- Home
- Entertainment
- Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్ బాబు చిత్రాలివే
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్ బాబు చిత్రాలివే
వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ `నువ్వు నాకు నచ్చావ్`తో నాగార్జున, మోహన్ బాబు, జగపతిబాబు హీరోలుగా నటించిన చిత్రాలు పోటీ పడ్డాయి. వెంకీ దెబ్బకి డిజాస్టర్లుగా నిలవడం విశేషం.

`నువ్వు నాకు నచ్చావ్`తో వెంకీ బ్లాక్ బస్టర్
విక్టరీ వెంకటేష్ ఒకప్పుడు అపజయం ఎరుగని హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన చాలా వరకు రీమేక్ చిత్రాలు చేసి మెప్పించారు. వరుస విజయాలు అందుకున్నారు. అదే సమయంలో ఒరిజినల్ మూవీస్‌తోనూ ఆకట్టుకున్నారు. హిట్లు, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్లు కూడా అందుకున్నారు. వెంకటేష్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం `నువ్వు నాకు నచ్చావ్`. ఈ సినిమా 2001 సెప్టెంబర్‌లో విడుదలైంది. వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రంతో పోటీ పడి నాగార్జున, మోహన్ బాబు, జగపతిబాబు చిత్రాలు చిత్తైపోయాయి. అవేంటో తెలుసుకుందాం.
అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా `నువ్వు నాకు నచ్చావ్`
వెంకటేష్ హీరోగా, ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన `నువ్వు నాకు నచ్చావ్` చిత్రానికి కె విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ, డైలాగ్స్ అందించారు. ఆయన డైలాగ్స్ సినిమాకి హైలైట్‌గా నిలిచాయని చెప్పొచ్చు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా 2001 సెప్టెంబర్ 6న విడుదలైంది. థియేటర్లలో రచ్చ చేసింది. ఇందులో వెంకటేష్ కామెడీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. బ్రహ్మరథం పట్టారు. అదే సమయంలో లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఎలిమెంట్లు మరో ఎట్రాక్షన్‌గా చెప్పొచ్చు. దీంతో సినిమాకి అన్ని వర్గాల ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. బ్లాక్ బస్టర్ ని చేశారు. ఈ చిత్రం ఏడు కోట్లతో రూపొంది ఏకంగా రూ.18కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ని సాధించడం విశేషం. దాదాపు రెండు రెట్లు అధికంగా లాభాలను రాబట్టిందని చెప్పొచ్చు. ఆ టైమ్ లో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. 93 సెంటర్లలో యాభై రోజులు, 57 సెంటర్లలో వంద రోజులు ఆడింది. మూడు సెంటర్లలో 175 డేస్ ఆడింది.
నాలో ఉన్న ప్రేమ మూవీతో జగపతిబాబు పరాజయం
ఈ సినిమాతో పోటీ పడ్డ చిత్రాల్లో జగపతిబాబు హీరోగా వచ్చిన `నాలో ఉన్న ప్రేమ` మూవీ ఉంది. వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా చిత్రంలో జగపతిబాబుకి జోడీగా లయ, గజాల హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలైంది. అంటే `నువ్వు నాకు నచ్చావ్` మూవీకి వారం ముందుగానే రిలీజ్ అయ్యింది. ఇది ప్రారంభంలో డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కానీ పుంజుకునే లోపే వెంకటేష్ మూవీ రిలీజ్ కావడంతో ఆ దెబ్బతో ఇది చిత్తైపోయింది. పరాజయం చెందింది. అలా వెంకీ కారణంగా జగపతిబాబుకి గట్టి దెబ్బ పడిందని చెప్పొచ్చు.
వెంకీ దెబ్బకి నాగ్ `ఆకాశ వీధిలో` డిజాస్టర్
`నువ్వు నాకు నచ్చావ్` రిలీజ్ కి రెండు వారాల ముందే నాగార్జున నటించిన `ఆకాశ వీధిలో` మూవీ విడుదలైంది. నాగార్జున, రాజేంద్రప్రసాద్, రవీనా టండన్, కస్తూరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించడం విశేషం. నాగ్ చేసిన ప్రయోగాత్మక మూవీ ఇది. కానీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. సినిమా అంతో ఇంతో థియేటర్లలో రన్ అవుతుంది. ఎలాగైనా గట్టెక్కుతుందేమో అని మేకర్స్ భావించారు. కానీ వెంకీ సినిమా రావడంతో మొత్తం థియేటర్ల నుంచి ఎత్తేయాల్సి వచ్చింది.
మోహన్ బాబు, నాగ్‌లకు పెద్ద షాక్
`నువ్వు నాకు నచ్చావ్`కి రెండు వారాల గ్యాప్‌తో సెప్టెంబర్ 19న మోహన్ బాబు, నాగార్జున కలిసి నటించిన `అధిపతి` మూవీ విడుదలైంది. రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా మూవీని మోహన్ బాబు నిర్మించారు. ఇందులో ప్రీతి జంగానీ, సౌందర్య హీరోయిన్లుగా నటించారు. సౌందర్య.. నాగార్జునకి జోడీగా కాసేపే మెరిసింది. ఈ సినిమా డివైడ్ టాక్ వచ్చింది. అప్పటికే వెంకటేష్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. దీంతో దాని ప్రభావంతో ఈ సినిమా కూడా పరాజయం చెందాల్సి వచ్చింది. ఇలా నాగార్జునకి రెండు సినిమాలతోనూ దెబ్బతినాల్సి వచ్చింది.
వెంకీతో పోటీ పడి హిట్ కొట్టిన రవితేజ
అయితే `నువ్వు నాకు నచ్చావ్` విడుదలైన వారం తర్వాత రవితేజ హీరోగా వచ్చిన `ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం` రిలీజ్ అయ్యింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సెప్టెంబర్ 14న ఈ రొమాంటిక్ డ్రామా విడుదలైంది. ఇందులో రవితేజకి జోడీగా తనూ రాయ్ హీరోగా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. రవితేజకి సోలో హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. `నువ్వు నాకు నచ్చావ్`తో పోటీ పడి ఈ ఒక్క సినిమానే హిట్ అయ్యింది.

