చిరంజీవి తప్పుకోవడంతో.. రంగంలోకి మోహన్‌బాబు.. పెద్దదిక్కు అవుతాడా?.. మరి ఆ ట్రోల్స్ ఏంటి?
టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక పెద్దు పోస్ట్ ఖాళీగా ఉంది. అదే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఇప్పటి వరకు ఎలిజిబులిటీగా భావించిన చిరంజీవి తాను ఆ పెద్ద రికం చేయనని, ఆ పోస్ట్ తనకొద్దన్నారు. దీంతో ఆ పెద్ద రికం పోస్ట్ కోసం మోహన్‌బాబు పోటీ పడుతున్నాడని సమాచారం.
నాలుగేండ్ల క్రితం వరకు దర్శకరత్న దాసరి నారాయణ రావు తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్ద దిక్కుగా భావించారు. ఇండస్ట్రీలో కార్మికులు, నిర్మాతలు, దర్శకులు ఇలా ఎవరి మధ్య సమస్యలున్నా దాసరి మాట్లాడి సాల్వ్ చేసేవాడనే టాక్ ఉండేది. దీంతో ఆయన్ని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా భావించారు. 150కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించడం, నిర్మాతగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయనకు అపారమైన అనుభవం ఉంది. చిత్ర పరిశ్రమపై కమాండ్ ఉంది. పైగా ముక్కుసూటి మనిషి, మంచితనం, ఆదుకునే గుణం ఆయనలో ఉన్నాయని అంతా నమ్ముతారు. అందుకే ఆయన పెద్దరికాన్ని చాలా వరకు అంగీకరించారు. కానీ దాసరి మరణంతో ఆ పెద్ద దిక్కు లేదనే మాట తరచూ వినిపిస్తుంది. ఆ స్థానం చిరంజీవి తీసుకోవాలని, ఆయనే దీనికి కరెక్ట్ అని అంతా అంటున్నారు.
నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, అనుభవం, హుందాతనం, వివాదాలకు దూరంగా ఉండే తత్వం, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన చేస్తున్న సేవలు, ఇండస్ట్రీలో ఓ పెద్ద స్టార్‌గా ఆయనకంటూ ఓ గౌరవం ఉంది. ప్రస్తుతం చాలా యాక్టివ్‌గానూ ఉన్నారు. హీరోగా తిరుగులేని ఇమేజ్ ఆయన సొంతం. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కి చిరంజీవినే పెద్ద దిక్కు అని అంతా భావించారు. ఆయన పెద్దరికాన్ని కోరుకుంటున్నారు. అయితే చిరంజీవి కూడా కొంత మేరకు ఆ పోస్ట్ ని భర్తీ చేసే ప్రయత్నం చేశారు. కరోనా టైమ్‌లో `సీసీసీ`(కరోనా క్రైసిస్ ఛారిటీ) పేరుతో పేద కళాకారులను ఆదుకోవడం ముఖ్య పాత్ర పోషించారు.
కానీ ఇటీవల `మా` ఎన్నికల సమయంలో తలెత్తిన వివాదాలు ఆయన పేరుని డ్యామేజ్ చేశాయి. మంచు విష్ణు, మోహన్‌బాబు చేసిన కామెంట్లు చిరు పరువు తీసేలా చేశాయి. తనని `మా` ఎన్నికల నుంచి చిరంజీవి అంకుల్ తప్పుకోవాలని అన్నారని బాంబ్ పేల్చడంతో వివాదం కాస్త పెద్దదైంది. అంతిమంగా చిరంజీవి వివాదానికి కారణమయ్యాడనే నెగటివిటీ జనాల్లోకి వెళ్లింది.దీనికితోడు చిరంజీవి చేసిన కామెంట్లని కూడా మోహన్‌బాబు తప్పుపట్టడంతో అది కాస్త మరింతగా పెరిగింది. ఈ విషయంలోనే చిరంజీవి హర్ట్ అయినట్టు తెలుస్తుంది. చిల్లర గొడవల్లోకి పోయిపరువు పోగొట్టుకోవడం ఎందుకని భావించిన చిరు పెద్దరికం తనకొద్దని,ఇలాంటి గొడవల్లోకి తనని లాగొద్దని ఇటీవల పరోక్షంగా హింట్ ఇచ్చాడు. తాను పెద్దరికం తీసుకోనని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్‌కి పెద్దదిక్కు ఎవరనే ప్రశ్న మొదలైంది. దాసరి నిర్వహించిన పాత్రని ఎవరు పోషిస్తారనే వాదన మొదలైంది. `మా` ఎన్నికల సమయంలో నటుడు నరేష్.. మోహన్‌బాబు ఇండస్ట్రీ పెద్దగా బాధ్యతలు తీసుకోవాలని కామెంట్ చేశారు. అయితే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న మోహన్‌బాబు నిన్న(ఆదివారం) బయటకు వచ్చారు. వచ్చీ రాగానే ఆయన ఓ ట్వీట్ వదిలారు. ఇండస్ట్రీలో సరికొత్త చర్చకి తెరలేపారు. చిత్ర పరిశ్రమ అంటే నలుగురు హీరోలు, నలుగురు నిర్మాతలు, నలుగురు దర్శకులు, నలుగు డిస్ట్రిబ్యూటర్లు కాదని, కొన్ని వేల మంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు,వేల జీవితాలని తెలిపారు. గుత్తాధిపత్యం కాదని, అందరిని కలుపుకుని పోవాలని తెలిపారు. అదే సమయంలో తమ సమస్యల ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి తమకి బిక్ష పెట్టండని అడుక్కోవాలని తెలిపారు.
ఇంత వరకు బాగానే ఉంది కానీ మోహన్‌బాబు స్పందించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బిక్ష పెట్టాలని అడుక్కోవడమేంటి? అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అంటే పరోక్షంగా టాలీవుడ్ మొత్తం ఏపీ సీఎం వద్దకెళ్లి బిచ్చమెత్తుకోవాలా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా ఓ ఎత్తైతే ఇన్నాళ్లు ఎందుకు స్పందించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. `మా` ఎన్నికల సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలను కలిసి గౌరవించుకోవాలని, మన సమస్యలు చెప్పుకోవాలని తెలిపిన మోహన్‌బాబు ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇండస్ట్రీ పెద్దగా మోహన్‌బాబుని ఎవరూ అంగీకరించరని, ఆయనకు అందుకు సెట్ కారని నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏ రోజు చిత్రపరిశ్రమ సమస్యలపై స్పందించని ఆయన ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. ముందు కాలేజ్ రీయెంబర్స్ మెంట్ వచ్చేలా చూడాలని, ఆ తర్వాత చిత్రపరిశ్రమ గురించి మాట్లాడాలని విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ఇన్నాళ్లకి స్పందించిన కూడా ఏపీ టికెట్ రేట్లపై ఆయన సరైన విధంగా రియాక్ట్ కావడం లేదని, పైగా ఇండస్ట్రీపైనే విమర్శలు చేయడం పట్ల కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనే లీడ్ తీసుకుని సమస్యని పరిష్కరించడంలో ముందు ఉండొచ్చుగా అంటున్నారు. మొత్తంగా మోహన్‌బాబుని ఇండస్ట్రీ పెద్దగా ఎవరూ కన్సిడర్ చేయరని నిర్మొహమాటంగా చెబుతున్నారు నెటిజన్లు. మరి మోహన్‌బాబు ఎలాంటి లీడ్ తీసుకుంటారో చూడాలి.
also read: Chiranjeevi: మిస్టర్ కూల్ చిరంజీవికి ఏమైంది?