Brahmamudi: మాస్టర్ ప్లాన్ వేసిన రుద్రాణి.. భర్త ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్న కావ్య!
Brahmamudi: బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. భర్తలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోతున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో రాహుల్ కి ఫోన్ చేసిన రుద్రాణి వెళ్ళిపోయారా అని అడుగుతుంది. వెళ్లిపోయాము అంటాడు రాహుల్. ఇక్కడ ఇంట్లో చెప్పి వెళ్ళలేనందుకు నానా గొడవ చేస్తున్నారు అంటుంది రుద్రాణి. ఇంట్లో ఉంటే మాత్రం నా గురించి పట్టించుకుంటున్నారా.. ఆ రాజ్ ఉండగా ఈ రాహుల్ వాళ్ళ కంటికి ఏమాత్రం కనిపించడం లేదు అంటాడు రాహుల్. నీకు విలువ పెరగటం కోసమే ఇదంతా చేస్తున్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ తో పని చెడగొట్టకు. నువ్వు ఏం చేస్తావో తెలియదు వచ్చేటప్పుడు ఒక్కడివే మాత్రమే రావాలి.
నీ పెళ్ళాం పిచ్చిది కాబట్టి నీతో వచ్చింది మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు అని రాహుల్ కి చెప్తుంది రుద్రాణి. సరే అని చెప్తాడు రాహుల్. మరోవైపు భర్త కోసం ఆఫీస్ కి టిఫిన్ తీసుకువస్తుంది కావ్య. అక్కడ పెట్టేసి వెళ్ళు తింటాను అంటాడు రాజ్. లేదు, తాతయ్య మీరు తినే వరకు దగ్గర ఉండి అప్పుడు రమ్మన్నారు అని చెప్తుంది కావ్య. తాతయ్య పేరు చెప్పి నాతో ఆడుకుంటున్నావా అని కోపంగా అడుగుతాడు రాజ్. ఖాళీగానే ఉన్నారు కదా తినొచ్చు కదా అంటుంది కావ్య.
నేను ఖాళీగా ఉన్నానా,నీకు అలా కనిపిస్తున్నానా అంటూ ఆమె మీద అరుస్తూ, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటూ కేకలు వేస్తాడు రాజ్. కావ్య అక్కడినుంచి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇదంతా తాతయ్యకి చెప్తుందేమో అని భయపడిన ఆమె దగ్గరికి వచ్చి నువ్వు బాధపడుతూ వెళుతుంటే నేను చూడలేను. నేను టిఫిన్ తినేస్తాను అంటాడు రాజ్. ఏమైంది ఎలా ప్రవర్తిస్తున్నారు అంతా బానే ఉంది కదా.. ఎప్పుడూ మీరే రైట్ అంటారు కదా ఇప్పుడేంటి తగ్గి మాట్లాడుతున్నారు అంటుంది కావ్య.
అలా ఏం లేదు అయినా మనిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి కదా అంటూ ఏదేదో మాట్లాడుతాడు రాజ్. భర్త ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది కావ్య. ఆటోలో వెళ్తాను అన్న భార్యని వద్దు కారులో పంపిస్తాను అని చెప్పి భార్యని కారులో పంపిస్తాడు రాజ్. ఈ లోపు మేనేజర్ వచ్చి క్లైంట్స్ వెయిట్ చేస్తున్నారు అనడంతో అక్కడికి వెళ్తాడు. వాళ్లు మీ డిజైన్స్ చాలా బాగున్నాయి అని చెప్పటంతో నా డిజైన్స్ నచ్చయన్నమాట, ఇక ఆ కళావతి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు అనుకుంటూ డిజైన్స్ ని చూస్తాడు.
ఆ డిజైన్స్ తను వేసినవి కాదు. ఇదంతా కావ్య,శృతిల పని అని అర్థం చేసుకుంటాడు కానీ బయటపడడు. మరోవైపు రంగులు వేస్తున్న కావ్యకి, భర్తకి టీ ఇస్తుంది కనకం. ఇంకో రెండు రోజుల్లో పని పూర్తయిపోతుంది. అప్పుడు డబ్బులు వస్తే సేటు అప్పు తీరిపోతుంది అని ఆనందపడతాడు కృష్ణమూర్తి. ఆ పెద్ద దానికోసమే ఆలోచన లేకుండా అప్పు చేసి తిప్పలు పడుతున్నాము. ఇంత జరిగినా ఆ పెద్దది కనీసం ఇటువైపు తొంగి చూడటం లేదు అంటుంది కనకం.
అప్పుడు కావ్య స్వప్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిన విషయం చెబుతుంది. కడుపుతో ఉన్నదానికి షికారులు ఏంటి అంటూ కోప్పడుతుంది కనకం. అసలు కడుపు ఉంటే కదా జాగ్రత్త పడటానికి అని అనుకుంటుంది కావ్య. మరోవైపు సార్ డిజైన్స్ చూశారు, మేము చేసిన పనే అని గుర్తుపట్టి ఉంటారు. చేసిన పనికి తిడతారేమో అనుకుంటుంది శృతి. కానీ రాజ్ ఆమెని తన కేబిన్ కి పిలిపించి ఆమెకి టిఫిన్ పెట్టి పంపిస్తాడు. అతని ప్రవర్తనకి ఆశ్చర్యపోతుంది శృతి. మరోవైపు అప్పు ఇంటికి సారీ చెప్పడానికి వస్తాడు కళ్యాణ్.
కళ్యాణ్ మీద కేకలు వేస్తుంది అప్పు. మళ్లీ నన్ను వదిలేసి వెళ్ళిపోతే నీతో ఇంకా ఫ్రెండ్షిప్ చేయను అంటూ అరుస్తుంది. సరే ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఇదంతా చూస్తున్న అప్పు పెద్దమ్మ ఎందుకు అతని మీద అలా అరుస్తున్నావు, అయినా అతను నీకు చెప్పే కదా వెళ్ళాడు అంటుంది. చెప్తే మాత్రం అలా నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడా.. నిన్ను అలా వదిలేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు.
దీని ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది అనుకుంటుంది పెద్దమ్మ. మరోవైపు రాజ్ ఇంటికి వచ్చే సమయానికి బయట కూర్చున్న సీతారామయ్య దగ్గుతూ ఉంటాడు. కంగారుగా అతనికి మంచినీళ్లు ఇస్తాడు రాజ్. తరువాయి భాగంలో భార్యని ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకొని స్వయంగా వడ్డిస్తున్న కొడుకుని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపర్ణ.