ఒక్క హిట్టు కోసం మెగా హీరోల ఎదురుచూపులు, నెక్స్ట్ బ్లాక్ బస్టర్ పక్కానా?
మెగా ఫ్యామిలీ హీరోల పరాజయాలతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. వరుసగా ప్లాప్ సినిమాలు ఇస్తుండటంతో మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరి రాబోయే మెగా మూవీస్ ఏంటి.? ఈసారైన ప్యాన్స్ కు సక్సెస్ ట్రీట్ ఇస్తారా?

ఒక్క హిట్ కావాలంటున్న మెగా ఫ్యామిలీ
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హవా చూపించిన మెగా ఫ్యామిలీ హీరోలకు గత రెండు మూడేళ్లుగా ఆశించిన విజయాలు అందటం లేదు. చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ వరకు—మెగా ఫ్యామిలీకి చెందిన చాలా మంది హీరోలు ఇటీవల విడుదలైన సినిమాలతో పరాజయాలను ఎదుర్కొన్నారు. వీరిలో చాలామంది ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.
KNOW
విశ్వంభర, ఓజీపై మెగా బ్రదర్స్ ఆశలు
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా అనూహ్యంగా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దాంతో మెగా బ్రదర్స అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ సాలిడ్ హిట్ కోసం చూస్తున్నారు. చిరంజీవి విశ్వంభర సినిమాతో రిలీజ్ కు రెడీ అవుతుంటే, పవన్ కళ్యాన్ మాత్రం ఓజీ సినిమాతో దుమ్మురేపే యాక్షన్ తో రాబోతున్నాడు. మరి ఈసారి అయితే ఈ ఇద్దరు హీరోలు మెగా ప్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తారేమో చూడాలి.
పెద్ది కోసం శ్రమిస్తున్న చరణ్
ఇక మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తరువాత రెండు డిజాస్టర్స్ ను ఫేస్ చేశాడు. మరోకటి పడితే హ్యాట్రిక్ ఫెయిల్యూర్ మచ్చ మిగిలిపోతుంది. ట్రిపుల్ ఆర్ తరువాత ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలు రామ్ చరణ్ ను ఆయన ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేశాయి. దాంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు చరణ్. బుచ్చిబాబుతో కలిసి పెద్ది టైటిల్ తో రూరల్ కాన్సెప్ట్ తో స్పోర్డ్స్ డ్రామాను చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి చరణ్ ఈసారైనా మెప్పిస్తాడో లేదో చూడాలి.
తండ్రి కాబోతున్న వరుణ్ తేజ్
ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒక్క హిట్టు బాబోయ్ అంటున్నాడు. ఆయన నటించిన గాండీవధారి అర్జున, ఆతరువాత మట్కా సినిమా కూడా భారీ డిజాస్టర్స్ అందుకున్నాయి. దాంతో వరుణ్ అసలు స్క్రీన్ మీద కనిపించకుండాపోయాడు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలో తండ్రి కాబోతున్న వరుణ్, తన భార్య లావణ్యను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. దాంతో పాటు ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. మరి ఇది అయినా వరుణ్ ను ప్లాప్ ల నుంచి గట్టెక్కిస్తుందా లేదా చూడాలి.
కనిపించని మెగా మేనల్లుడి సందడి
ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ది కూడా అదే పరిస్థితి. సాయి తేజ్ తన మేనమామన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో బ్రో సినిమా చేశాడు. కాని ఈసినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమాపై కూడా పెద్దగా హైప్ లేదు. మరి సాయి తేజ్ హిట్ కోసం ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. అటు మరో మెగా మేనల్లుడు, సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హిట్టు బాబోయ్ అంటున్నాడు. అసలు 2023 లో వచ్చిన ఆదికేశవ సినిమా తరువాత వైష్ణవ్ అసలు సినిమాలే చేయలేదు.
ఆశతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
ఈ నేపథ్యంలో, మెగా ఫ్యామిలీ నుంచి మంచి హిట్ కోసం ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ప్రస్తుతం పవన్ OG, చిరంజీవి విశ్వంభర సినిమాలపై నమ్మకంతో ఉన్నారు. మెగా ఫ్యామిలీ తిరిగి విజయం దిశగా అడుగులు వేయాలని వారు కోరుకుంటున్నారు. ఈసారి మెగా మూవీస్ వరుసగా హిట్ అయితే ఇండస్ట్రీలో మరోసారి మెగా డామినేషన్ కనిపించే అవకాశముంది. అదే సమయంలో, మళ్ళీ పరాజయాలే ఎదురైతే మాత్రం ఈ ఫ్యామిలీకి గట్టి షాక్ తప్పదు.