ఎన్టీఆర్, ఎన్నార్, ఎస్వీఆర్ మధ్య గొడవ, మాయాబజార్ క్రెడిట్ కోసం ఏం చేశారంటే?
ఒక సినిమాలో ఒక హీరోనే ఉంటాడు. ఇద్దరు హీరోలు అయితే మల్టీస్టారర్, ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తే ఆ క్రెడిట్ ఇద్దరికి సమానంగా ఇస్తారు. కాని ఓ నలుగురు ఐదుగురు స్టార్లు ఉన్న మయాబజార్ లాంటి సినిమాలో హీరోగా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి.

మయాబజార్ అద్భుతమైన సినిమా. తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యంలా నిలిచిపోయిన సినిమా. టెక్నాలజీ లేని రోజల్లో కూడా ఈసినిమాలో చూపించిన కొన్ని విజ్యూవల్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ అలా ఎలా చేయగలిగారో తెలియదు. అప్పట్లోనే భారీ మల్టీ స్టారర్ గా రూపొందిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈసినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, సూర్యకాంతం, ఛాయాదేవి, గుమ్మడి, రాజనాల, కన్నాంబలాంటి స్టార్ కాస్ట్ నటించింది. అయితే మూవీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. ఎవరిపాత్రలో వారు అదరగొట్టారనే చెప్పాలి.
మరీ ముఖ్యంగా కృష్ణుడిగా ఎన్టీ రామారావు, అర్జనుడిగా అక్కినేని నాగేశ్వరావు, ఘటోత్కచుడుగా ఎస్వీ రంగారావు, శశిరేఖగా సావిత్రి. ఈ నలుగురి పాత్రలు, వారి అభినయం అద్భుతం అని చెప్పాలి. ఎవరికి వారు వారి టాలెంట్ తో సినిమాకు ప్రాణం పోశారు. అయితే ఈ నలుగురిలోఎవరు లేకపోయినా సినిమా అంత అద్భుతంగా వచ్చేది కాదు. దాంతో అందులో మయాబజార్ కు నిజమైన హీరో ఎవరు అని చర్చ అప్పుడే జరిగిందట. అది కూడా ఆడియన్స్ లో కాదు ఈ నలుగు స్టార్స్ మధ్యే ఈ చర్చ వచ్చిందట.
ఈ విషయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ ఈ ముగ్గురు కాసేపు వాదించుకున్నారట. ఎన్టీఆర్ ఏమో నేను కృష్ణుడి పాత్ర చేశాను. నా మాయ లేకపోతే ఈ సినిమానే లేదు. నా వల్లే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది అన్నారట. అటు ఏఎన్నార్ ఏమో నేను లేకుంటే శశిరేఖా పరిణయమే లేదు. నా పాత్ర వల్లే ఈ కథ నడుస్తంది. కాబట్టి ఈ సినిమాకు నేనే హీరో అన్నారట. ఇక ఎస్వీఆర్ ఏమో నేను చేసిన ఘటోత్కచుడు పాత్ర ఈసినిమాకు ప్రాణం పోసింది. నా పాత్ర లేకుంటే ఈ సినిమానే లేదు. చివరిగా ఘటోత్కచుడు పాత్రవల్లే అభిమన్యుడి పెళ్లి అవుతుంది. కాబట్టి, ఈసినిమాకు హీరో నేనే అని అన్నారట ఎస్వీఆర్.
ఇలా వాదించుకుంటున్న టైమ్ లో ఏఎన్నార్ చివరికి అసలు విషయాన్ని తేల్చేశారట. అసలు ఈ సినిమాకు మన ముగ్గురం హీరోలం కాదు. మాయాబజార్ సినిమాకు అసలు హీరో సావిత్రి. ఈసినిమా అసలు కథ శశిరేఖా పరిణయం. ఆటైటిల్ కూడా పెట్టాలని అనుకున్నారు కదా. కథ అంతా ఆమె చుట్టునే తిరుగుతుంది. టైటిల్ పాత్ర ఆమెదే కాబట్టి ఈ సినిమాకు హీరో ఆమె అన్నారట. ఏఎన్నార్.
సావిత్రి శశిరేఖగా ఎంత సున్నితంగా నటించిందో.. ఎంత అద్భుతంగా ఎమోషన్స్ ను పలికించిందో, మాయా శశిరేఖగా అంతే గంభీరంగా నటించింది, మధ్యలో కాస్త కామెడీ కూడా మిక్స్ చేసి అభిమానులను అలరించింది. అంత అద్భుతమైన పాత్ర, ఆమె నటన మాయాబజార్ సినిమాను ఇంత అద్భుతంగా వచ్చేల చేసింది. కాబట్టి ఈసినిమాకు నిజమైన హీరో సావిత్రే అని అన్నారు ఏఎన్నారు.
ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళీ మోహన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆరోజుల్లో నటీనటులు చాలా సరదాగా ఉండేవారు. షూటింగ్ అంటే ఒక కుటుంబంలా చేసుకునేవారు. ఒకరిని మరొకరు గౌరవించుకునేవారు. ఇంటి నుంచి భోజనం తెప్పించి అందరితో కలిసి తినేవారు. మరీ ముఖ్యంగా సూర్యకాంతం లాంటివారు షూటింగ్ కు వస్తే, అక్కడివారందరికి భోజనం తీసుకువచ్చి కొసరి కొసరి వడ్డించేవారు.
అలా ఆ కాలంలో షూటింగ్స్ పండగలా జరిగేవి. ఎన్టీఆర్ ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, సూర్యకాంతం, ఛాయాదేవి, రాజనాల, గుమ్మడి. ఆతరువాత శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు లాంటి స్టార్స్ అంతా ఒకే కుటుంబంలా పనిచేశారు. మధ్యలో కొంత మంది మధ్య విభేదాలు వచ్చినా.. ఒకరిని మరొకరు గౌరవించుకునేవారు.