- Home
- Entertainment
- Pawan-Singeetam Movie: జీసస్ కథతో పవన్ కళ్యాణ్ మూవీ.. సింగీతంతో చేయాల్సిన సినిమా ఎలా ఆగిపోయింది?
Pawan-Singeetam Movie: జీసస్ కథతో పవన్ కళ్యాణ్ మూవీ.. సింగీతంతో చేయాల్సిన సినిమా ఎలా ఆగిపోయింది?
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. జీసస్ కథతో చేయాల్సిన ఈ మూవీ ఎందుకు ఆగిపోయింది? అసలు ఏం జరిగిందనేది చూద్దాం.

పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో సినిమా
పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో ఒక సినిమా రావాల్సింది. కానీ అనూహ్యంగా మిస్ అయ్యింది. అధికారికంగా ప్రకటించారు, జీసస్ జీవితం ఆధారంగా కథ ఓకే అనుకున్నారు. విదేశాల్లో లొకేషన్లని కూడా హంట్ చేశారు. ఇక సినిమాని స్టార్ట్ చేయాలనుకునే సమయంలోనే ఆగిపోయింది. మరి వీరి కాంబినేషన్‌లో అనుకున్న సినిమా ఏంటి? ఎప్పుడు ఈ ప్లాన్ జరిగింది? ఎందుకు ఆగిపోయింది? అనేది తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్
ఈ మధ్య `ఓజీ`తో బౌన్స్ బ్యాక్ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తన కెరీర్‌లో కమర్షియల్ చిత్రాలతో పాటు కొత్త తరహా కథలను ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఆయన ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఆలోచనల్లో భాగంగా రూపొందించాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’. 2010లో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, నిర్మాత కొండా కృష్ణంరాజు నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. యేసుక్రీస్తు జీవితం, ఆయన బోధనలు, అద్భుతాల నేపథ్యంలో ఈ కథను రూపొందించాలని నిర్ణయించారు. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఆధ్యాత్మికత, చరిత్ర, మానవీయ విలువల కలయికగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు.
రెండేళ్లపాటు కథపై కసరత్తు
ఈ సినిమా కథను సిద్ధం చేయడానికి సింగీతం శ్రీనివాసరావు, ప్రముఖ రచయిత జె.కె. భారవి దాదాపు రెండేళ్లపాటు కష్టపడ్డారు. యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన అనేక పుస్తకాలతో పాటు బైబిల్‌ను కూడా అధ్యయనం చేశారు. కథలో ఎలాంటి పొరపాట్లు లేకుండా, చారిత్రక నేపథ్యాన్ని సహజంగా చూపించాలనే ఉద్దేశంతో విస్తృతంగా పరిశోధన చేశారు.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించాల్సి ఉంది. అయితే ఆయన పూర్తి స్థాయి యేసుక్రీస్తు పాత్రలో కనిపించబోరని, కథలో అత్యంత కీలకమైన ప్రత్యేక పాత్రలో నటించనున్నారని సింగీతం వెల్లడించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పవన్‌ను ఆర్కిటెక్ట్ పాత్రలో చూపించనున్నారనే ప్రచారం కూడా జరిగింది.
హీరోయిన్‌గా అనుష్క.. విదేశాల్లో లొకేషన్ హంటింగ్
ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్క శెట్టిని ఎంపిక చేసినట్లు, ఆమెతో ఒప్పందం కూడా కుదిరినట్లు అప్పట్లో సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ‘అరుంధతి’ సినిమాలో అనుష్క నటన చూసిన సింగీతం, ఈ కథలో దేవదూత తరహా పాత్రకు ఆమె సరిపోతారని భావించినట్లు వార్తలు వినిపించాయి. ఇక సినిమాను పాన్ ఇండియా తరహాలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో భారీ స్థాయిలో రూపొందించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత కొండా కృష్ణంరాజుతో పాటు టీమ్ ఇజ్రాయెల్, జెరూసలేం, జోర్డాన్, బెత్లహేం ప్రాంతాలను సందర్శించింది. యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించి, సినిమా చిత్రీకరణకు అనువైన లొకేషన్లను ఎంపిక చేయాలని భావించారు.
బడ్జెట్ దెబ్బ.. ఆసక్తి కోల్పోయిన పవన్?
ఈ ప్రాజెక్ట్‌పై పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక ఆసక్తి చూపిస్తూ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పేర్కొన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అన్ని ప్రణాళికలు సిద్ధమై, త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని అభిమానులు ఆశిస్తున్న సమయంలో అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. దీనికి ప్రధాన కారణం భారీ బడ్జెట్ అని తెలుస్తోంది. మొదట అంచనా వేసిన నిర్మాణ వ్యయం కంటే ఖర్చు గణనీయంగా పెరగడంతో నిర్మాత కొండా కృష్ణంరాజు సినిమాను కొనసాగించడం కష్టమని భావించినట్లు సమాచారం. మరోవైపు రెండేళ్లపాటు స్క్రిప్ట్ పనులు కొనసాగడం, ప్రాజెక్ట్ ప్రారంభం ఆలస్యం కావడంతో పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాపై ఆసక్తి కోల్పోయినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్ట్‌ను నిలిపివేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భిన్నమైన చిత్రంగా నిలిచే అవకాశం ఉన్న ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ కేవలం ప్రకటనలు, కథా చర్చలు, లొకేషన్ రికీలు, ప్రీ ప్రొడక్షన్ పనులకే పరిమితమైంది. ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు సింగీతం శ్రీనివాసరావు వంటి దిగ్గజ దర్శకుడు.. అంతర్జాతీయ స్థాయిలో రూపొందించాలనుకున్న ఈ సినిమా ఆగిపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది. మొత్తంగా పవన్, సింగీతం కాంబినేషన్‌లో మూవీ అలా మిస్ అయ్యిందని చెప్పొచ్చు. ఒకవేళ చేసి ఉంటే అది చరిత్రలో నిలిచిపోయే సినిమా అయ్యిండేది.

