- Home
- Entertainment
- Coolie Movie Review:ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టిన రజినీకాంత్, నాగార్జున విలన్ గా మెప్పించాడా ?
Coolie Movie Review:ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టిన రజినీకాంత్, నాగార్జున విలన్ గా మెప్పించాడా ?
సూపర్ స్టార్ రజనీకాంత్ , కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన పక్కా మాస్ మల్టీ స్టారర్ మూవీ కూలీ. తలైవా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఈ రోజు (ఆగస్ట్ 14) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఇక కూలీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ చూద్దాం.

కూలీ సినిమా రివ్యూ
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా టాలీవుడ్ కింగ్ నాగార్జున నెగెటీవ్ రోల్ చేసిన సినిమా కూలీ. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. రజినీకాంత్, నాగార్జునతో పాటుగా ఈసినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, సత్యరాజ్, బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ కూడా నటించారు. ఇంత మంది స్టార్ హీరోలు కలిసి సందడి చేసిన ఈమూవీ ప్రేక్షకులను అలరించిందా? ఈమూవీలో అద్భుతం అనుకున్న విషయాలేంటి, ఎవరు ఎలా నటించారు. ఎక్కడ పొరపాట్లు చేశారు. ఓవర్ ఆల్ గా ఈసినిమాకు ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అనేది కూలీ రివ్యూలో తెలుసుకుందాం.
KNOW
కథ విషయానికి వస్తే
కూలీ సినిమా కథ విషయానికి వస్తే.. సైమన్ (నాగార్జున అక్కినేని) అనే పోర్టు మాఫియా లీడర్ చుట్టూ కూలి సినిమా కథ తిరుగుతుంది. సైమస్ పోర్ట్ లో అక్రమ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. సైమన్ వద్ద దయాల్ (సౌబీన్ షాహిర్) నమ్మకంగా పనిచేస్తుంటాడు. సైమన్ చేసే అక్రమ వ్యాపారాన్ని తెలుసుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటారు. అలాంటి వారిని గుర్తించి చంపేయడం దయాల్ పనిగా పెట్టుకొంటాడు. అయితే ఇదే క్రమంలో రాజశేఖర్ (సత్యరాజ్)ను దయాల్ చంపేస్తాడు. రాజశేఖర్ మృతదేహాన్ని చూసేందుకు అతని స్నేహితుడు దేవ వస్తాడు. కాని రాజశేఖర్ కూతురు ప్రీతీ (శృతి హాసన్) తండ్రిని చూడనీవ్వకుండా దేవాను అడ్డుకుంటుంది.
అయితే మాఫీయా వల్ల రాజశేఖర్ మరణం జరగడం, వారి వల్లే ప్రీతీ, ఆమె చెల్లెలికి కూడా ప్రమాదం ఉందని తెలుసుకున్న దేవా, వారిని రక్షించేందుకు రంగంలోకి దిగుతాడు. తన స్నేహితుడి కుటుంబం కోసం ఏదైనా చేయడానికి సిద్దపడతాడు దేవా. మరో వైపు సైమన్ అక్రమ వ్యాపారాలు, దయాల్ హత్యలు కొనసాగుతుంటాయి. సైమస్ కంపెనీలో పనిచేస్తున్నవారు కూడా వరుసగా హత్యలకు గురవుతుంటారు. మరి దేవా–రాజశేఖర్ మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈక్రమంలో ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ ల ఎంట్రీ ఎప్పుడు జరుగుతుంది. వారి వల్ల కథలో కలిగే మార్పులేంటి. చివరకు సైమస్ కథ సమాప్తం అవుతుందా లేదా, దాహా (అమీర్ ఖాన్)కు దేవాకు ఉన్న కనెక్టవిటీ ఏమిటి? సైమన్‌కు దేవా ఎలాంటి గుణపాఠం చెప్పాడు అనేది సినిమా చూసి తెలుసుకోవల్సిదే.
కూలీ సినిమా విశ్లేషణ
మాఫియా నేపథ్యంలో బోలెడు సినిమాలు వచ్చాయి. కథను అటు తిప్పి ఇటు తిప్పి , పాత్రలకు కాస్త డిఫరెంట్ మేకప్ తగిలిస్తే సినిమా అయిపోతుంది. అయితే మాఫియా సినిమాల్లో ఈసినిమా కాస్త కొత్తగా అనిపించిందని చెప్పవచ్చు. అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన ఎలివేషన్ సీన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈమధ్య జైలర్ లాంటి సినిమాల్లో రజినీకాంత్ కనిపించిన ప్రతీ సీన్ కు ఎలివేషన్ ఇచ్చి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. సరిగ్గా కూలీలో కూడా ఇదే ఫార్ములా వర్కౌట్ అయ్యింది. రజినీకాంత్ కనిపించినప్పుడల్లా.. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో దడదడలాడించగా.. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. కథలో అంత బలం లేకపోయినా.. రజినీకాంత్ సీన్స్ తో సినిమాను కాస్త మందు నిలబెట్టగలిగాడు దర్శకుడు. రజనీకాంత్ స్టైలిష్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే నాగార్జున చేసిన సైమన్ పాత్రపై డైరెక్టర్ ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. నాగార్జున పాత్రను అద్భుతంగా డిజైన్ చేసిన లోకేష్.. ఇంపార్టెన్స్ ఇచ్చే విషయంలో రజినీని డామినేట్ చేయకుండా చూసుకున్నాడు. ఇక మాస్ యాక్షన్ సీన్స్ కు ఈ సినిమాలో ఏమాత్రం కొదవలేదు అని చెప్పాలి. ఎమెషన్స్ డోస్ ఇంకాస్త పెంచి ఉంటే బాగుండేది అనిపించింది. డైరెక్షన్ లో తిరుగులేని ఇమేజ్ ఉన్న లోకేష్ ఈసారి కాస్త తడబడినట్టు అనిపించింది.
రజినీకాంత్ తో పాటు నటీనటులు ఎలా చేశారంటే?
ఇక నటీనటుల విషయానికి వస్తే అందరు ఎవరి పాత్రలు వారు అద్భుతంగా పండించారు. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తన స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ తో మరోసారి ఆడియన్స్ ను ఉర్రూతలూగించారు. దేవా పాత్రలో సూపర్ స్టార్ ను చూసిన ఫ్యాన్స్ థియేటర్ లో విజిల్స్ వేస్తూ, కేరింతలు కొడుతూ.. ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నాగార్జున పాత్ర ఎంట్రీ ఇవ్వగానే థియేటర్లు దద్దరిల్లి పోయాయి. కాని తెలుగు ఆడియన్స్ తో పాటు నాగ్ ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అయినట్టు తెలుస్తోంది. నాగార్జున పాత్ర విషయంలో డైరెక్టర్ ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పవర్ ఫుల్ గా ఉండాల్సిన సైమన్ పాత్రను తేలికగా తీసుకున్నట్టు అర్ధం అవుతుంది. దాంతో కింగ్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారనే చెప్పాలి.
ఇక మరో విషయం చెప్పుకోవాలి.. ఈసినిమాకు అసలు హీరో అంటే మలయాళ నటుడు సౌబీన్ షాహిర్ అనే చెప్పాలి. దయాల్ పాత్రలో ఆయన చేసిన నటన సినిమాకు ఓ మేజర్ పవర్ గా నిలిచింది. ప్రతి సన్నివేశంలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మెప్పించగలిగింది. చివర్లో అమీర్ ఖాన్, ఉపేంద్ర పాత్రలు ఇంట్రెస్టింగ్‌గా మలచబడ్డాయి. వారి ఎంట్రీలకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఎప్పటిలాగానే శ్రుతి హాసన్ తన నట ప్రతిభ చూపించింది. సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాత్ర పరిదిమేరకు అద్భుతంగా నటించి మెప్పించాడు.
టెక్నికల్ గా కూలీ సినిమా
సాంకేతిక పరంగా కూలీ సినిమాకు బలాన్ని ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అని చెప్పాలి. ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లాస్ పాయింట్ గా మారింది. మరీ ముఖ్యంగా రజనీకాంత్ ఎలివేషన్ సీన్స్ కు బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చే మ్యుజిక్ ఆడియన్స్ ను కూర్చోనివ్వలేదు అని చెప్పాలి. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్‌లు హై క్వాలిటీగా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అత్యుత్తమంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈసినిమాకు కొన్ని మైనస్ లు ఉన్నాయి. కథ, స్క్రీన్‌ప్లే పరంగా సినిమా నత్తనడకన సాగడం, ఒరిజినాలిటీ లేకపోవడం సినిమాకు నెగెటివ్‌గా మారింది. ఆడియన్స్ భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్ళినా, పూర్తి స్థాయిలో తృప్తి పొందగలరన్న నమ్మకం లేదు. కాని రజినీ ఫ్యాన్స్ కు ఇది ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని చెప్పవచ్చు. మరి థియేటర్ రన్ లో రాను రాను అద్భుతం చేస్తుందో లేదో చూడాలి.
ఫైనల్ గా
మొత్తానికి, కూలీ సినిమాలో రజనీకాంత్, నాగార్జున సౌబీన్ షాహిర్, శృతి హాసన్ నటన, అనిరుధ్ మ్యూజిక్ ఆకట్టుకున్నప్పటికీ, కొన్ని మైనస్ లు లేకపోలేదు. అయితే ఈమూవీ రన్నింగ్ లో ఆడియన్స్ ను మెప్పించే అవకాశం ఉంది. బోరింగ్ అని చెప్పడానికి ఛాన్స్ లేదు. అన్ని రకాల ప్రేక్షకులు , ముఖ్యంగా మాస్ జనాలు వెళ్లి చూడగలిగే సినిమా కూలీ