Brahmamudi: భర్త మాటలకు కంగారులో కనకం.. స్వప్న కిడ్నాప్ కు ప్లాన్ చేసిన రాహుల్?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తనకి మంచి చేస్తున్న చెల్లెల్ని అపార్థం చేసుకొని పగ సాధించాలనుకుంటున్న ఒక అక్క కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో వెన్నెలతో ఎంగేజ్మెంట్ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే ఎంతమంది అమ్మాయిలు రియాక్ట్ అయ్యారో తెలుసా.. అయినా కర్మకాలి ఇలాంటి వాడికి మా అక్కని ఇచ్చి చేయవలసిన పరిస్థితి వచ్చింది మాట్లాడుతుంది కావ్య. లెక్క సరిపోయిందా.. ఇంకొకరి గురించి మాట్లాడే ముందు నీ కొడుకు సంగతి చూసుకో అంటూ చురక పెడుతుంది ధాన్యలక్ష్మి.
అలాంటి కొడుకు నాకే ఉంటే కాళ్లు చేతులు విరిచేసి అడుక్కునే వాళ్ళకి అమ్మేసేదాన్ని అంటూ వెటకారంగా మాట్లాడుతుంది మీనాక్షి. ఈ మాటలు అన్ని విన్నా కూడా రుద్రాణి ఈ సంబంధం చేసుకోవడానికి ఇష్టపడదు. వీళ్ళ మీద చీటింగ్ కేసు పెడతాను అని చెప్పి రాహుల్తో మంచి లాయర్ ని చూడమని చెప్తుంది. ఎవరు ఎవరి మీద చీటింగ్ కేసు పెడతారు ముసుగు వేసి నా పెళ్లి చేసినందుకు ముందు నీ మీద చీటింగ్ కేసు పెట్టాలి నేను.
అమ్మాయిని మోసం చేసినందుకు నీ కొడుకు మీద చీటింగ్ కేసు పెట్టాలి. ఎక్కువ మాట్లాడితే పోయేది నీ పరువే నీ పెద్దకాన్ని నిలబెట్టుకో అంటూ రుద్రాణి నోరు మూయిస్తాడు రాజ్. సీతారామయ్య కూడా రాజ్ మాటలతో ఏకీభవిస్తాడు. ఈ పెళ్లి కచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి పంతులు గారిని మంచి ముహూర్తం చూడమని చెప్తాడు సీతారామయ్య.
ఎల్లుండి మంచి ముహూర్తం ఉంది అని చెప్పటంతో కంగారుపడుతుంది కనకం. మాకు ఇబ్బందవుతుంది అంటుంది. ఏమి పర్వాలేదు అన్ని నేను తీసుకు వస్తాను అంటుంది మీనాక్షి. మీరు ఎవరూ ఏమి తీసుకురావకర్లేదు వాడు మా ఇంట్లోనే పెరిగాడు కాబట్టి వాడి పెళ్లి బాధ్యత మాదే. మీరందరూ రేపు మా ఇంటికి వచ్చేయండి చాలు అంటుంది చిట్టి. పెళ్లి మాత్రం నాలుగు గోడల మధ్య సింపుల్గా జరగాలి అంటారు అపర్ణ, కావ్య.
పెళ్లి గ్రాండ్గా జరగనివ్వడం లేదని చెల్లెలు మీద కుళ్ళుకుంటుంది స్వప్న. మరోవైపు మీకు ఇంట్లో అవమానం జరిగినందుకు సారీ చెప్పడానికి ఎక్కడికి వచ్చాను అని అప్పుతో చెప్తాడు కళ్యాణ్. ఇంతలోనే ధాన్య లక్ష్మీ కాల్ చేసి రాహుల్ పెళ్లి కుదిరినట్లుగా చెప్తుంది. ఆనందం పట్టలేక అప్పుని ఎత్తుకొని గిరగిరా తిప్పుతాడు కళ్యాణ్. నీకేమైనా పిచ్చా అంటూ మందలిస్తుంది అప్పు.
అనుకోకుండా అలా అయిపోయింది సారీ అని చెప్పి అప్పుని తన బైక్ మీద డ్రాప్ చేస్తాడు కళ్యాణ్. మరోవైపు దిగులుగా కూర్చున్న భార్య దగ్గరికి వచ్చి డబ్బులు కోసం నువ్వేమీ కంగారు పడకు ఇల్లు తాకట్టు పెడదాము వెళ్లి ఇంటి కాగితాలు తీసుకురా అంటాడు కృష్ణమూర్తి. ఒక్కసారిగా తుళ్ళి పడుతుంది కనకం. వద్దయ్యా.. మళ్ళీ అప్పు తీర్చలేకపోతే అదొక ఇబ్బంది.
అయినా పెళ్లి ఖర్చులన్నీ వాళ్లే పెట్టుకుంటాను అన్నారు కదా మిగిలినవి మా అక్క చూసుకుంటుంది నువ్వు వెళ్లి ప్రశాంతంగా పడుకో అని చెప్పి భర్తని పంపించేస్తుంది కనకం. మరోవైపు గదిలోకి వచ్చిన కావ్య దుప్పటి చాప తీసేస్తుంటే ఏం మరో కొత్త చాప కొన్నావా అని అడుగుతాడు రాజ్. ఇక మీదట నాకు ఆ కర్మ లేదు అందుకే వీటిని కబోర్డ్ లో దాచేస్తున్నాను అంటుంది కావ్య.
మరి ఎక్కడ పడుకుంటావు అని అమాయకంగా అడుగుతాడు రాజ్. నా తప్పు లేదని నిరూపించాను కదా ఇంకెక్కడో పడుకోవలసిన అవసరం నాకు ఏముంది నీ పక్కనే పడుకుంటాను అంటుంది కావ్య. చచ్చినా ఒప్పుకోను అంటాడు రాజ్. అది మీ ఇష్టం అని చెప్పి మంచం మీద పడుకుంటుంది కావ్య. పౌరుషంగా చాప దిండు తీసుకువచ్చి కిందన పడుకుంటాడు రాజ్. కానీ కింద పడుకో లేక నానా ఇబ్బంది పడుతుంటాడు.
పోనీలెండి మీరు మంచం మీదకు వచ్చేయండి నేను కిందన పడుకుంటాను అంటుంది కావ్య. నువ్వేమి త్యాగం చేయక్కర్లేదు నేను కిందనే పడుకుంటాను అంటూ బెట్టు చేస్తాడు రాజ్. రాజ్ బాధ చూడలేక తను కూడా కిందనే పడుకుంటుంది కావ్య. తరువాయి భాగంలో పెళ్లి జరిగిపోతుందేమో అని భయపడుతుంది రుద్రాణి. నువ్వేమీ భయపడకు ఈ పెళ్లి జరగదు అని హామీ ఇస్తాడు రాహుల్. మనుషుల్ని పెట్టి స్వప్నని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తాడు.