మాటల్లో..
టాలీవుడ్ నటుడు, విలన్ షయాజీ షిండే ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు పంచుకున్నాడు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, ప్రకృతి పట్ల తనకున్న ప్రేమ, అలాగే టాలీవుడ్ నటీనటులతో తన అనుభవాలను పంచుకున్నాడు. తన తెలుగు సినీ ప్రయాణం మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఠాగూర్' సినిమాతో మొదలైందని వెల్లడించాడు.
థియేటర్ టూ వెండితెర..
థియేటర్ నటుడిగా ఉన్నప్పటి నుంచే తాను తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకునేవాడినని.. అది గమనించే చిరంజీవి తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పమని ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ తనకి రెండో ఇల్లు లాంటిదని, ఇక్కడి అభిమానులు తనను ఎంతగానో ఆదరిస్తారని చెప్పాడు. అమెరికా, జర్మనీ, దుబాయ్, ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు అభిమానులు తనను సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకుంటారని తెలిపాడు
ఇష్టమైన డైలాగులు..
"తిన్నామా.. పడుకున్నామా.. తెల్లరిందా.", "ఒక దేశం వెనకబడిందంటే దానికి కారణం రైతు, ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి కారణం రైతే" అనే డైలాగులు తనకు చాలా ఇష్టమని తెలిపాడు. తన ఫేవరేట్ చిత్రాలుగా ఠాగూర్, పోకిరి, అరుంధతి, శూల్ చిత్రాలని పేర్కొన్నాడు. చాలా భాషల్లో నటించానని, నటుడిగా ప్రతీ పాత్రలో లీనమైపోతానని వివరించాడు. టాలీవుడ్ పాన్ ఇండియా స్థాయికి విస్తరిస్తున్నా.. ప్రస్తుత డిజిటల్ యుగంలో, డిజిటలైజేషన్ ప్రపంచాన్ని దగ్గర చేసిందని, కానీ నిజం ఎప్పటికీ నిజంగానే ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
తోటి నటుల గురించి..
షయాజీ షిండే తనతో కలిసి నటించిన తోటి నటుల గురించి మాట్లాడుతూ.. చిరంజీవి తనకు గాడ్‌ఫాదర్, ట్యూటర్ అని తెలిపాడు. మరాఠీ నుంచి తెలుగుకు తన ప్రయాణంలో చిరంజీవి ప్రోత్సాహం ఎంతో ఉందని అన్నాడు. నాగార్జున సార్‌తో కలిసి అనేక సినిమాలు చేశానని, ఒక సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున తన భుజంపై చేయి వేసి "భయం వేసిందా" అని అడిగిన తీరు తనని ఆకట్టుకుందని చెప్పాడు. మహేష్ బాబు చాలా క్రమశిక్షణతో, కూల్‌గా, సరదాగా ఉంటాడని, జూనియర్ ఎన్టీఆర్ విల్ పవర్ ఉన్న ఆస్కార్ నటుడని ప్రశంసించాడు.
ప్రకృతిపై ప్రేమ..
చెట్టు నిజమైన సెలబ్రిటీ. ఆక్సిజన్, నీడ, జీవితం అన్నీ చెట్ల వల్లే లభిస్తాయని షిండే చెప్పాడు. తన అమ్మ జ్ఞాపకార్థం ఆమె పేరు మీద చెట్లు నాటాలని నిర్ణయించుకున్నానని, ఆ చెట్లలోనే తన అమ్మ ఉంటుందని తెలిపాడు. ఇది తన జీవితానికి ఎలా కనెక్ట్ అయిందో వివరించాడు. తన ఫిట్‌నెస్ రహస్యం ఉదయాన్నే లేవడం, స్నేహితులతో గడపడం, రాత్రి అలవాట్లకు దూరంగా ఉండటమేనని వెల్లడించాడు.

