Chiranjeevi: మిస్టర్ కూల్ చిరంజీవికి ఏమైంది?
చిరంజీవి ఈ మధ్య సహనం కోల్పోతున్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల చిరంజీవి పబ్లిక్ వేదికలలో చేసిన ప్రసంగాలు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
చిరంజీవి(Chiranjeevi)కి వివాదరహితుడిగా, సౌమ్యశీలిగా పరిశ్రమలో మంచి పేరుంది. నాలుగు దశాబ్దాల చిరంజీవి నట ప్రస్థానంలో చెప్పుకోదగ్గ వివాదాలు లేవు. కొన్ని ఉన్నప్పటికీ... అవి ఆయన ప్రమేయం లేకుండానో, అనుకోకుండా చుట్టిముట్టినవే. తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్న చిరంజీవి ఎప్పుడూ గర్వం ప్రదర్శించలేదు. ఒదిగి ఉండే ఈ తత్త్వం ఆయనను పరిశ్రమలో ప్రత్యేకంగా మార్చింది. మెజారిటీ వర్గాల చేత ప్రేమించబడేలా చేసింది. ఇక పబ్లిక్ వేదికలపై చిరంజీవి సమయస్ఫూర్తితో మాట్లాడతారు. పొరపాటున కూడా తన మాటలు పెడదారి పట్టకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకుంటారు.
అలాంటి చిరంజీవి ఈ మధ్య సహనం కోల్పోతున్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల చిరంజీవి పబ్లిక్ వేదికలలో చేసిన ప్రసంగాలు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మూవీ ఆర్టిస్ట్స్ అధ్యక్ష ఎన్నికలు (MAA Elections) అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. మంచు విష్ణు-ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ప్రకాష్ రాజ్ కి చిరంజీవి కుటుంబం మద్దతుగా నిలిచింది. దీంతో మోహన్ బాబుతో విభేదాలు తలెత్తాయి. ఎన్నికల సమయంలో ఓ మూవీ ఫంక్షన్ లో పాల్గొన్న చిరంజీవి ... కొందరు పదవుల కోసం దిగజారిపోతున్నారంటూ... ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు.. చిరంజీవి అంకుల్ నన్ను పోటీ నుండి తప్పుకోమన్నారంటూ బాంబు పేల్చాడు.
తాజాగా మరో ప్రైవేట్ వేదిక సాక్షిగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు పరిశ్రమను కుదిపేశాయి. ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని నాకు లేదు, బిడ్డగా ఉంటాను. ఏదైనా సమస్య వస్తే స్పందిస్తాను. నా వంతు సాయం చేస్తాను. అంతే కానీ ఇద్దరు కొట్టుకుంటే, పంచాయితీలు చేయడం నా వల్ల కాదంటూ... షాకింగ్ కామెంట్స్ చేశారు. పరిశ్రమలో జరిగే గొడవలతో నాకు సంబంధం లేదని, పెద్దగా ఆ పంచాయితీలు చేయడం తనకు ఇష్టం లేదని చిరంజీవి స్పష్టంగా చెప్పినట్లు అయ్యింది.
పరిశ్రమకు పెద్దగా ఉండడం చిరంజీవికి ఇష్టం లేకపోతే ఆయన ఆ విషయం దాటవేస్తే సరిపోతుంది. లేదంటే అసలు కామెంట్ చేయకపోతే బాగుణ్ణు. కానీ ఇండస్ట్రీలో ఎవడెవడో కొట్టుకుంటే నేను తీర్చాలా...? అన్నట్లు ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యింది. పరిశ్రమలో కొందరిపై చిరంజీవి చాలా అసహనంగా ఉన్నారని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టం అవుతుంది.
Also read Chiranjeevi: ఇద్దరు కొట్టుకుంటే పంచాయతీ చేయను, ఇండస్ట్రీ పెద్దగా ఉండను.. తేల్చి చెప్పేసిన చిరంజీవి
కొన్నాళ్లుగా పరిశ్రమలో జరుగుతున్న ఆధిపత్య పోరు చిరంజీవికి నచ్చడం లేదు. ఇక 'మా' ఎన్నికల సమయంలో జరిగిన రచ్చ, పరిశ్రమ పరువు బజారుకీడ్చింది. నరేష్, మంచు విష్ణు, మోహన్ బాబు (Mohan Babu)వర్గం ఒకవైపు... నాగబాబు, ప్రకాష్ రాజ్ వర్గం మరోవైపు చేరి వ్యక్తిగత దూషణలకు దిగారు. చివరకు వాడు వీడు అనే స్థాయికి దిగజారారు. ఈ పరిణామాల నేపథ్యంలో గొడవలకు, పంచాయితీలకు దూరంగా ఉండాలనేది చిరంజీవి నిర్ణయం కావచ్చు. రెండు మూడు గ్రూపులుగా విడిపోయిన చిత్ర పరిశ్రమ ఒకరిని పెద్దగా ఒప్పుకోదు. అలాంటి పెద్ద అనే హోదా తీసుకోవడం ద్వారా అవమానాలు తప్పితే గౌరవం దక్కదని చిరంజీవి భావించి ఉంటారు. ఇక చిరు మనసులో ఎంత అసహనం గూడుకట్టుకుని ఉందో తెలియదు కానీ... ఆయన కూడా సహనం కోల్పోతున్నారు. సహనం, సమయస్ఫూర్తి చిరంజీవి ప్రధాన బలాలు కాగా.. కొన్ని బలహీనతలు వాటిని కూడా డామినేట్ చేస్తున్నాయి.
Also read ఏపీ టికెట్ రేట్లపై ఎట్టకేలకు స్పందించిన మోహన్‌బాబు.. `ఇండస్ట్రీ యూనిటి`పై ఘాటు వ్యాఖ్యలు