- Home
- Entertainment
- ఒక్క సీన్ కోసం 57 రోజులు, వీరమల్లులో హైలైట్ అదే..నిధి అగర్వాల్ కష్టపడుతుంటే సిగ్గేసింది, పవన్ కామెంట్స్
ఒక్క సీన్ కోసం 57 రోజులు, వీరమల్లులో హైలైట్ అదే..నిధి అగర్వాల్ కష్టపడుతుంటే సిగ్గేసింది, పవన్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న రిలీజ్ అవుతోంది. సాధారణంగా సినిమా ప్రచారానికి పవన్ దూరంగా ఉంటారు. అలాంటిది తాజాగా హరిహర వీరమల్లు కోసం పవన్ మీడియా సమావేశం నిర్వహించారు.

హరిహర వీరమల్లు మీడియా సమావేశం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న తొలి చిత్రం హరిహర వీరమల్లు. ఐదేళ్ల పాటు అనేక ఒడిదుడుకులతో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అయింది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో కీరవాణి సంగీత దర్శకుడిగా ఈ చిత్రం రూపొందింది. గురువారం రోజు ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎవ్వరూ ఊహించని విధంగా హరిహర వీరమల్లు చిత్రం కోసం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఏఎం రత్నం గారి కోసమే ప్రెస్ మీట్ పెట్టా: పవన్ కళ్యాణ్
మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా సుదీర్ఘంగా మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు షూటింగ్ లో ఎదురైన ఒడిదుడుకులు, చిత్ర యూనిట్ లో ఒక్కొక్కరి కష్టం ఇలా అన్ని విషయాలని ప్రస్తావించారు. రాజకీయ సమావేశాల్లో మాట్లాడతాను కానీ ఇలా సినిమా సమావేశాల్లో మాట్లాడాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ నిర్మాత ఏఎం రత్నం గారి కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ఈ చిత్రం కోసం ఏఎం రత్నం చాలా కష్టాలు పడ్డారు. అప్పట్లోనే పాన్ ఇండియా చిత్రాలు తీసిన నిర్మాత ఆయన.
క్లైమాక్స్ సీన్ కోసం 57 రోజులు షూటింగ్
నాకు ప్రస్తుతం సినిమాలకు టైం కేటాయించడమే పెద్ద సమస్యగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా కేవలం ఈ మూవీ క్లైమాక్స్ కోసమే 57 రోజులు కేటాయించాను. అంత కష్టంతో కూడుకున్న సన్నివేశం అది. డైరెక్టర్ క్రిష్ గారు నా దగ్గరకి చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చారు. ఈ సందర్భంగా క్రిష్ కి ధన్యవాదాలు చెబుతున్నా. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఒక దశలో ఈ చిత్రం ఆగిపోతుందా అనే అనుమానం కలిగింది
కోవిడ్ ప్రభావం ఈ చిత్రంపై ఎక్కువగా పడింది. ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఒక దశలో ఈ చిత్రం ముందుకు వెళుతుందా? ఆగిపోతుందా అనే సందేహం నాకు కలిగింది. అలాంటి టైంలో కీరవాణి గారు ఈ చిత్రానికి ప్రాణవాయువులా నిలిచారు. క్రిష్ గారు ఈ చిత్రం నుంచి తప్పు కున్న తర్వాత జ్యోతి కృష్ణ గారు ఎంటర్ అయ్యారు. ఆయన చాలా సత్తా ఉన్న దర్శకుడు. ప్రతి సీన్ కి ఆయన ప్రీ విజువలైజేషన్ చేశారు. మనోజ్ పరమహంస గారితో కలిసి అద్భుతం చేశారు.
నిధి అగర్వాల్ ఒక్కరే ప్రమోషన్స్ చేస్తుంటే సిగ్గనిపించింది
డైరెక్టర్ జ్యోతి కృష్ణ, ఏఎం రత్నం ఇలా చిత్ర యూనిట్ మొత్తం ఇప్పటికీ సరైన నిద్ర లేకుండా కష్టపడుతున్నారు. నిధి అగర్వాల్ ఒక్కరే ప్రమోషన్స్ తన భుజాల మీదికి వేసుకుని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నిధి అగర్వాల్ ఒక్కరే కష్టపడుతుంటే నాకే సిగ్గనిపించింది. సినిమాని అనాథలా వదిలేశానా అనే ఫీలింగ్ కలిగింది. ఈ చిత్రాన్ని అనాథలా వదల్లేదు అని చెప్పేందుకే ఈ మీడియా సమావేశం నిర్వహించా అని పవన్ కళ్యాణ్ అన్నారు.

