- Home
- Entertainment
- New Year Movies: కొత్త ఏడాది స్పెషల్‌గా థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే.. చిన్నోడు, పెద్దోడి మధ్య ఫైట్
New Year Movies: కొత్త ఏడాది స్పెషల్‌గా థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే.. చిన్నోడు, పెద్దోడి మధ్య ఫైట్
New Year Release Movies: న్యూ ఇయర్ సందర్భంగా ఈ సారి చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అన్నీ చిన్న చిత్రాలే ఉన్నాయి. అయితే వాటితోపాటు మహేష్ బాబు, వెంకటేష్ కోసం పోటీలోకి దిగారు.

కొత్త ఏడాది స్పెషల్‌గా రిలీజ్ కాబోతున్న సినిమాలివే
కొత్త ఏడాది సందర్భంగా చాలా వరకు సినిమాలు పెద్దగా రిలీజ్ కావు, చాలా తక్కువ సందర్భాల్లోనే ఈ అకేషన్ కి మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. అందులోనూ చిన్న చిత్రాలే ఉంటాయి. అవి కూడా ఒకటి అరకే పరిమితం. కానీ ఈ సారి మాత్రం చాలా సినిమాలు వస్తున్నాయి. ఐదు స్ట్రెయిట్ మూవీస్, రెండు రీ రిలీజ్ చిత్రాలుండటం విశేషం. వీటితోపాటు డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. మరి ఈ న్యూ ఇయర్ స్పెషల్‌గా రిలీజ్ కాబోతున్న సినిమాలేంటో చూద్దాం.
నందు `సైక్ సిద్ధార్థ`
కొత్త ఏడాది సందర్బంగా జనవరి 1న విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రధానంగా నందు నటించిన `సైక్ సిద్ధార్థ` ఉంది. ఈ మూవీ గత వారమే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అప్పుడు పోటీ ఉండటంతో వాయిదా వేశారు. న్యూ ఇయర్ స్పెషల్‌గా దీన్ని థియేటర్లోకి తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో నందుకి జోడీగా యామిని హీరోయిన్‌గా నటించింది. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, ఏసియన్ సురేష్, సౌత్ బే లైవ్, వేరే మీడియా నిర్మిస్తున్నాయి. సురేష్ ప్రొడక్షన్ రిలీజ్ చేస్తోంది. బోల్డ్ అండ్ క్రేజీ కంటెంట్‌తో రూపొందిన ఈ మూవీకి టికెట్ రేట్లు తగ్గించారు. సింగిల్ థియేటర్లలో రూ.99, మల్టీప్లెక్సుల్లో రూ.150 తో రిలీజ్ అవుతుండటం విశేషం. ఈ వారం ఉన్న వాటిలో దీనికి బజ్ బాగానే ఉంది.
అవినాష్ `వన వీర`
న్యూ ఇయర్ స్పెషల్‌గా రాబోతున్న మరో మూవీ `వన వీర`. అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ఇది. సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన `వనవీర` సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
మేఘ ఆకాష్ `సఃకుటుంబానాం`
మేఘ ఆకాష్ హీరోయిన్‌గా నటించిన `సఃకుటుంబానాం`మూవీ కూడా ఈ కొత్త ఏడాదికే విడుదలవుతుంది. ఇందులో రామ్ కిరణ్ హీరోగా నటించగా, రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మా బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఉదయ్ శర్మ దర్శకత్వం వహించారు. హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం విశేషం. ఈ మూవీ కూడా జనవరి 1నే రిలీజ్ కానుంది.
మాస్టర్ మహేంద్రన్ హీరోగా `నీలకంఠ`
పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా `నీలకంఠ`. ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మించారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. `నీలకంఠ` సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఉపేంద్ర, శివరాజ్ కుమార్ `45 మూవీ`
శివరాజ్ కుమార్, ఉపేంద్ర కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ `45`. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి అర్జున్ జన్య దర్శకుడు. ఇందులో `సు ఫ్రమ్ సో` ఫేమ్ రాజ్ బీ శెట్టి కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ చిత్రం అనేక సార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఇప్పుడు జనవరి 1న న్యూ ఇయర్ స్పెషల్‌గా విడుదల కాబోతుంది. కన్నడతోపాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.
ఆషికా రంగనాథ్ `గత వైభవం`
గతేడాది `నా సామిరంగా` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని కట్టిపడేసిన ఆషికా రంగనాథ్ ఇప్పుడు `గత వైభవం` మూవీతో తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేయబోతున్నారు. ఇందులో దుష్యంత్ హీరోగా నటించారు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా దీన్ని రూపొందించారు.
వీటితోపాటు జనవరి 1న `ఫెయిల్యూర్ బాయ్స్`, `ఇట్స్ ఓకే గురు`, `ఇక్కీస్` చిత్రాలు విడుదలవుతుండగా, జనవరి 2న `వినర ఓ వేమా`, `ఘంటాశాల`, `ఓ అందాల రాక్షసి` చిత్రాలు కూడా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి.
మహేష్ బాబు `మురారి` రీ రిలీజ్
కొత్త ఏడాది సందర్భంగా రీ రిలీజ్ చిత్రాలు సందడి చేయబోతున్నాయి. అందులో ముందుగా మహేష్ బాబు హీరోగా నటించిన `మురారి` ఉంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సోనాలీ బింద్రే హీరోయిన్‌గా నటించింది. మహేష్ బాబుకి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన చిత్రమిదే. 2001లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఇయర్ ఎండ్ స్పెషల్‌గా దీన్ని డిసెంబర్ 31న రేపు(బుధవారం) విడుదల చేస్తున్నారు.
వెంకటేష్ `నువ్వు నాకు నచ్చావ్` రీ రిలీజ్
అలాగే ఇప్పుడు చిన్నోడు మహేష్‌తో పెద్దోడు వెంకటేష్ పోటీ పడుతున్నాడు. ఆయన నటించిన `నువ్వు నాకు నచ్చావ్` కూడా ఈ న్యూ ఇయర్ స్పెషల్‌గా విడుదల అవుతుంది. ఇందులో వెంకటేష్ సరసన నటించిన ఆర్తి అగర్వాల్ నటించింది. త్రివిక్రమ్ దీనికి కథ, మాటలు రాశారు. స్రవంతి రవి కిశోర్ నిర్మించారు. ఈ మూవీ కూడా 2001లోనే విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 24ఏళ్ల తర్వాత దీన్ని మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. జనవరి 1న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. అన్నట్టు `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంలో మహేష్ బాబు, వెంకటేష్ చిన్నోడు, పెద్దోడుగా నటించిన విషయం తెలిసిందే.

