- Home
- Entertainment
- చిరంజీవి ఇండస్ట్రీ హిట్‌ని రీమేక్ చేసి ఖంగుతిన్న రజనీకాంత్.. మెగాస్టార్‌ని నమ్ముకుంటే ఊహించని దెబ్బ
చిరంజీవి ఇండస్ట్రీ హిట్‌ని రీమేక్ చేసి ఖంగుతిన్న రజనీకాంత్.. మెగాస్టార్‌ని నమ్ముకుంటే ఊహించని దెబ్బ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన `యముడికి మొగుడు` సినిమా తెలుగులో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కానీ ఇది తమిళంలో డిజాస్టర్ అయ్యింది.

చిరంజీవి మూవీ రీమేక్ చేసి షాక్ తిన్న రజనీకాంత్
ఇప్పుడు రీమేక్ సినిమాలకు కాలం చెల్లింది. ఓటీటీలు, పాన్ ఇండియా కల్చర్ రావడంతో రీమేక్ చిత్రాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. కానీ కరోనాకి ముందు వరకు రీమేక్ సినిమాలు విశేష ఆదరణ పొందాయి. బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇంకా చెప్పాలంటే ఒరిజినల్ చిత్రాలకంటే రీమేక్ అయిన సినిమాలే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. రికార్డులను తిరగరాశాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాని రీమేక్ చేసి బోల్తా పడ్డారు రజనీకాంత్. ఆ సినిమా ఏంటి? ఆ కథేంటో తెలుసుకుందాం.
KNOW
`యముడికి మొగుడు`తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న మెగాస్టార్
1980, 90లో చిరంజీవి కెరీర్ పీక్‌లో ఉంది. ఆయన వరుసగా విజయాలు అందుకున్నారు. కొడితే కుంభస్థలమే అనేట్టుగా ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద రచ్చ చేశాయి. వరుసగా ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అలా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మూవీలో `యముడికి మొగుడు` ఒకటి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. చిరంజీవి ఫ్రెండ్స్ సుధాకర్, జీవీ నారాయణరావు నిర్మించారు. వాళ్లే కథ అందించారు. ఇందులో చిరంజీవికి జోడీగా విజయశాంతి, రాధా నటించారు.
లాభాల్లో కొంత భాగం పత్తిరైతులకు సాయం చేసిన నిర్మాతలు
ఈ మూవీ ఫాంటసీ ఎలిమెంట్లతో ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు మేళవింపుతో రూపొందింది. ముఖ్యంగా పాటలు ఉర్రూతలూగించాయి. రాజ్ కోటి అదిరిపోయే సాంగ్స్ అందించారు. `అందం హిందోళం` పాట ఈ సినిమాలోనిదే. వీటిలో చిరంజీవి డాన్సులు, హీరోయిన్ల గ్లామర్ మాస్ ఆడియెన్స్ ని ఆద్యంతం అలరించాయి. అలా 1988లో ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. విశేష ఆదరణ పొందింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో నిర్మాతలు లాభాల బాటపట్టారు. అంతేకాదు లాభాల్లో కొంత భాగం ఆ ఏడాది కరువ వల్ల ఆత్మహత్య చేసుకున్న పత్తిరైతు కుటుంబాలకు సహాయం అందించారు.
`యముడికి మొగుడు` మూవీని రీమేక్ చేసిన రజనీకాంత్
`యముడికి మొగుడు` సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ చిత్రంపై సూపర్ స్టార్ రజనీకాంత్ కన్నుపడింది. ఆయన దీన్ని రీమేక్ చేశారు. `అథిసయ పిరవి` పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. ఎస్పీ ముతురామన్ దర్శకత్వం వహించారు. తెలుగులో వచ్చిన రెండేళ్ల తర్వాత ఈ సినిమా వచ్చింది. 1990 జూన్ 15న విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయం చెందింది. చిరంజీవిని నమ్ముకుని చేస్తే సూపర్ స్టార్‌కి గట్టి దెబ్బ పడింది.
చిరంజీవి మూవీతో దెబ్బతిన్న రజనీకాంత్
చిరంజీవి మాస్ ఇమేజ్ వేరు. ఆయన కామెడీ టైమింగ్ వేరు. హీరోయిన్లతో రొమాన్స్, అదిరిపోయే పాటలు ఈ మూవీకి పెద్ద అసెట్. కానీ తమిళంలో అవి అంతగా వర్కౌట్ కాలేదు. దీంతో ఆడియెన్స్ రిజెక్ట్ చేశారు. అలా చిరంజీవి ఇండస్ట్రీ హిట్ ని రీమేక్ చేసి రజనీ బోల్తా పడ్డారు. రజనీకాంత్ ప్రస్తుతం `కూలీ` మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. శనివారమే ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ వంటి వారు నటిస్తుండగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది.